pathikonda
-
బంగారు ‘సీమ’.. కర్నూలు జిల్లాలో గోల్డ్ మైన్
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని జొన్నగిరి సమీపంలో బంగారం వెలికితీత పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. పైలట్ ప్రాజెక్ట్ మంచి ఫలితాలు ఇవ్వడంతో గోల్డ్ మైన్ ప్లాంట్ ఏర్పాటుకు జియో మైసూర్ సంస్థ ముందుకొచ్చింది. ప్లాంట్‌ను నెలకొల్పి ఏడాదిలోపు బంగారం నిక్షేపాల వెలికితీత పనులు చేపట్టనుంది. జిల్లాలోని తుగ్గలి, మద్దికెర మండలాల్లో బంగారు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని 1994లోనే జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) సర్వే ద్వారా నిర్ధారించింది. భారత ప్రభుత్వం మైనింగ్ సెక్టార్లో విదేశీ పెట్టుబడులు ఆహ్వానించిన తర్వాత 2005లో జియో మైసూర్ అనే సంస్థ జొన్నగిరి సమీపంలో గోల్డ్ మైన్ నిర్వహణకు దరఖాస్తు చేసింది. దరఖాస్తును అప్పటి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం పరిశీలించింది. అనుమతులు ఇచ్చేలోపే ప్రమాదవశాత్తు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మృతి చెందారు. ఆపై రాష్ట్ర విభజన సమస్య, రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులను నేపథ్యంలో మైనింగ్ అనుమతులకు ఆటంకం ఏర్పడింది. ఎట్టకేలకు 2013లో అనుమతులు లభించగా.. 2014లో జియో మైసూర్ సంస్థ బంగారం నిక్షేపాలపై అన్వేషణ మొదలు పెట్టింది. 350 ఎకరాలు కొనుగోలు తుగ్గలి, మద్దికెర మండలాల్లో 350 ఎకరాలను జియో మైసూర్ సంస్థ కొనుగోలు చేసింది. మరో 1,500 ఎకరాలను లీజుకు తీసుకుంది. రైతులకు ఏటా ఎకరానికి రూ.15 వేల చొప్పున కౌలు చెల్లిస్తోంది. కొనుగోలు చేసిన 350 ఎకరాల్లో మైనింగ్, ప్రాసెసింగ్ యూనిట్, డంప్ యార్డ్, వాటర్ రిజర్వాయర్ నిర్మించారు. దీనికి రూ.95 కోట్ల వరకూ సంస్థ ఖర్చు చేసింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా 1,500 ఎకరాల్లో ప్రతి 20 మీటర్లకు ఒక డ్రిల్లింగ్ చొప్పున మొత్తం 30 వేల మీటర్ల మేర డ్రిల్లింగ్ చేయించింది. బంగారం లభ్యత, నాణ్యత, మైనింగ్ చేస్తే వచ్చే లాభనష్టాలు తదితర అంశాలను అంచనా వేసేందుకు పైలట్ ప్రాజెక్ట్ చేపట్టింది. ఇది ఫలించడంతో పూర్తిస్థాయిలో ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమైంది. ఇందుకు అవసరమైన యంత్ర సామగ్రి కొనుగోలు చేస్తోంది. ఏప్రిల్ నుంచి ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభించి 12 నెలల్లో పూర్తి చేయనుంది. ఇందుకోసం రూ.300 కోట్లు వెచ్చిస్తోంది. ప్లాంట్ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్, పరిశ్రమల శాఖ రాష్ట్ర ప్రతినిధులు ప్రతి వారం సమీక్షిస్తున్నారు. స్వాతంత్య్రం తర్వాత దేశంలో తొలి గోల్డ్ మైన్ మన దేశంలో 1880లో కోలార్ గోల్డ్ మైన్ ప్రారంభమైంది. ఆ తర్వాత బ్రిటిష్ హయాంలోనే 1945లో రాయచూర్‌లో హట్టిమైన్స్‌ను మొదలు పెట్టారు. స్వాతంత్య్రం వచ్చాక ఇప్పటివరకు దేశంలో ఎక్కడా గోల్డ్ మైనింగ్ చేపట్టలేదు. ఇప్పుడు జియో మైసూర్ సంస్థ ఏర్పాటు చేస్తున్నదే తొలి గోల్డ్ మైనింగ్ ప్లాంట్ కానుంది. దీని నిర్మాణంతో ప్రత్యక్షంగా 300 మందికి, పరోక్షంగా మరో 1000 మంది వరకు ఉపాధి లభిస్తుంది. అనంతపురం జిల్లాలోనూ బంగారు నిక్షేపాలు తుగ్గలి, మద్దికెరతో పాటు అనంతపురం జిల్లాలోని రామగిరిలోనూ బంగారు నిక్షేపాలు ఉన్నాయి. 25 ఏళ్ల కిందట ఆస్ట్రేలియాకు చెందిన ఓ కంపెనీ వీటిని లీజుకు తీసుకునేందుకు ప్రయత్నించింది. అయితే అక్కడి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ముందుకు రాలేదు. అప్పట్లో టీడీపీ నేత పరిటాల రవీంద్ర కారణంగానే ఆ కంపెనీ ధైర్యం చేయలేకపోయిందని చెబుతారు. అక్కడి బంగారు నిక్షేపాలను కూడా వెలికితీస్తే విలువైన సంపద ప్రభుత్వ సొంతం అవుతుంది. ఏప్రిల్ నుంచి ప్లాంట్ నిర్మాణ పనులు జియో మైసూర్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా మైనింగ్ చేస్తోంది. భారతదేశంలోని కర్నూలు జిల్లాలో గోల్డ్ మైన్ పనులు చేపట్టాం. పైలట్ ప్రాజెక్ట్ పూర్తయింది. ఇందులో మంచి ఫలితాలు వచ్చాయి. ఏప్రిల్ నుంచి ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభించనున్నాం. 12 నెలల్లో పూర్తి చేస్తాం. కరెంటు, నీరు తదితర వనరులు కల్పించేందుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రతినిధులు ప్రతి వారం పనుల పురోగతిని సమీక్షిస్తున్నారు. – హనుమ ప్రసాద్, సీఈవో, జియో మైసూర్ -
సీఎం జగన్ ఆదేశాలు... టమాటా కొనుగోళ్లు ప్రారంభం
సాక్షి, అమరావతి : తక్షణమే మార్కెటింగ్ శాఖ నుంచి టమాటా కొనుగోళ్లు మొదలుపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో పత్తికొండ మార్కెట్ యార్డులో టమాటా కొనుగోళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. టమాటా రైతుల సమస్యపై శనివారం ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా టమాటా కొనుగోలులో తలెత్తిన సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ క్రమంలో పండ్లు, కూరగాయలను డీ రెగ్యులేట్ చేశామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. తద్వారా మార్కెట్ ఫీజు లేకుండా.. ఏజెంట్లకు కమిషన్ ఇవ్వకుండా రైతులు అమ్ముకోవచ్చని వివరించారు. ఈ నేపథ్యంలో ఏజెంట్లు టమోటా కొనుగోలు నిలిపేశారని పేర్కొన్నారు. పత్తికొండ మార్కెట్లో కాకుండా మార్కెట్ బయటకు వచ్చి అమ్మితేనే కొంటామని ఏజెంట్లు రైతులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని సీఎం జగన్ దృష్టికి తీసుకువచ్చారు. అయితే మార్కెట్లో మాత్రమే తాము అమ్ముతామని రైతులు ఏజెంట్లకు స్పష్టం చేశారని వెల్లడించారు. ఈ క్రమంలో ఏది ఏమైనా రైతులు ఇబ్బందులు పడకూడదని సీఎం జగన్ అధికారులతో పేర్కొన్నారు. మార్కెట్లో పరిస్థితులను సరిదిద్దడానికి తగిన చర్యలు తీసుకుని వెంటనే మార్కెటింగ్ శాఖ నుంచి కొనుగోళ్లు మొదలుపెట్టాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఆదేశాలతో పత్తికొండ మార్కెట్‌యార్డులో టమాటా కొనుగోళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. ధరలు తగ్గకుండా వేలంపాటలో పాల్గొంటూ మార్కెటింగ్ శాఖ అధికారులు సైతం పాల్గొంటున్నారు. ఇక ఉదయం నుంచి 50 టన్నుల టమాటా అమ్ముడుపోయింది. ఇందులో ధరల స్థిరీకరణ నిధి కింద 5 టన్నుల వరకూ మార్కెటింగ్ శాఖ అధికారులు కొనుగోలు చేశారు. దీంతో ప్రస్తుతం వ్యాపారస్తులు సైతం ముందుకు వచ్చి టమాటాను కొనుగోలు చేస్తున్నారని మార్కెటింగ్‌శాఖ కమిషనర్ ప్రద్యుమ్న వెల్లడించారు. అదే విధంగా రైతులను ఇబ్బందులకు గురిచేసిన ఏజెంట్లపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. -
పత్తికొండ ప్రచార సభలో వైఎస్ విజయమ్మ
-
ప్రత్యేక హోదా జగన్ వల్లే సజీవం: విజయమ్మ
సాక్షి, పత్తికొండ: ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 71 లక్షల మందికి పెన్షన్ ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆమె కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో ప్రసంగించారు. ఏపీ మినహా దేశమంతా కూడా 48 లక్షల ఇళ్లు కడితే ఒక్క ఏపీలోనే 49 లక్షల ఇళ్లు కట్టించి వైఎస్సార్ రికార్డు సృష్టించారని తెలిపారు. అలాగే దళితులకు 32 లక్షల ఎకరాల భూములు పంచిన ఘనత కూడా వైఎస్సార్‌కే దక్కిందన్నారు. మైనార్టీలు ఆర్ధికంగా ఎదగాలని 4 శాతం రిజర్వేషన్ కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాగానే 10 లక్షల పెన్షన్లు తీసేశాడని ఆరోపించారు. ఈ రోజు కొత్తగా పెన్షన్ వచ్చే పరిస్థితి లేదని, పెన్షన్ కావాలంటే జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్లాల్సిందేనని, వారు టీడీపీకి చెందిన వారైతేనే మంజూరు చేస్తున్నారని తెలిపారు. వైఎస్సార్ తన హయాంలో ఒక్క ఛార్జీ, పన్నూ పెంచకుండా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేశారని చెప్పారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన ఐదేళ్ల కాలంలో వైఎస్సార్ చెప్పిన, చెప్పని పనులు చేసి చూపించారని అన్నారు. 2009 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చి వైఎస్సార్ ఓట్లు అడిగారని , అందుకనే ప్రజలు బంపర్ మెజారిటీతో గెలిపించారని గుర్తు చేశారు. అదే పరిస్థితి ప్రతి ఎన్నికలకు రావాలని కోరారు. ప్రత్యేక హోదా వైఎస్ జగన్ వల్లే సజీవం ఈనాటికీ ప్రత్యేక హోదా ఉద్యమం సజీవంగా ఉందంటే దానికి కారణం వైఎస్ జగనేనని కొనియాడారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైన 14 సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో, గల్లీలోనూ ధర్నాలు, రాస్తారోకోలు, యువభేరి, జనభేరి, నిరసన కార్యక్రమాలు చేశాడని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ చివరికి వైఎస్సార్సీపీ ఎంపీలతో రాజీనామా కూడా చేయించాడని చెప్పారు. గత ఎన్నికల సమయంలో 40 ఏళ్ల అనుభవం ఉందని, రాజధాని నిర్మించే సత్తా తనకే ఉందని చెప్పి 650 హామీలు ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చాడని గుర్తు చేశారు. ఇచ్చిన హామీల్లో కనీసం 10 శాతం హామీలైనా నెరవేర్చారా అని సూటిగా చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా ఉన్న 14 సంవత్సరాలలో ఏ రోజూ రైతులు గుర్తుకు రాలేదని, కానీ ఎన్నికల సమయంలో మాత్రం అన్నదాత-సుఖీభవ అంటూ మభ్యపెడుతున్నాడని విమర్శించారు. హంద్రినీవా పూర్తి కాకపోవడానికి బాబే కారణం హంద్రినీవా ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి చంద్రబాబు నాయుడే కారణమని ఆరోపించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టును పూర్తి చేసి 64 చెరువులను నింపుతామన్నారు. అలాగే చుట్టు పక్కల ఉన్న 124 గ్రామాలకు తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. పత్తికొండలో చాలా ఏళ్లుగా టీడీపీని గెలిపిస్తున్నారని, చంద్రబాబు అడుగుపెట్టడం వల్లే పత్తికొండలో వర్షాలు పడటం లేదని వ్యాఖ్యానించారు. డ్వాక్రా మహిళకు నాలుగు దఫాల్లో పూర్తి రుణమాఫీ వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే డ్వాక్రా మహిళలకు ఎంత రుణమున్నా నాలుగు దఫాల్లో పూర్తిగా రుణం మాఫీ చేస్తామన్నారు. అలాగే సున్నా వడ్డీకే మళ్లీ రుణాలు ఇచ్చేలా చేస్తామన్నారు. అలాగే 45 ఏళ్ల వయసున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు ఐదు సంవత్సరాలకు కలిపి రూ.75 వేలు అందిస్తామన్నారు. మూడు దఫాలుగా పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తామన్నారు. పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు, 60 ఏళ్లు నిండిన అవ్వాతాతలకు పెన్షన్ రూ.3 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం కొత్తగా వచ్చిన పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా కొత్త చట్టం తీసుకువస్తామని చెప్పారు. అలాగే రాష్ట్రలో ఖాళీగా ఉన్న 2.42 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని వెల్లడించారు. గ్రామాల్లో ఏ రేషన్ కార్డు కావాలన్నా 72 గంటల్లో వచ్చేవిధంగా గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్నే కొనసాగిస్తామని, సీపీఎస్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి విద్యార్ధికి పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తామని, అలాగే ఏడాది ఖర్చుల కోసం రూ.20 వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. 9 గంటల ఉచిత విద్యుత్ రైతులకు పట్టపగలు 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. పంట వేసే ముందే మద్ధతు ధర ప్రకటిస్తామని, ధరల స్థిరీకరణ నిధిని రూ.3 వేల కోట్లతో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అలాగే రూ.4 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్య నిధిని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ ట్రాక్టర్ల రోడ్డు టాక్స్‌ను కూడా రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్న వ్యక్తులు ప్రమాదవశాత్తూ ఎవరు చనిపోయినా వైఎస్సార్ జీవిత బీమా కింద లక్ష రూపాయలు చెల్లిస్తామన్నారు. బీసీలకు ప్రమోషన్లు వద్దంటూ బాబు లేఖలు బీసీలు న్యాయమూర్తిగా పనికిరారంటూ కొలిజియానికి చంద్రబాబు నాయుడు లేఖలు రాసిన విషయాన్ని గుర్తు చేశారు. ఓట్ల కోసమే బీసీలపై బాబు కపట ప్రేమ చూపిస్తాడని విమర్శించారు. చిన్నప్పుడు వైఎస్సార్‌కు చదువు చెప్పిన బీసీ కులానికి చెందిన మాస్టారు వెంకటప్ప గుర్తుగా వైఎస్సార్, వెంకటప్ప పేరుతో స్కూల్ కట్టించారని గుర్తు చేశారు. ఈ స్కూల్లో 3 వేల మంది ఉచితంగా చదువుకుంటున్నారని వెల్లడించారు. బాబుకు ఆడవాళ్లంటే గౌరవం లేదు బాబు అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడని విమర్శించారు. చివరికి ఆడవాళ్లను కూడా బజారుకీడుస్తాడని అన్నారు. లక్ష్మీ పార్వతీ లైంగికంగా వేధించిందని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయించాడని, రోజాను కూడా ఇబ్బంది పెట్టడం మీరు చూసే ఉంటారని ప్రజల్నే సూటిగా అడిగారు. మహిళలంటే గౌరవం లేని చంద్రబాబుకు మహిళలు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే పత్తికొండ నియోజకవర్గానికి ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఒక్కసారి వైఎస్ జగన్‌కు అధికారం ఇవ్వాలని కోరారు. పత్తికొండ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంగాటి శ్రీదేవి, కర్నూలు ఎంపీ అభ్యర్థి డాక్టర్ సంజీవ్ కుమార్‌లను ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీ గెలిపించాలని కోరారు. -
బాబుకు ఆడవాళ్లంటే గౌరవం లేదు: వైఎస్ విజయమ్మ
-
జగనన్నే.. నా ధైర్యం
సాక్షి, కర్నూలు : భర్త చాటు భార్యే అయినా ఊహించని విధంగా రాజకీయాల్లోకి వచ్చారామె. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని రైతులకు చేతనైనంత సాయం చేశారు. మంచి పేరు తెచ్చుకుంటున్న దశలో అనుకోకుండా పదవిని వదులుకోవాల్సి రావడంతో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న భర్తకు చేదోడు వాదోడుగా మెలిగారు. ఇంతలో ప్రత్యర్థుల పాశవిక దాడిలో భర్త దారుణ హత్యకు గురి కావడం ఆమె జీవితాన్ని కుదిపేసింది. ‘నీకు పూర్తి అండగా ఉంటాం’ అని చెప్పిన సమీప బంధువులు సైతం ప్రత్యర్థులతో చేయి కలిపారు. ఇన్ని కష్టాల్లోనూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన భరోసానే తనకు ధైర్యాన్నిచ్చిందని.. అదే తనను ముందుకు నడిపిస్తోందని అంటున్నారు కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంగాటి శ్రీదేవి. ఇంకా ఏమన్నారో ఆమె మాటల్లోనే.... ‘నా రాజకీయ ప్రస్థానం ఊహించనిది. కాంగ్రెస్ పార్టీలో తిరిగే నా భర్త చెరుకులపాడు నారాయణరెడ్డి ప్రోత్సాహంతో కర్నూలు డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నికయ్యా. రాజకీయ ఒడుదొడుకుల నేపథ్యంలో ఆ పదవిని వీడాల్సి వచ్చింది. అయినా నిరుత్సాహం చెందలేదు. తదనంతర పరిణామాల్లో నా భర్త నారాయణరెడ్డి వైఎస్సార్సీపీలోకి వచ్చారు. పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రజల్లోకి చొచ్చుకెళ్లారు. దీనిని జీర్ణించుకోలేని ప్రత్యర్థులు రెండేళ్ల క్రితం ఓ వివాహానికి హాజరై వస్తుండగా వేట కొడవళ్లు, బాంబులు వేసి అతి కిరాతకంగా హత్య చేశారు. ఇలాంటి స్థితిలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నన్ను ఓదార్చారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ ఇస్తామని ప్రకటించారు. అలా టిక్కెట్ దక్కిన తొలి వ్యక్తి నేనే. నా భర్త హత్య అనంతరం నన్ను పరామర్శించిన దగ్గరి బంధువులు ఇప్పుడు అదే హంతకులతో చేతులు కలిపారు. జగనన్న ఇచ్చిన కొండంత ధైర్యం తోడుగా నన్ను, పార్టీని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలను కాపాడుకుంటూ ముందుకెళ్తున్నా. కేఈ ఏమీ చేయలేదు... మా నియోజకవర్గం దశాబ్దాలుగా కరువు కాటకాలకు నిలయం. రైతుల సమస్యలను తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఇక్కడి ఎమ్మెల్యే కేఈ కృష్ణమూర్తి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా ప్రజల తాగు నీటి, రైతుల సాగునీటి ఇబ్బందులు తీరలేదు. హంద్రీ నీవా నీటితో నియోజకవర్గంలో మొదట 106 చెరువులను నింపుతామని చెప్పిన ఉప ముఖ్యమంత్రి తర్వాత 68 చెరువులని మాట మార్చారు. ఈ పనులూ అసంపూర్తిగానే ఉన్నాయి . కేఈ హామీలను తుంగలో తొక్కారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హంద్రీ నీవా నీటితో చెరువులను నింపేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తాం. సాగునీటి కల్పనే ధ్యేయం నియోజకవర్గంలోని 32 వేల ఎకరాలకు సాగు నీరు అందించడమే నా ధ్యేయం. రైతులు నష్టపోకుండా అన్ని చర్యలను తీసుకుంటాం. ఏ గ్రామంలోనూ తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేస్తా. సమస్యలను అంచెలంచెలుగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తా. బాలికా విద్యకు ప్రాధాన్యం నేను డిగ్రీ (బీఏ) చదివా. బాలికా విద్య ప్రాధాన్యం తెలుసు. నియోజకవర్గంలో బాలికల విద్యకు పెద్ద పీట వేస్తాం. బీసీ బాలికలకు వసతి గృహం, పాలిటెక్నికల్ కళాశాల నెలకొల్పేలా చూస్తా. నా భర్త ఉన్నప్పుడు పలు సేవా కార్యక్రమాలు చేపట్టాం. పేదల ఇంట వివాహాలకు తాళి బొట్లు, కాలి మెట్టెలు, దుస్తులు అందజేశాం. వీటిని కొనసాగిస్తానని అన్నారు. -
పత్తికొండలో కొనసాగుతున్న వైఎస్ జగన్ పాదయాత్ర
-
నారాయణరెడ్డి హత్య దారుణం
రాయదుర్గం : కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణరెడ్డిని హత్య చేయడం దారుణమని రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన రాయదుర్గంలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ పాలనలో ఆకృత్యాలు, హత్యలు, దౌర్జన్యాలు పెచ్చరిల్లాయని ఆందోళన వ్యక్తం చేశారు. నారాయణరెడ్డిని హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యర్థుల నుంచి ముప్పు ఉందని, లైసెన్స్డ్ ఆయుధం కొనసాగించాలని నారాయణరెడ్డి అనుమతి కోరినా ఇవ్వకపోవడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో హత్యలకు తెగబడడం సిగ్గుచేటన్నారు. హత్యకు గురైన నారాయణరెడ్డి, ఆయన అనుచరులు సాంబశివారెడ్డి కుటుంబ సభ్యులకు కాపు ప్రగాఢసానుభూతిని ప్రకటించారు. -
నారాయణరెడ్డిది ప్రభుత్వ హత్యే
అనంతపురం : కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణరెడ్డిది ప్రభుత్వ హత్యేనని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పత్తికొండ నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా ఎదుగుతుండడంతో వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురవుతాయనే భయంతో ఓర్వలేక ప్రభుత్వమే ఈ ఘాతుకానికి ప్రోత్సహించిందంటూ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హత్యారాజకీయాలకు అండగా నిలుస్తున్నారని ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నారాయణరెడ్డి హత్యకేసు దారి మళ్లించే ప్రయత్నం జరుగుతోందని, అసలు దోషులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. -
మాటలు చెప్పకండి సార్..
