కరువు పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందానికి సమగ్ర నివేదిక
ఆరు జిల్లాల్లోని 87 మండలాలు కరువు జాబితాలో ప్రకటన
పంటనష్టం రూ. 228 కోట్లు, ఇతర రంగాలకు రూ. 92 కోట్లు
రాష్ట్ర స్థాయి రబీ నష్టంపై ‘అనంత’లో కేంద్ర బృందం సమీక్ష
అనంతపురం అగ్రికల్చర్/కర్నూలు(అగ్రికల్చర్): గత రబీ సీజన్ (2023–24)లో కరువు పరిస్థితుల కారణంగా గత ప్రభుత్వం ఆరు జిల్లాల పరిధిలో ప్రకటించిన 87 కరువు మండలాల్లో రూ. 320 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రకృతి విపత్తుల విభాగం మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.కూర్మనాథ్ తెలిపారు. ఇన్‌పుట్ సబ్సిడీ రూపంలో ఆరి్థకసాయం అందజేయాలంటూ.. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం (ఐఎంసీటీ)కు సమగ్ర కరువు నివేదిక అందజేశారు.
బుధవారం అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో రాష్ట్రస్థాయిలో రబీ నష్టంపై సమీక్ష నిర్వహించారు. అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్ నేతృత్వంలో ఈ సమీక్ష జరిగింది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ రితే‹Ùచౌహాన్ నేతృత్వంలో ఆరుగురు కేంద్ర బృందం సభ్యులు పాల్గొన్నారు. మరో నలుగురితో కూడిన కేంద్ర బృందం నెల్లూరు నుంచి వర్చువల్ పద్ధతిలో సమీక్షలో పాల్గొన్నారు.
అలాగే ఆర్.కూర్మనాథ్ నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.నాగరాజు, గ్రౌండ్ వాటర్ ఏడీ విశ్వేశ్వరరావు, జేడీఏ జగ్గారావు, మున్సిపల్ అడ్మిని్రస్టేషన్ డిప్యూటీ చీఫ్ ఇంజనీరు ఎం.బ్రహ్మాజీ, పశుశాఖ జేడీ జెడ్.ఈశ్వర్‌రావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ బాషా, గ్రామీణాభివృద్ధిశాఖ జాయింట్ కమిషనర్ శివప్రసాద్‌తో కూడిన రాష్ట్ర స్థాయి బృందం సభ్యులు కూడా సమీక్షకు హాజరయ్యారు.
24 రకాల పంటలకు దెబ్బ
ఈశాన్య రుతుపవనాలు ప్రభావం చూపకపోవడంతో గత రబీలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్లు కేంద్ర బృందానికి రాష్ట్ర, జిల్లా అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం జిల్లాలో 14 మండలాలు, శ్రీసత్యసాయి జిల్లాలో ఒకటి, కర్నూలు జిల్లాలో 18, నంద్యాలలో 13, ప్రకాశంలో 31, నెల్లూరులో 10... మొత్తంగా ఆరు జిల్లాల పరిధిలో 87 మండలాలు కరువు జాబితాలో ప్రకటించినట్లు తెలిపారు.
ఆరు జిల్లాల పరిధిలో 2.53 లక్షల హెక్టార్లలో 24 రకాల పంటలు దెబ్బతినడంతో రూ.1,207 కోట్లు విలువ చేసే 2.93 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులు కోల్పోయినట్లు వివరించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ నిబంధనల ప్రకారం ఒక్కో రైతుకు రెండు హెక్టార్లకు ఆరి్థకసాయం అందించడానికి వీలుగా 2.38 లక్షల మంది రైతులకు రూ. 228.03 కోట్లు ఇన్‌పుట్‌సబ్సిడీ రూపంలో అందించాలని కోరారు.
పంటనష్టం కాకుండా ఉద్యానశాఖ, పశుశాఖ, ఉపాధిహామీ, గ్రామీణ, పట్టణ తాగునీటి సరఫరా తదితర వాటికి మరో రూ. 91.74 కోట్లు... మొత్తంగా రూ.319.77 కోట్లు కరువు సాయం అందించాలని కోరుతూ సమగ్ర కరువు నివేదికను కేంద్ర బృందానికి అందించారు. ఇక్కడే ఆరు జిల్లాల పరిధిలో జరిగిన పంటనష్టం గురించి ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అనంతరం ఒక బృందం శ్రీసత్యసాయి జిల్లా పర్యటనకు, మరొక బృందం కర్నూలు, నంద్యాల జిల్లాల పర్యటనకు వెళ్లాయి.
నగరడోణ, వేదవతి ప్రాజెక్టుల నిర్మాణంతోనే కరువు నివారణ
కర్నూలు జిల్లాలో కరువును శాశ్వతంగా నిర్మూలించాలంటే ప్రధానంగా నగరడోణ రిజర్వాయర్, వేదవతినదిపై ప్రాజెక్టు నిర్మించాలని, ఈ మేరకు కేంద్రానికి నివేదించాలని రైతులు, రైతు సంఘాల నేతలు ఐఎంసీటీ ప్రతినిధులను కోరారు. కేంద్ర బృందం బుధవారం కర్నూలు కలెక్టరేట్‌లో రబీ కరువును ప్రతిబింబించే ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించింది.
శనగ, జొన్న రైతులతో ముఖాముఖి మాట్లాడి కరువు తీవ్రతను తెలుసుకున్నారు. 2023–24 ఖరీఫ్, రబీల్లో వివిధ పంటల్లో పెట్టిన పెట్టుబడుల్లో 25 శాతం కూడా దక్కలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్, రబీ సీజన్‌లకు సంబంధించి పంటల బీమా పరిహారం చెల్లించాలని కోరారు. గురువారం జిల్లాల్లో కరువు పరిశీలన తర్వాత అన్ని బృందాలు విజయవాడ చేరుకుంటాయని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment