మిర్యాలగూడ, న్యూస్‌లైన్: నాగార్జునసాగర్ ప్రాజెక్టులో అంతర్భాగమైన సహకార ఎత్తి పోతల పథకాలకు మహర్దశ పట్టనుంది. సాగర్ ఎడమకాల్వపై ఉన్న ఎత్తిపోతల పథకాలను ఆధునికీకరించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి కృషితో కాలువ చివరి భూములకు సాగునీటిని అందించడానికి ప్రపంచబ్యాంకు ముందుకొచ్చిన విషయం విదితమే. అందులో భాగంగానే 2008 సంవత్సరం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆధునికీకరణ పనుల కోసం రూ. 4444.41 కోట్లు వెచ్చించి చేస్తున్నారు. ఈ నిధులను ఎత్తిపోతలకు కూడా ఖర్చు చేయనున్నారు. దీనికోసం నీటి పారుదల అభివృద్ధి శాఖ అధికారులతో కలిసి ప్రపంచ బ్యాంకు బృందం ఇటీవల ఎత్తిపోతల పథకాలను సందర్శించి సర్వే నిర్వహించింది. జిల్లాలోని 40 ఎత్తిపోతల పథకాల్లో ఎల్- 27 మినహా మిగతా 39 ఎత్తిపోతల పథకాలకు రూ.91.50 కోట్లు కేటాయించారు. అయితే రూ.100 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ రబీ సీజన్ పూర్తికాగానే పనులు మొదలుపెడతారు. మొత్తంగా 39 ఎత్తిపోతలను నాలుగు ప్యాకేజీలు విభజించారు. ఆ మేరకు నిధులు కూడా కేటాయించారు. ప్యాకేజీల వారీగానే టెండర్ల ప్రక్రియను చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల ఆయకట్టు అభివృద్ది సంస్థ (ఏపీఎస్‌ఐడీసీ) చర్యలు తీసుకుంటోంది.
తొలగనున్న రైతుల కష్టాలు..
నాగార్జునసాగర్ ఎడమ కాలువపై ఉన్న 40 ఎత్తిపోతల పథకాల కింద స్థీరికరించిన ఆయకట్టు 68,364 ఎకరాలు. కాగా ఆధునికీకరణలో భాగంగా పనులు చేపడితే కాలువ చివరి భూములకు కూడా సాగునీరందే అవకాశాలు ఉన్నాయి. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ప్రస్తుతం 75 శాతం ఎత్తిపోతల పథకాల కింద సాగుభూమి బీడుగా మారింది. మిర్యాలగూడ నియో జకవర్గంలో 40శాతం కాలువ చివరి భూములకు నీరందడం లేదు. మిగతా ఎత్తిపోతల పథకాల్లోనూ అదే పరిస్థితి నెలకొని ఉంది. ఆధునికీకరణ పనులు పూర్తయితే పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందుతుంది. దీంతో కాలువ చివరి భూముల రైతుల కష్టాలు తీరనున్నాయి. పనులు త్వరగా ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.
మూడో ప్యాకేజీ
మిర్యాలగూడ నియోజకవర్గం లోని 8 ఎత్తిపోతల పథకాలు ఈ ప్యాకేజీలో ఉన్నాయి. దీనికి రూ.18.30 కోట్లు కేటాయించారు. టెండర్ల ప్రక్రియ పూర్తయింది. కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్లు కూడా మార్చి నెలాఖరు వరకు పూర్తి కానున్నాయి. కాగా ఏప్రిల్ మొదటి వారంలో పనులు మొదలవుతాయి.
నాలుగో ప్యాకేజీ
మిర్యాలగూడ, సూర్యాపేట నియోజకవర్గాలలోని ఆరు ఎత్తిపోతల పథకాలు ఈ ప్యాకేజీలో ఉన్నాయి. దీనికి రూ.33 కోట్లు కేటాయించారు. టెండర్ల ప్రక్రియ నిర్వహించాల్సి ఉంది.
మొదటిప్యాకేజీ
హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాలలోని 10 ఎత్తిపోతల పథకాలు ఈ ప్యాకేజీలో ఉండగా, రూ.19.50 కోట్లు కేటాయించారు. పనులు కూడా కొన్నిచోట్ల మొదలయ్యాయి.
రెండవ ప్యాకేజీ
నాగార్జునసాగర్ నియోజక వర్గంలోని 15 ఎత్తిపోతల పథకాలు ఈ ప్యాకేజీలో ఉన్నాయి. దీనికి రూ.20.70 కోట్లు కేటాయించారు. టెం డర్ల ప్రక్రియ నిర్వహించాల్సి ఉంది.
నిధుల ఎత్తిపోత
Published Sun, Jan 12 2014 4:17 AM | Last Updated on Fri, Oct 19 2018 7:33 PM
Advertisement