సాక్షి, కర్నూలు: జిల్లాలో భారీ వర్షాలు పడటంతో వజ్రాల వేట మళ్లీ మొదలైంది. తుగ్గలి మండలం జొన్నగిరిలో వజ్రాలు బయటపడుతున్నాయి. పొలం పనులకు వెళ్లిన రైతుకు వజ్రం దొరికింది. 12 లక్షల రూపాయల నగదు, 5 తులాల బంగారం ఇచ్చి ఓ వజ్రాల వ్యాపారి కొనుగోలు చేశారు. కొందరు వ్యాపారులు ఏజెంట్లను నియమించుకొని ప్రతి ఏటా కోట్లాది రూపాయల్ని సంపాదిస్తున్నారు. రైతులు, కూలీలకు దొరికే వజ్రాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి.. వారు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారన సమాచారం.
సరిహద్దుల్లో వజ్రాల నిక్షేపాలు..
కాగా, కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లో వజ్రాల నిక్షేపాలు ఉన్నాయనే విషయాన్ని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) గుర్తించింది. కర్నూలు జిల్లా తుగ్గలి, మద్దికెర మండలాల్లోని తుగ్గలి, జొన్నగిరి, పగిడిరాయి, కొత్తపల్లి, పెరవలి, అగ్రహారం, హంప, యడవలి, మద్దికెరతోపాటు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని గంజికుంట, తట్రకల్లు, రాగులపాడు, పొట్టిపాడు, కమలపాడు, గూళపాళ్యం, ఎన్‌ఎంపీ తండా గ్రామాల్లో తరచూ వజ్రాలు లభ్యమవుతున్నాయి. ఈ ప్రాంతంలోని భూమి పొరల్లో కింబర్‌లైట్ పైప్‌లైన్ ఉందని గనులు భూగర్భ శాఖ నిర్ధారించింది.
వజ్రాలు ఎలా లభ్యమవుతాయంటే..
మన దేశంలో డైమండ్ మైనింగ్ మధ్యప్రదేశ్‌లోని పన్నాలో ఉంది. అక్కడ భూమిలోని రాళ్లను తవ్వితీసి వజ్రాల తయారీ ప్రక్రియ చేపడతారు. వజ్రకరూర్, తుగ్గలి, జొన్నగిరి ప్రాంతాల్లోని భూగర్భంలో 150 మీటర్ల లోతున వజ్రాలు ఉంటాయి. భూమిలో వాతావరణ మార్పులు జరిగినప్పుడు అవి బయటకు వస్తాయి. ఆ తర్వాత వెదరింగ్ (వికోశీకరణ) వల్ల అంటే ఎండకు ఎండి, వర్షానికి తడిసి పగిలిపోతాయి. వర్షాలు, వరదలు వచ్చినపుడు ఆ రాళ్ల ముక్కలు పొలాల్లో అక్కడక్కడా దొరుకుతుంటాయి. వాగులు, వంకల ద్వారా కూడా వజ్రాలు నీటిలో కొట్టుకుని ఇతర ప్రాంతాలకు చేరతాయి. అలా చెల్లాచెదురైన వజ్రాలే ఇప్పుడు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో లభిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment