నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు రైతులకు వారబందీ ప్రధాన సమస్యగా మారింది. ఖరీఫ్‌లో వరుస తుపానులతో పంటలు దెబ్బతినగా..
మిర్యాలగూడ, న్యూస్‌లైన్: నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు రైతులకు వారబందీ ప్రధాన సమస్యగా మారింది. ఖరీఫ్‌లో వరుస తుపానులతో పంటలు దెబ్బతినగా.. దోమకాటు వల్ల పంట దిగుబడి పూర్తిగా తగ్గింది. దీంతో రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. కాగా రబీ సీజన్‌లో వరి పంటలకు సాగు నీటిని ఇస్తారని ఆశించిన రైతులకు వారబందీ అడ్డంకిగా మారింది. వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేయనున్నట్లు ఎన్‌ఎస్‌పీ అధికారులు చేసిన ప్రకటన రైతులకు తలనొప్పిగా మారింది. డిసెంబర్ 20వ తేదీ నుంచి నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలోని 4.35 లక్షల హెక్టార్లకు వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
కానీ ప్రకటన చేసే నాటికి ఖరీఫ్‌లో వరి కోతలు పూర్తికాకపోవడంతో పాటు రబీనాట్లకు నార్లు సిద్ధంగా లేకపోవడంతో నాట్లు ప్రారంభం కాలేదు. ఈ నెల మొదటి వారంలో నాట్లు ప్రారం భం కావడంతో ఇప్పటి వరకు కేవలం 30 శాతం నాట్లు మాత్రమే పూర్తయ్యాయని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. కాగా పూర్తిస్థాయిలో వరినాట్లు వేయడానికి మరో25 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. కాగా వారబందీ పద్ధతిలో సాగు నీటిని విడుదల చేస్తే రైతుల వరినాట్లు కష్టంగా మారే అవకాశం ఉంది. దీంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. కనీసం వరి నాట్లు పెట్టేందుకే ఫిబ్రవరి 10వ తేదీ వరకు నీటిని విడుదల చేయాల్సి ఉంది.
రబీలో 50 టీఎంసీల నీరే
నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు రబీ సీజన్‌లో కేవలం 50 టీఎంసీల నీరే ఇస్తున్నట్లు ప్రకటించారు. 50 టీఎంసీల నీటితో నల్లగొండ, ఖమ్మం, కృష్ణా జిల్లాలోని 4.35 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు వారబందీ పద్ధతిలో నీటిని అందించనున్నారు. కానీ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలోనే ఉన్న ఎత్తిపోతల పథకాలకు పరిగణనలోకి తీసుకోలేదు. ఎడమ కాలువ ఆయకట్టులో అంతర్భాగమైన 41 ఎత్తిపోతల పథకాల పరిధిలో 80వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించగా సుమారు లక్ష ఎకరాల ఆయకట్టు ఉంది. కాగా దానిని కూడా పరిగణనలోకి తీసుకుంటే రబీలో మరో 10టీఎంసీల నీటిని ఎడమ కాలువకు కేటాయించాల్సి ఉంది. కానీ అధికారులు ఎత్తిపోతల పథకాలను ఆయకట్టులో చూపకుండా తక్కువ నీటిని కేటాయించారు.
ఫిబ్రవరి 10 వరకు నీళ్లివ్వాలని
రైతుల ఆగ్రహం
వారబందీ పేరుతో నీటిని నిలిపివేస్తే ఊరుకునేది లేదని రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంబందీ షెడ్యూల్ ప్రకటించే సమయంలో రైతులతో చర్చించకుండానే నిర్ణయించారని ఫిబ్రవరి 10వ తేదీ వరకు నీటిని యధావిధిగా విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక సాగు నీటి ఆయకట్టు అభివృద్ధి శిక్షణ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయకట్టులో వరినాట్లు పూర్తయ్యే వరకు వారబందీ లేకుండా నీటిని విడుదల చేయాలని, ఆ తర్వాత సమీక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. వరినాట్ల సమయంలో నీటిని నిలిపివేస్తే ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.