కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణరెడ్డిది ప్రభుత్వ హత్యేనని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ ఆరోపించారు.
అనంతపురం : కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణరెడ్డిది ప్రభుత్వ హత్యేనని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పత్తికొండ నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా ఎదుగుతుండడంతో వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురవుతాయనే భయంతో ఓర్వలేక ప్రభుత్వమే ఈ ఘాతుకానికి ప్రోత్సహించిందంటూ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హత్యారాజకీయాలకు అండగా నిలుస్తున్నారని ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నారాయణరెడ్డి హత్యకేసు దారి మళ్లించే ప్రయత్నం జరుగుతోందని, అసలు దోషులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.