మిర్యాలగూడ, న్యూస్‌లైన్: రబీ సీజన్‌లో నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలోని వరి రైతులకు కష్టాలు తప్పేలాలేవు. గత నెల 20వ తేదీ నుంచి ఎన్‌ఎస్‌పీ అధికారులు నీటిని విడుదల చేసినా వరినార్లు లేకపోవడంతో ఫలితం లేకుండా పోయింది. ఈ నెల 16వ తేదీన మరోమారు నీటి విడుదలపై చర్చలో పాల్గొన్న రైతులు, నీటి సంఘాల మాజీ ప్రతినిధులు ఎన్‌ఎస్‌పీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి వరినాట్లు పూర్తయ్యే వరకు వారబందీ నిబంధనలు పెట్టవద్దని, ఫిబ్రవరి 10 వరకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేసిన విషయం విదితమే. రైతుల విన్నపాలను పరిగణనలోకి తీసుకుని నీటి విడుదల షెడ్యూల్‌ను జారీ చేస్తున్నామని చెప్పిన అధికారులు కేవలం ఫిబ్రవరి 3వ తేదీ వరకే నీటిని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో కాలువ చివరి భూములకు సాగు నీరు అందడం కష్టంగా మారే అవకాశాలు ఉన్నాయి.
జోరుగా వరినాట్లు
ప్రస్తుతం ఆయకట్టు పరిధిలో వరి నాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు 30 శాతం అంటే కేవలం 1.30 లక్షల ఎకరాల్లో మాత్రమే వరినాట్లు పూర్తయ్యాయి. కాగా ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎక్కువగా నాట్లు వేసే అవకాశాలు ఉన్నాయి. కానీ నీటిని ఫిబ్రవరి 3వ తేదీన మొదటి విడత నిలిపివేయడంతో రైతులు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
4.31 లక్షల ఎకరాలకే రబీలో నీరు..
సాగర్ ఎడమ కాలువ పరిధిలోని కేవలం 4,31, 325 ఎకరాలకే సాగునీటిని అందిస్తున్నారు. ఎడమ కాలువ పరిధిలోని నల్లగొండ, ఖమ్మం, కృష్ణా జిల్లాల్లో 10.28 లక్షల ఎకరాలు ఆయకట్టు ఉంది. కానీ సాగర్‌లో నీటి లభ్యత ఆధారంగా కేవలం రబీలో ఎడమ కాలువ కింద సాగుకు కేవలం 50 టీఎంసీల నీటినే కేటాయించారు. దీంతో సగం ఆయకట్టుకు కూడా నీటిని విడుదల చేయడం లేదు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తప్పవు..
సాగర్ ఎడమ కాలువకు ఐదు విడతలుగా నీటి ని విడుదల చేయనున్నారు. మొదటి విడతలో వరినాట్ల కోసం 19 రోజుల పాటు నీటిని విడుదల చేస్తుండగా మిగతా నాలుగు విడతల్లో కేవ లం పది రోజులు నీటిని విడుదల చేసి ఐదు రో జులు నీటిని నిలిపి వేయనున్నట్లు ఎన్‌ఎస్‌పీ అధికారులు షెడ్యూల్ ప్రకటించారు.
రెండోవిడత ఫిబ్రవరి 9న, మూడోవిడత 24, నాలుగో విడత మార్చి 11న, ఐదో విడత మార్చి 26 నుం చి ఏప్రిల్ 4వరకు నీటి విడుదల ఉంటుంది. వరుసగా ఐదు రోజుల పాటు నీటిని నిలిపివేస్తే కాలువ చివరి భూముల్లో తిరిగి నీరందే వరకు మరో ఐదు రోజులు పట్టే అవకాశం ఉంది. దాంతో కాలువ చివరి భూములకు రబీలో నీరందడం కష్టంగానే ఉంది. దాంతో రైతులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకోవాలని ఎన్‌ఎస్‌పీ అధికారులే సూచిస్తున్నారు. కాగా రైతులు కూడాముందుచూపుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల వైపు దృష్టిసారిస్తున్నారు.
చివరికి కష్టమే!
Published Sun, Jan 19 2014 3:48 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM
Advertisement