Jonnagiri
-
రైతు పొలంలో ‘వజ్రం’ పండింది
సాక్షి, కర్నూలు: జిల్లాలో భారీ వర్షాలు పడటంతో వజ్రాల వేట మళ్లీ మొదలైంది. తుగ్గలి మండలం జొన్నగిరిలో వజ్రాలు బయటపడుతున్నాయి. పొలం పనులకు వెళ్లిన రైతుకు వజ్రం దొరికింది. 12 లక్షల రూపాయల నగదు, 5 తులాల బంగారం ఇచ్చి ఓ వజ్రాల వ్యాపారి కొనుగోలు చేశారు. కొందరు వ్యాపారులు ఏజెంట్లను నియమించుకొని ప్రతి ఏటా కోట్లాది రూపాయల్ని సంపాదిస్తున్నారు. రైతులు, కూలీలకు దొరికే వజ్రాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి.. వారు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారన సమాచారం.సరిహద్దుల్లో వజ్రాల నిక్షేపాలు..కాగా, కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లో వజ్రాల నిక్షేపాలు ఉన్నాయనే విషయాన్ని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) గుర్తించింది. కర్నూలు జిల్లా తుగ్గలి, మద్దికెర మండలాల్లోని తుగ్గలి, జొన్నగిరి, పగిడిరాయి, కొత్తపల్లి, పెరవలి, అగ్రహారం, హంప, యడవలి, మద్దికెరతోపాటు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని గంజికుంట, తట్రకల్లు, రాగులపాడు, పొట్టిపాడు, కమలపాడు, గూళపాళ్యం, ఎన్ఎంపీ తండా గ్రామాల్లో తరచూ వజ్రాలు లభ్యమవుతున్నాయి. ఈ ప్రాంతంలోని భూమి పొరల్లో కింబర్లైట్ పైప్‌లైన్ ఉందని గనులు భూగర్భ శాఖ నిర్ధారించింది.వజ్రాలు ఎలా లభ్యమవుతాయంటే..మన దేశంలో డైమండ్ మైనింగ్ మధ్యప్రదేశ్‌లోని పన్నాలో ఉంది. అక్కడ భూమిలోని రాళ్లను తవ్వితీసి వజ్రాల తయారీ ప్రక్రియ చేపడతారు. వజ్రకరూర్, తుగ్గలి, జొన్నగిరి ప్రాంతాల్లోని భూగర్భంలో 150 మీటర్ల లోతున వజ్రాలు ఉంటాయి. భూమిలో వాతావరణ మార్పులు జరిగినప్పుడు అవి బయటకు వస్తాయి. ఆ తర్వాత వెదరింగ్ (వికోశీకరణ) వల్ల అంటే ఎండకు ఎండి, వర్షానికి తడిసి పగిలిపోతాయి. వర్షాలు, వరదలు వచ్చినపుడు ఆ రాళ్ల ముక్కలు పొలాల్లో అక్కడక్కడా దొరుకుతుంటాయి. వాగులు, వంకల ద్వారా కూడా వజ్రాలు నీటిలో కొట్టుకుని ఇతర ప్రాంతాలకు చేరతాయి. అలా చెల్లాచెదురైన వజ్రాలే ఇప్పుడు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో లభిస్తున్నాయి. -
12 లక్షల విలువైన వజ్రాలు ఈ నెలలో 20 లభ్యం
-
వాన పడింది..వజ్రాల వేట షురూ..
