బంగారు ‘సీమ’.. కర్నూలు జిల్లాలో గోల్డ్‌ మైన్‌ | Gold Mine near Jonnagiri in Kurnool district | Sakshi
Sakshi News home page

బంగారు ‘సీమ’.. కర్నూలు జిల్లాలో గోల్డ్‌ మైన్‌

Published Thu, Feb 17 2022 4:58 AM | Last Updated on Thu, Feb 17 2022 9:13 AM

Gold Mine near Jonnagiri in Kurnool district - Sakshi

పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా డ్రిల్‌ చేస్తున్న దృశ్యం, లీజు ప్రాంతంలో మైనింగ్‌ చేస్తున్న దృశ్యం

సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని జొన్నగిరి సమీపంలో బంగారం వెలికితీత పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. పైలట్‌ ప్రాజెక్ట్‌ మంచి ఫలితాలు ఇవ్వడంతో గోల్డ్‌ మైన్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు జియో మైసూర్‌ సంస్థ ముందుకొచ్చింది. ప్లాంట్‌ను నెలకొల్పి ఏడాదిలోపు బంగారం నిక్షేపాల వెలికితీత పనులు చేపట్టనుంది. జిల్లాలోని తుగ్గలి, మద్దికెర మండలాల్లో బంగారు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని 1994లోనే జియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) సర్వే ద్వారా నిర్ధారించింది.

భారత ప్రభుత్వం మైనింగ్‌ సెక్టార్‌లో విదేశీ పెట్టుబడులు ఆహ్వానించిన తర్వాత 2005లో జియో మైసూర్‌ అనే సంస్థ జొన్నగిరి సమీపంలో గోల్డ్‌ మైన్‌ నిర్వహణకు దరఖాస్తు చేసింది. దరఖాస్తును అప్పటి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం పరిశీలించింది. అనుమతులు ఇచ్చేలోపే ప్రమాదవశాత్తు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మృతి చెందారు. ఆపై రాష్ట్ర విభజన సమస్య, రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులను నేపథ్యంలో మైనింగ్‌ అనుమతులకు ఆటంకం ఏర్పడింది. ఎట్టకేలకు 2013లో అనుమతులు లభించగా.. 2014లో జియో మైసూర్‌ సంస్థ బంగారం నిక్షేపాలపై అన్వేషణ మొదలు పెట్టింది.

350 ఎకరాలు కొనుగోలు
తుగ్గలి, మద్దికెర మండలాల్లో 350 ఎకరాలను జియో మైసూర్‌ సంస్థ కొనుగోలు చేసింది. మరో 1,500 ఎకరాలను లీజుకు తీసుకుంది. రైతులకు ఏటా ఎకరానికి రూ.15 వేల చొప్పున కౌలు చెల్లిస్తోంది. కొనుగోలు చేసిన 350 ఎకరాల్లో మైనింగ్, ప్రాసెసింగ్‌ యూనిట్, డంప్‌ యార్డ్, వాటర్‌ రిజర్వాయర్‌ నిర్మించారు. దీనికి రూ.95 కోట్ల వరకూ సంస్థ ఖర్చు చేసింది. పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా 1,500 ఎకరాల్లో ప్రతి 20 మీటర్లకు ఒక డ్రిల్లింగ్‌ చొప్పున మొత్తం 30 వేల మీటర్ల మేర డ్రిల్లింగ్‌ చేయించింది. బంగారం లభ్యత, నాణ్యత, మైనింగ్‌ చేస్తే వచ్చే లాభనష్టాలు తదితర అంశాలను అంచనా వేసేందుకు పైలట్‌ ప్రాజెక్ట్‌ చేపట్టింది. ఇది ఫలించడంతో పూర్తిస్థాయిలో ప్లాంట్‌ ఏర్పాటుకు సిద్ధమైంది. ఇందుకు అవసరమైన యంత్ర సామగ్రి కొనుగోలు చేస్తోంది. ఏప్రిల్‌ నుంచి ప్లాంట్‌ నిర్మాణ పనులు ప్రారంభించి 12 నెలల్లో పూర్తి చేయనుంది. ఇందుకోసం రూ.300 కోట్లు వెచ్చిస్తోంది. ప్లాంట్‌ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్, పరిశ్రమల శాఖ రాష్ట్ర ప్రతినిధులు ప్రతి వారం సమీక్షిస్తున్నారు.

స్వాతంత్య్రం తర్వాత దేశంలో తొలి గోల్డ్‌ మైన్‌
మన దేశంలో 1880లో కోలార్‌ గోల్డ్‌ మైన్‌ ప్రారంభమైంది. ఆ తర్వాత బ్రిటిష్‌ హయాంలోనే 1945లో రాయచూర్‌లో హట్టిమైన్స్‌ను మొదలు పెట్టారు. స్వాతంత్య్రం వచ్చాక ఇప్పటివరకు దేశంలో ఎక్కడా గోల్డ్‌ మైనింగ్‌ చేపట్టలేదు. ఇప్పుడు జియో మైసూర్‌ సంస్థ ఏర్పాటు చేస్తున్నదే తొలి గోల్డ్‌ మైనింగ్‌ ప్లాంట్‌ కానుంది. దీని నిర్మాణంతో ప్రత్యక్షంగా 300 మందికి, పరోక్షంగా మరో 1000 మంది వరకు ఉపాధి లభిస్తుంది.

అనంతపురం జిల్లాలోనూ బంగారు నిక్షేపాలు
తుగ్గలి, మద్దికెరతో పాటు అనంతపురం జిల్లాలోని రామగిరిలోనూ బంగారు నిక్షేపాలు ఉన్నాయి. 25 ఏళ్ల కిందట ఆస్ట్రేలియాకు చెందిన ఓ కంపెనీ వీటిని లీజుకు తీసుకునేందుకు ప్రయత్నించింది. అయితే అక్కడి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ముందుకు రాలేదు. అప్పట్లో టీడీపీ నేత పరిటాల రవీంద్ర కారణంగానే ఆ కంపెనీ ధైర్యం చేయలేకపోయిందని చెబుతారు. అక్కడి బంగారు నిక్షేపాలను కూడా వెలికితీస్తే విలువైన సంపద ప్రభుత్వ సొంతం అవుతుంది.

ఏప్రిల్‌ నుంచి ప్లాంట్‌ నిర్మాణ పనులు
జియో మైసూర్‌ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా మైనింగ్‌ చేస్తోంది. భారతదేశంలోని కర్నూలు జిల్లాలో గోల్డ్‌ మైన్‌ పనులు చేపట్టాం. పైలట్‌ ప్రాజెక్ట్‌ పూర్తయింది. ఇందులో మంచి ఫలితాలు వచ్చాయి. ఏప్రిల్‌ నుంచి ప్లాంట్‌ నిర్మాణ పనులు ప్రారంభించనున్నాం. 12 నెలల్లో పూర్తి చేస్తాం. కరెంటు, నీరు తదితర వనరులు కల్పించేందుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రతినిధులు ప్రతి వారం పనుల పురోగతిని సమీక్షిస్తున్నారు.
– హనుమ ప్రసాద్, సీఈవో, జియో మైసూర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement