పల్నాడు జిల్లా ధాన్యసిరులతో తుల తూగనుంది. రబీలో సాగు చేసిన వరి పొలాలు కోతకొచ్చాయి. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 40 బస్తాల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో పంట సేకరణకూ ప్రభుత్వం సిద్ధమైంది. 211 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది.
నరసరావుపేట: పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో నాగార్జున సాగర్ ఆయకట్టు కింద రబీలో 72,731 ఎకరాల్లో వరి సాగైంది. ప్రధానంగామాచర్ల, గురజాల, నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లోని రైతులు వరి పంట వేశారు. ప్రస్తుతం పంట కోతదశకొచ్చింది. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు దిగుబడిని అంచనా వేశారు. జిల్లావ్యాప్తంగా సుమారు 1.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. ఇందులో లక్ష మెట్రిక్ టన్నల ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం జిల్లా వ్యాప్తంగా 211 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వరికి మద్దతు ధర కూడా ప్రకటించింది. సూపర్ ఫైన్ రకం క్వింటాకు రూ.1960, దుడ్డురకం క్వింటాకు రూ.1940 చెల్లించనున్నట్టు ప్రకటించింది.
ఖరీఫ్ కంటే భేష్
గత ఖరీఫ్ సీజన్‌లో సేద్య ఖర్చులు పెరగడంతోపాటు ఎలుకల బెడదతో దిగుబడి తగ్గింది. ఎకరానికి 20 సెంట్ల నుంచి 30 సెంట్లలోని పంటను ఎలుకలు పాడుచేశాయని రైతులు చెబుతున్నారు. దీనివల్ల ఎకరానికి 30 బస్తాలే దిగుబడి వచ్చిందని పేర్కొంటున్నారు. అయితే ఇప్పుడు రబీ సీజన్ ఆశాజనకంగా ఉందని, ఖరీఫ్ మిగిల్చిన స్వల్ప నష్టాలను రబీ భర్తీ చేస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రబీలో చీడపీడల బెడద లేదని చెప్పారు. ఎకరానికి 40 బస్తాలకు తగ్గకుండా దిగుబడి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది సాగర్ ఆయకట్టులో నీటి లభ్యత గతేడాది కంటే అధికంగా ఉండడం కూడా కలిసొచ్చిందని, ఏప్రిల్ 15 వరకు సాగు జలాలు విడుదలయ్యాయని తెలిపారు.
కొనుగోళ్లకు ఏర్పాట్లు
జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు్ల చేశాం. సోమ వారం నుంచి ఎక్కడైతే ధాన్యం పండించారో అక్కడే కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. గన్నీ బ్యాగులు, తేమను కొలిచే పరికరాలు సిద్ధం చేశాం. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే పంటను కొంటాం.
– ఎ.శ్యాంప్రసాద్, జాయింట్ కలెక్టర్
‘రబీ’ బాగుంది
నాకున్న నాలుగెకరాల పొలంలోని రెండెకరాల్లో ఖరీఫ్‌లో వరిసాగు చేశా. 65 బస్తాల దిగుబడి వచ్చింది. రబీలో మూడెకరాలు పంట వేశా. దిగుబడి బాగుంది. చీడపీడలు లేవు. ఎలుకల బాధ అంతగా లేదు, ఖర్చు తక్కువగా ఉంది. ఎకరానికి 40 బస్తాలకు పైగా దిగుబడి 120 బస్తాల వరకు దిగుబడి వస్తుందని భావిస్తున్నా. మరో మూడు నాలుగు రోజుల్లో వరికోత కోస్తా.
– షేక్.సైదాసాహెబ్, విప్పర్ల, రొంపిచర్ల మండలం
దిగుబడి పెరిగింది
ఖరీఫ్‌లో ఆరెకరాలు వరిసాగు చేయగా 175 బస్తాలు దిగుబడి వచ్చింది. రబీలో మళ్లీ ఆరెకరాలు సాగు చేశా. ఈసారి పంట చాలా బాగుంది. పెట్టుబడి వ్యయం తగ్గింది. ఆరెకరాల మీద 240 బస్తాల వరకు దిగుబడి వస్తుందని భావిస్తున్నా. 75 కేజీల బస్తా రూ.1500 వరకు పలుకుతుందని ఆశిస్తున్నా. ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది.
– చిలకా ఆదేయ్య, మాచవరం, రొంపిచర్ల మండలం
Comments
Please login to add a commentAdd a comment