సాక్షి, కర్నూలు(సెంట్రల్): చరిత్రకు ఆనవాలుగా నిలిచిన అశోకుని శిలా శాసనాలు తుగ్గలి మండలం జీ ఎర్రగుడి-జొన్నగిరి గ్రామాల మధ్య ఉన్నాయి. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో తన సువిశాలమైన మౌర్య సామ్రాజ్యాన్ని నాలుగు భాగాలుగా విభజించాడు అశోకుడు. గాంధార రాజ్యానికి తక్షశిల, కళింగ రాజ్యానికి తోసలి, పశ్చిమ రాజ్యానికి ఉజ్జయిని, దక్షణ భారత రాజ్యానికి సువర్ణగిరి రాజధానిగా (నేటి జొన్నగిరి) ఏర్పాటు చేశారు. తిరుగులేని రారాజుగా వెలుగొందిన మౌర్యవంశానికి చెందిన అశోక చక్రవర్తి పత్తికొండ నియోజక వర్గంలో రెండు చోట్ల శాసనాలు నిర్మించారు. పత్తికొండ నుంచి గుత్తికి వెళ్లే మార్గంలో జొన్నగిరి నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలోని పడమటి దిక్కున ఉన్న ఏనుగు కొండల్లో రాతి బండలపై శాసనాలు చెక్కించారు. కళింగ యుద్ధంలో లక్షలాది మంది చనిపోతారు. వారిలో తన అనునూయులు కూడా ఉండడం చూసి వ్యధకోర్చిన అశోకుడు తర్వాత ఆచార్య ఉపగుప్తుడు ఆధ్వర్యంలో బౌద్ధమతం స్వీకరిస్తాడు. అప్పటి నుంచి చెడు మార్గాలకు దూరంగా ఉండి ధర్మ ప్రచారం చేపడుతాడు. 365 రోజులు దేశ సంచారం చేసి ధర్మ బోధనలు చేస్తారు. తల్లి దండ్రులను పెద్దలను ప్రేమించాలని, భూతదయ కలిగి ఉండాలని, సత్యమును మాత్రమే పలకాలని హిత బోధ చేస్తాడు. రోడ్లు వేయించడం, చెట్లు నాటించడం వంటివి చేశాడు.
(చదవండి: శవమే శివం.. భోజనం 2 పూటలే.. శుభకార్యాలకు దూరం)
మగధ సామ్రాజ్యానికి రెండో రాజధాని జోన్నగిరి...
భారత దేశంలో అశోకుడు పలు ప్రాంతాల్లో చిన్నరాతి పలక శాసనాలు చెక్కించినట్లు కథనం. అందులో జొన్నగిరి వద్ద, పత్తికొండ సమీపంలోని రాజుల మండగిరి వద్ద అశోకుని శిలాశాసనాలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌లో కూడా శాసనాలు చెక్కించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. శాసనాలు ప్రాకృత (పాలీ) భాషలో ఉన్నాయి. జొన్నగిరిలో ఉన్న శాసనాలు సింధూ లిపిని పోలి(సర్పలేఖన పద్ధతి) ఉండటంతో ప్రత్యేకత సంతరించు కుందని పేర్కొంటారు. మగధ సామ్రాజ్యంలో జొన్నగిరిని రెండో రాజధానిగా చేసుకొని పాలన సాగించి నట్లు చరిత్రకారుల అభిప్రాయం. దీంతో జొన్నగిరిని సువర్ణగిరి అని పిలుస్తుండే వారని, ఇక్కడ వజ్రాలను రాశులుగా పోసి అమ్మే వారని నానుడి. అందుకు నిదర్శనం జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో ప్రతి ఏటా తొలకరి చినుకులకు విలువైన వజ్రాలు లభ్యమవడం.
వజ్రాలవేట కోసం వివిధ జిల్లాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా జనం వస్తుంటారు. కొంతమంది ఇక్కడే కొన్ని నెలల పాటు ఉంటూ ప్రతిరోజు పొలాల వెంబడి వజ్రాల కోసం అన్వేషిస్తుంటారు. అంతే కాకుండా ఈ ప్రాంతంలో విశేషంగాబంగారు నిక్షేపాలు ఉన్నాయి. బంగారం వెలికి తీసేందుకు ఇక్కడ కంపెనీ ఏర్పాటు చేయాలని జియో మైసూర్ సర్వీసెస్ ప్రవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రభుత్వ అనుమతులు పొందింది. ఎకరా రూ.12 లక్షల చొప్పున 300 ఎకరాలు కొనుగోలు చేయాలని రైతులతో ఒప్పందం చేససుకొని కంపెనీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో అశోకుని శిలాశాసనాల ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడకు చేరుకోవడానికి సిమెంటు రోడ్డు కాస్త మెరుగుపర్చాలి. శాసనాలను రక్షించేందుకు సంరక్షకులను నియమించారు. శాసనాలను చూసేందుకు ఆదోని–గుత్తి మార్గం గుండా వెళ్లే పర్యాటకులు తరచూ వస్తుంటారు. పర్యాటకులను ఆకర్షించేలా తగు చర్యలు ప్రభుత్వ తీసుకుంటే ఈ ప్రాంతం మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది.
Comments
Please login to add a commentAdd a comment