-
2024 ఆఖరు నాటికి పూర్తి స్థాయిలో పసిడి ఉత్పత్తి
న్యూఢిల్లీ: జొన్నగిరి బంగారు గనుల్లో వచ్చే ఏడాది అక్టోబర్–డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభం కాగలదని డెక్కన్ గోల్డ్ మైన్స్ (డీజీఎంఎల్) ఎండీ హనుమ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఏటా 750 కిలోల బంగారం వెలికి తీయొచ్చని ప్రసాద్ తెలిపారు. ఇప్పటివరకు దీనిపై రూ. 200 కోట్లు ఇన్వెస్ట్ చేయగా పైలట్ ప్రాతిపదికన ప్రస్తుతం నెలకు ఒక కేజీ మేర బంగారాన్ని మైనింగ్ చేస్తున్నారు. 2013లో తమకు గనిని కేటాయించగా, ప్రాజెక్టు మదింపును పూర్తి చేసేందుకు 8–10 ఏళ్లు పట్టినట్లు ప్రసాద్ చెప్పారు. అటు కిర్గిజ్స్తాన్లో తమకు 60 శాతం వాటాలున్న మరో బంగారు గనిలో కూడా 2024 అక్టోబర్–నవంబర్‌లో ఉత్పత్తి ప్రారంభం కాగలదని ఆయన పేర్కొన్నారు. ఆల్టిన్ టోర్ గోల్డ్ ప్రాజెక్టు నుంచి ఏటా 400 కేజీల బంగారం వెలికితీయొచ్చని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో జొన్నగిరి బంగారు గని ఉంది. బీఎస్ఈలో లిస్టయిన ఏకైక గోల్డ్ మైనింగ్ కంపెనీ డీజీఎంఎల్. జొన్నగిరి ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్న జియోమైసూర్ సరీ్వసెస్ ఇండియాలో డీజీఎంఎల్కు మెజారిటీ (40 శాతం) వాటాలు ఉన్నాయి. -
బంగారు ‘సీమ’.. కర్నూలు జిల్లాలో గోల్డ్ మైన్
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని జొన్నగిరి సమీపంలో బంగారం వెలికితీత పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. పైలట్ ప్రాజెక్ట్ మంచి ఫలితాలు ఇవ్వడంతో గోల్డ్ మైన్ ప్లాంట్ ఏర్పాటుకు జియో మైసూర్ సంస్థ ముందుకొచ్చింది. ప్లాంట్‌ను నెలకొల్పి ఏడాదిలోపు బంగారం నిక్షేపాల వెలికితీత పనులు చేపట్టనుంది. జిల్లాలోని తుగ్గలి, మద్దికెర మండలాల్లో బంగారు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని 1994లోనే జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) సర్వే ద్వారా నిర్ధారించింది. భారత ప్రభుత్వం మైనింగ్ సెక్టార్లో విదేశీ పెట్టుబడులు ఆహ్వానించిన తర్వాత 2005లో జియో మైసూర్ అనే సంస్థ జొన్నగిరి సమీపంలో గోల్డ్ మైన్ నిర్వహణకు దరఖాస్తు చేసింది. దరఖాస్తును అప్పటి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం పరిశీలించింది. అనుమతులు ఇచ్చేలోపే ప్రమాదవశాత్తు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మృతి చెందారు. ఆపై రాష్ట్ర విభజన సమస్య, రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులను నేపథ్యంలో మైనింగ్ అనుమతులకు ఆటంకం ఏర్పడింది. ఎట్టకేలకు 2013లో అనుమతులు లభించగా.. 2014లో జియో మైసూర్ సంస్థ బంగారం నిక్షేపాలపై అన్వేషణ మొదలు పెట్టింది. 350 ఎకరాలు కొనుగోలు తుగ్గలి, మద్దికెర మండలాల్లో 350 ఎకరాలను జియో మైసూర్ సంస్థ కొనుగోలు చేసింది. మరో 1,500 ఎకరాలను లీజుకు తీసుకుంది. రైతులకు ఏటా ఎకరానికి రూ.15 వేల చొప్పున కౌలు చెల్లిస్తోంది. కొనుగోలు చేసిన 350 ఎకరాల్లో మైనింగ్, ప్రాసెసింగ్ యూనిట్, డంప్ యార్డ్, వాటర్ రిజర్వాయర్ నిర్మించారు. దీనికి రూ.95 కోట్ల వరకూ సంస్థ ఖర్చు చేసింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా 1,500 ఎకరాల్లో ప్రతి 20 మీటర్లకు ఒక డ్రిల్లింగ్ చొప్పున మొత్తం 30 వేల మీటర్ల మేర డ్రిల్లింగ్ చేయించింది. బంగారం లభ్యత, నాణ్యత, మైనింగ్ చేస్తే వచ్చే లాభనష్టాలు తదితర అంశాలను అంచనా వేసేందుకు పైలట్ ప్రాజెక్ట్ చేపట్టింది. ఇది ఫలించడంతో పూర్తిస్థాయిలో ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమైంది. ఇందుకు అవసరమైన యంత్ర సామగ్రి కొనుగోలు చేస్తోంది. ఏప్రిల్ నుంచి ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభించి 12 నెలల్లో పూర్తి చేయనుంది. ఇందుకోసం రూ.300 కోట్లు వెచ్చిస్తోంది. ప్లాంట్ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్, పరిశ్రమల శాఖ రాష్ట్ర ప్రతినిధులు ప్రతి వారం సమీక్షిస్తున్నారు. స్వాతంత్య్రం తర్వాత దేశంలో తొలి గోల్డ్ మైన్ మన దేశంలో 1880లో కోలార్ గోల్డ్ మైన్ ప్రారంభమైంది. ఆ తర్వాత బ్రిటిష్ హయాంలోనే 1945లో రాయచూర్‌లో హట్టిమైన్స్‌ను మొదలు పెట్టారు. స్వాతంత్య్రం వచ్చాక ఇప్పటివరకు దేశంలో ఎక్కడా గోల్డ్ మైనింగ్ చేపట్టలేదు. ఇప్పుడు జియో మైసూర్ సంస్థ ఏర్పాటు చేస్తున్నదే తొలి గోల్డ్ మైనింగ్ ప్లాంట్ కానుంది. దీని నిర్మాణంతో ప్రత్యక్షంగా 300 మందికి, పరోక్షంగా మరో 1000 మంది వరకు ఉపాధి లభిస్తుంది. అనంతపురం జిల్లాలోనూ బంగారు నిక్షేపాలు తుగ్గలి, మద్దికెరతో పాటు అనంతపురం జిల్లాలోని రామగిరిలోనూ బంగారు నిక్షేపాలు ఉన్నాయి. 25 ఏళ్ల కిందట ఆస్ట్రేలియాకు చెందిన ఓ కంపెనీ వీటిని లీజుకు తీసుకునేందుకు ప్రయత్నించింది. అయితే అక్కడి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ముందుకు రాలేదు. అప్పట్లో టీడీపీ నేత పరిటాల రవీంద్ర కారణంగానే ఆ కంపెనీ ధైర్యం చేయలేకపోయిందని చెబుతారు. అక్కడి బంగారు నిక్షేపాలను కూడా వెలికితీస్తే విలువైన సంపద ప్రభుత్వ సొంతం అవుతుంది. ఏప్రిల్ నుంచి ప్లాంట్ నిర్మాణ పనులు జియో మైసూర్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా మైనింగ్ చేస్తోంది. భారతదేశంలోని కర్నూలు జిల్లాలో గోల్డ్ మైన్ పనులు చేపట్టాం. పైలట్ ప్రాజెక్ట్ పూర్తయింది. ఇందులో మంచి ఫలితాలు వచ్చాయి. ఏప్రిల్ నుంచి ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభించనున్నాం. 12 నెలల్లో పూర్తి చేస్తాం. కరెంటు, నీరు తదితర వనరులు కల్పించేందుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రతినిధులు ప్రతి వారం పనుల పురోగతిని సమీక్షిస్తున్నారు. – హనుమ ప్రసాద్, సీఈవో, జియో మైసూర్ -
చరిత్రకు ఆనవాలు..మన సువర్ణగిరి....అదే నేటి జొన్నగిరి
సాక్షి, కర్నూలు(సెంట్రల్): చరిత్రకు ఆనవాలుగా నిలిచిన అశోకుని శిలా శాసనాలు తుగ్గలి మండలం జీ ఎర్రగుడి-జొన్నగిరి గ్రామాల మధ్య ఉన్నాయి. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో తన సువిశాలమైన మౌర్య సామ్రాజ్యాన్ని నాలుగు భాగాలుగా విభజించాడు అశోకుడు. గాంధార రాజ్యానికి తక్షశిల, కళింగ రాజ్యానికి తోసలి, పశ్చిమ రాజ్యానికి ఉజ్జయిని, దక్షణ భారత రాజ్యానికి సువర్ణగిరి రాజధానిగా (నేటి జొన్నగిరి) ఏర్పాటు చేశారు. తిరుగులేని రారాజుగా వెలుగొందిన మౌర్యవంశానికి చెందిన అశోక చక్రవర్తి పత్తికొండ నియోజక వర్గంలో రెండు చోట్ల శాసనాలు నిర్మించారు. పత్తికొండ నుంచి గుత్తికి వెళ్లే మార్గంలో జొన్నగిరి నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలోని పడమటి దిక్కున ఉన్న ఏనుగు కొండల్లో రాతి బండలపై శాసనాలు చెక్కించారు. కళింగ యుద్ధంలో లక్షలాది మంది చనిపోతారు. వారిలో తన అనునూయులు కూడా ఉండడం చూసి వ్యధకోర్చిన అశోకుడు తర్వాత ఆచార్య ఉపగుప్తుడు ఆధ్వర్యంలో బౌద్ధమతం స్వీకరిస్తాడు. అప్పటి నుంచి చెడు మార్గాలకు దూరంగా ఉండి ధర్మ ప్రచారం చేపడుతాడు. 365 రోజులు దేశ సంచారం చేసి ధర్మ బోధనలు చేస్తారు. తల్లి దండ్రులను పెద్దలను ప్రేమించాలని, భూతదయ కలిగి ఉండాలని, సత్యమును మాత్రమే పలకాలని హిత బోధ చేస్తాడు. రోడ్లు వేయించడం, చెట్లు నాటించడం వంటివి చేశాడు. (చదవండి: శవమే శివం.. భోజనం 2 పూటలే.. శుభకార్యాలకు దూరం) మగధ సామ్రాజ్యానికి రెండో రాజధాని జోన్నగిరి... భారత దేశంలో అశోకుడు పలు ప్రాంతాల్లో చిన్నరాతి పలక శాసనాలు చెక్కించినట్లు కథనం. అందులో జొన్నగిరి వద్ద, పత్తికొండ సమీపంలోని రాజుల మండగిరి వద్ద అశోకుని శిలాశాసనాలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో కూడా శాసనాలు చెక్కించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. శాసనాలు ప్రాకృత (పాలీ) భాషలో ఉన్నాయి. జొన్నగిరిలో ఉన్న శాసనాలు సింధూ లిపిని పోలి(సర్పలేఖన పద్ధతి) ఉండటంతో ప్రత్యేకత సంతరించు కుందని పేర్కొంటారు. మగధ సామ్రాజ్యంలో జొన్నగిరిని రెండో రాజధానిగా చేసుకొని పాలన సాగించి నట్లు చరిత్రకారుల అభిప్రాయం. దీంతో జొన్నగిరిని సువర్ణగిరి అని పిలుస్తుండే వారని, ఇక్కడ వజ్రాలను రాశులుగా పోసి అమ్మే వారని నానుడి. అందుకు నిదర్శనం జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో ప్రతి ఏటా తొలకరి చినుకులకు విలువైన వజ్రాలు లభ్యమవడం. వజ్రాలవేట కోసం వివిధ జిల్లాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా జనం వస్తుంటారు. కొంతమంది ఇక్కడే కొన్ని నెలల పాటు ఉంటూ ప్రతిరోజు పొలాల వెంబడి వజ్రాల కోసం అన్వేషిస్తుంటారు. అంతే కాకుండా ఈ ప్రాంతంలో విశేషంగాబంగారు నిక్షేపాలు ఉన్నాయి. బంగారం వెలికి తీసేందుకు ఇక్కడ కంపెనీ ఏర్పాటు చేయాలని జియో మైసూర్ సర్వీసెస్ ప్రవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రభుత్వ అనుమతులు పొందింది. ఎకరా రూ.12 లక్షల చొప్పున 300 ఎకరాలు కొనుగోలు చేయాలని రైతులతో ఒప్పందం చేససుకొని కంపెనీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో అశోకుని శిలాశాసనాల ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడకు చేరుకోవడానికి సిమెంటు రోడ్డు కాస్త మెరుగుపర్చాలి. శాసనాలను రక్షించేందుకు సంరక్షకులను నియమించారు. శాసనాలను చూసేందుకు ఆదోని–గుత్తి మార్గం గుండా వెళ్లే పర్యాటకులు తరచూ వస్తుంటారు. పర్యాటకులను ఆకర్షించేలా తగు చర్యలు ప్రభుత్వ తీసుకుంటే ఈ ప్రాంతం మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది. (చదవండి: ఊపిరాడట్లే.. ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు!) -