పత్తికొండ: మాటలు చెప్పకండి సార్.. చెప్పిన మాటల్లో నిజం ఉండాలంటూ కర్నూలు జిల్లా పత్తికొండలో ఓ రైతు వ్యవసాయ శాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావును నిలదీయడంతో మంత్రి ఖంగుతిన్నాడు. వివరాల్లోకి వెళితే..పత్తికొండ మండలంలోని కోతిరాళ్ల క్రాస్ రోడ్డులో జిల్లా కలెక్టర్ విజయమోహన్ అధ్యక్షతన రైతులతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా సభలో రైతు కేశవయ్య మాట్లాడుతూ తాను ఉల్లి పంట సాగు చేశానని, ఎకరాకు రూ.80 వేల పెట్టుబడి అయిందన్నాడు. అయితే పక్కనే ఉన్నా హంద్రీ నీవా నీళ్లు అందించలేని పరిస్థితి ఉంది. కష్టపడి పంట పండిస్తున్నా. ఇంతా చేస్తే.. కిలో రూ.6లతో కొనుగోలు చేస్తామంటారు. ఎట్లా గిట్టుబాటు అవుతుంది అంటూ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో వాపోయాడు. ఇందుకు ఆయన సమాధానమిస్తూ నీకు రుణమాఫీ అయిందా అన్నారు. కాలేదని రైతు చెప్పడంతో కొన్ని లోపాల వల్ల రాకపోయి ఉండొచ్చని సర్ది చెప్పారు. దీంతో రైతు మాటలు చెప్పకండి సార్, చెప్పిన మాటల్లో నిజం ఉండాలన్నాడు. ఆ మాటలకు ఖంగుతిన్న మంత్రి నువ్వుగా ఇక్కడికి వచ్చావా.. లేక సాక్షి విలేకరులు.. వైఎస్సార్ సీపీ నాయకులు చెబితే వచ్చావా అంటూ రైతును దబాయించాడు. దీంతో అదే స్థాయిలో రైతు కేశవయ్య నేను రైతును. మీరు అడుగుతుంటే నా బాధ చెబుతున్నా అన్నాడు. దీంతో రైతును సభ నుంచి దూరంగా పంపేశారు. -
దరఖాస్తులకు మోక్షం లభించేనా!
పత్తికొండ అర్బన్ పత్తికొండలోని రెవెన్యూ కార్యాలయంలో విద్యార్థులు, రైతులు అందజేసిన దరఖాస్తులకు మోక్షం లభించడం లేదు. ఎంకిపెళ్లి సుబ్చిచావుకొచ్చిందన్నట్లుగా తహశీల్దారు బదిలీ విద్యార్థులు, రైతులకు తలనొప్పిగా మారింది. సమైక్యాంధ్ర ఉద్యమ కాలంలో పెండింగ్‌లో పడిన వందలాది అప్లికేషన్లు ఇటీవలే పూర్తి చేశారు. పత్తికొండ తహశీల్దారుగా పనిచేసిన రామక్రిష్ణ ఈనెల 23న సన్మానం ముగించుకుని కడప జిల్లాకు బదిలీపై వెళ్లారు. విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల కోసం కుల, నివాస, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గతంలో అందజేసిన దరఖాస్తులు కొన్ని పెండింగ్‌లో పడగా మరికొన్ని వాటికి జత చేరాయి. స్కాలర్షిప్ రెన్యూవల్ గడువు ముగుస్తుందని కళాశాల, పాఠశాలల సిబ్బంది విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో విద్యార్థులు మీసేవ కేంద్రాలు, తహశీల్దారు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చేసేదేమీ లేక నిరాశతో వెనుదిరిగి వెళ్తున్నారు. దీంతో సుమారు 300పైగా దరఖాస్తులకు పెండింగ్‌లో పడినట్లు రెవెన్యూ సిబ్బంది తెలిపారు. బదిలీల కారణంగా నూతన తహశీల్దారు పేరుమీద డిజిటల్ కీ సంతకం నమోదు కాకపోవడం వల్ల సమస్య తలెత్తినట్లు తెలిసింది. ఒక్కరోజులో పరిష్కరిస్తాం: శివరామయ్య, తహశీల్దారు పత్తికొండ కొత్తగా బాధ్యతలు తీసుకున్నా. వచ్చి రెండురోజులే అయింది. ఆర్డీఓ, జిల్లా స్థాయి ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేసుకోవడానికి ఒకరోజు గడిచిపోయింది. సాంకేతిక కారణాలతో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే. వీఆర్ఓల సమావేశం ఏర్పాటు చేసి ఒకరోజులో దరఖాస్తుల జారీకి చర్యలు తీసుకుంటాం.