రబీ సాగు లక్ష్యం 57.66 లక్షల ఎకరాలు
ఇప్పటి వరకు సాగు చేసిన విస్తీర్ణం 38.63 లక్షల ఎకరాలు
30 లక్షల ఎకరాల్లోనే ఈ పంట నమోదు
నోటిఫైడ్ పంటలకు రైతుల నుంచి ఈ–కేవైసీ తప్పనిసరి
ఇప్పటి వరకు ఈ–కేవైసీ పూర్తయిన విస్తీర్ణం 10.88లక్షల ఎకరాలే
30 శాతం రైతుల నుంచే ఈ–కేవైసీ నమోదు
సాంకేతిక సమస్యలతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు
సాక్షి, అమరావతి: రబీ సీజన్‌కి సంబంధించి ఈ–కేవైసీ( E-KYC) నమోదు నత్తనడకన సాగుతోంది. నోటిఫై పంటలకు నూరు శాతం ఈ–కేవైసీ పూర్తి కాకపోతే పంటల బీమా పరిహారం పొందడంలో రైతులు తీవ్రంగా నష్టపోతారు. రబీ సీజన్‌లో సాగు లక్ష్యం 57.66 లక్షల ఎకరాలు కాగా ఇప్పటివరకు 14 లక్షల మంది రైతులు 38.63 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేశారు. ఇందులో 30 లక్షల ఎకరాల్లో (77 శాతం) సాగవుతున్న పంటలను మాత్రమే ఈ – పంటలో నమోదు చేశారు.
ఇక ఈ–కేవైసీ నమోదు మాత్రం అసలు ముందుకు సాగడం లేదు. వీఏఏలు 27.60 లక్షల ఎకరాలకు, వీఆర్వోలు, 23.95 లక్షల ఎకరాలకు సంబంధించి అథెంటికేషన్ పూర్తి చేయగా, కేవలం 4 లక్షల మంది రైతులు 10.88 లక్షల ఎకరాలకు (30 శాతం) మాత్రమే ఈ–కేవైసీ పూర్తి చేయగలిగారు.
నోటిఫై పంటలకు ఈ–కేవైసీ తప్పనిసరి
ప్రస్తుత రబీ సీజన్ నుంచి ఈ క్రాప్ నమోదులో కొన్ని మార్పులు చేశారు. అన్ని పంటలకు 50 మీటర్ల పరిధిలో జియో రెఫరెన్స్ తప్పనిసరి చేసారు. నాన్ నోటిఫైడ్ పంటలు, సామాజిక అడవులకు సంబం«ధించి ఈ–కేవైసీని రైతులు ఇష్టపూర్వకంగా నమోదు చేసుకోవచ్చు. పంటల బీమా కోసం నోటిఫై చేసిన పంటలు సాగు చేసిన రైతులకు ఈ–కేవైసీ తప్పనిసరి చేశారు.
తొలుత రైతులు సాగు చేసే పంట వివరాలను రైతు సేవాకేంద్రం (ఆర్‌ఎస్‌కే)లోని ఈ–పంట వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేసి క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ఫొటోలను ఈ–పంట యాప్ ద్వారా అప్లోడ్ చేయాలి. బయోమెట్రిక్ అథెంటికేషన్ (ఈ–కేవైసీ) పూర్తయిన తరువాత భౌతికంగా రసీదులిస్తారు. కౌలుగుర్తింపు కార్డు లేక పోయినా వాస్తవంగా సాగుచేస్తున్న వారి పేరిటే నమోదు చేయాలని వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
వాస్తవానికి రబీ సీజన్‌లో నోటిఫై చేసిన వ్యవసాయ పంటల విస్తీర్ణం 45.55 లక్షల ఎకరాలు కాగా 9.93 లక్షల ఎకరాలకే రైతులు బీమా చేయించుకున్నారు. అయితే ఎవరు ఎక్కడ ఎంత విస్తీర్ణంలో బీమా చేయించుకున్నారో తెలియని పరిస్థితి. నోటిఫైడ్ పంటలకు సంబంధించి సాగుచేసిన ప్రతి ఎకరాకు ఈ–కేవైసీ నమోదు చేయాల్సిందే. లేకుంటే ఆ మేరకు పంటల బీమా పొందేందుకు ప్రీమియం చెల్లించిన రైతులు నష్టపోతారు.
ఫిబ్రవరి 25లోగా నూరు శాతం ఈ–కేవైసీ
నిర్ధేశించిన గడువులోగా ఈ–పంట నమోదు పూర్తవుతుందో లేదో అనే ఆందోళన నెలకొంది. నోటిఫైడ్ పంటలకు సంబంధించి నూరుశాతం ఈ–కేవైసీ నమోదు చేయాలన్న నిబంధనతో ఆర్‌ఎస్‌కే సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. గతంలో వలంటీర్ల సహకారంతో ఈ–పంట నమోదుతో పాటుగా ఈ–కేవైసీ కూడా వేగంగా పూర్తి చేసేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు.
విత్తనాలు, ఎరువుల పంపిణీతో పాటు వివిధ రకాల సర్వే బాధ్యతలు కూడా ఆర్‌ఎస్‌కే సిబ్బందికి అప్పగిస్తున్నారు. దీంతో ఈ–పంట, ఈ–కేవైసీ నమోదు సందర్భంగా వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈ–పంట నమోదుతో పాటు ఈ–కేవైసీ నమోదుకు ఫిబ్రవరి 25వ తేదీ వరకు గడువిచ్చారు. మార్చి 1 నుంచి 5వ తేదీ వరకు ఆర్‌ఎస్‌కేల్లో జాబితా ప్రదర్శిస్తారు.
10వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి మార్చి 15న తుది జాబితాలు రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శిస్తారు. మరోవైపు ఈ–పంట నమోదు కాకపోతే పంట నష్టపరిహారం, పంటల బీమా పరిహారాన్ని రైతులు కోల్పోతారు. చివరికి పంట అమ్ముకునే విషయంలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు.
Comments
Please login to add a commentAdd a comment