జొన్నగిరిలో జోరుగా కొనసాగుతున్న వజ్రాలవేట
-
సీఎం పర్యటన రోజంతా... గ్రామంలోనే
కర్నూలు(అగ్రికల్చర్) : నవనిర్మాణ దీక్షల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో పర్యటించనున్నారు. రోజంతా గ్రామంలోనే గడపనున్నారు. సీఎం పర్యటన కోసం జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఎప్పుడూ కడప విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో జిల్లాకు వచ్చే ముఖ్యమంత్రి ఈ సారి మాత్రం పుట్టపర్తి నుంచి జొన్నగిరికి రానుండడం గమనార్హం. ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి చేరుకునే ముఖ్యమంత్రి..అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా ఉదయం 10.30 గంటలకు జొన్నగిరి గ్రామానికి వస్తారు. ఎస్సీ, బీసీ కాలనీల్లో పర్యటిస్తారు. గ్రామసభ నిర్వహిస్తారు. నీరు–చెట్టు, ఉపాధి పనులను తనిఖీ చేయడంతో పాటు రైతులు, కూలీలతో ముఖాముఖి అవుతారు. రాష్ట్రంలో 5 లక్షల ఫాంపాండ్స్ పూర్తి చేసిన సందర్భంగా జొన్నగిరి చెరువు వద్ద నిర్మించిన పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. తాగునీటి పథకం పనులకు శంకుస్థాపన చేస్తారు. ఫొటో ప్రదర్శన తిలకిస్తారు. నవనిర్మాణదీక్షలో భాగంగా జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు బహిరంగసభలో పాల్గొంటారు. సాయంత్రం 5.15 గంటలకు గ్రామం నుంచి తిరిగి వెళతారు. -
ఖరీదైన రెండు వజ్రాలు లభ్యం !
గుత్తి :కర్నూలు జిల్లా తుగ్గలి మండల పరిధిలోని జొన్నగిరి గ్రామ శివారులోని పొలాల్లో అత్యంత విలువైన రెండు వజ్రాలు లభ్యమైనట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. వజ్రాల అన్వేషణకు వెళ్లిన అనంతపురం జిల్లా గుత్తి, కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని రామాపురానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు గత ఆదివారం ఇవి వేర్వేరుగా దొరికాయి. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ వ్యక్తులు గుత్తిలోని ఓ వజ్రాల వ్యాపారికి వాటిని విక్రయించినట్లు తెలుస్తోంది. ఓ వజ్రాన్ని రూ.10 లక్షలు, 10 తులాల బంగారం, మరొక దానిని రూ.3.50 లక్షల నగదు, 3 తులాల బంగారం తీసుకుని విక్రయించినట్లు తెలుస్తోంది. అయితే ఆ రెండు వజ్రాల విలువ సుమారు రూ. 50 లక్షలు ఉంటుందని అంచనా. తుగ్గలి మండలంలోని జొన్నగిరి, కానుగ బసినేపల్లి, గుత్తి మండలంలోని బేతాపల్లి, ఊటకల్లు గ్రామాల్లో తరచూ వజ్రాలు లభిస్తుంటాయి. వర్షా కాలం వచ్చిందంటే ఆశాజీవులు కొందరు చద్దులు కట్టుకుని మరీ పొలాల వెంట వజ్రాల కోసం అన్వేషించడం పరిపాటి. ఏటా వర్షా కాలం ప్రారంభంలో 50-60 వజ్రాల దాకా లభ్యమవుతుంటాయని అంచనా. ఈ నేపథ్యంలో వీటి వ్యాపారాన్ని గుట్టుగా సాగిస్తుంటారు. ఈ ఏడాది ఇప్పటిదాకా వేర్వేరు ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు 13 వజ్రాలు లభించినట్లు తెలుస్తోంది. గతంలో కర్నూలు జిల్లా పెరవలిలో మాత్రమే వజ్రాల వ్యాపారులు ఉండేవారు. ఇటీవల గుత్తిలో కూడా వజ్రాల వ్యాపారుల సంఖ్య పెరిగింది. ఒకే వంశానికి చెందిన ఆరుగురు వజ్రాల వ్యాపారులు గుత్తిలో ఉండడం విశేషం.