ప్రత్యేక హోదా జగన్‌ వల్లే సజీవం: విజయమ్మ | YS Vijayamma Speech In Pathikonda Public Meeting | Sakshi
Sakshi News home page

హంద్రినీవా పూర్తి కాకపోవడానికి బాబే కారణం: వైఎస్‌ విజయమ్మ

Published Mon, Apr 8 2019 8:02 PM | Last Updated on Mon, Apr 8 2019 8:45 PM

YS Vijayamma Speech In Pathikonda Public Meeting - Sakshi

సాక్షి, పత్తికొండ: ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 71 లక్షల మందికి పెన్షన్‌ ఇచ్చిన ఘనత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికే దక్కిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆమె కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో ప్రసంగించారు. ఏపీ మినహా దేశమంతా కూడా 48 లక్షల ఇళ్లు కడితే ఒక్క ఏపీలోనే 49 లక్షల ఇళ్లు కట్టించి వైఎస్సార్‌ రికార్డు సృష్టించారని తెలిపారు. అలాగే దళితులకు 32 లక్షల ఎకరాల భూములు పంచిన ఘనత కూడా వైఎస్సార్‌కే దక్కిందన్నారు. మైనార్టీలు ఆర్ధికంగా ఎదగాలని 4 శాతం రిజర్వేషన్‌ కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాగానే 10 లక్షల పెన్షన్లు తీసేశాడని ఆరోపించారు.



ఈ రోజు కొత్తగా పెన్షన్‌ వచ్చే పరిస్థితి లేదని, పెన్షన్‌ కావాలంటే జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్లాల్సిందేనని, వారు టీడీపీకి చెందిన వారైతేనే మంజూరు చేస్తున్నారని తెలిపారు. వైఎస్సార్‌ తన హయాంలో ఒక్క ఛార్జీ, పన్నూ పెంచకుండా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేశారని చెప్పారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన ఐదేళ్ల కాలంలో వైఎస్సార్‌ చెప్పిన, చెప్పని పనులు చేసి చూపించారని అన్నారు. 2009 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చి వైఎస్సార్‌ ఓట్లు అడిగారని , అందుకనే ప్రజలు బంపర్‌ మెజారిటీతో గెలిపించారని గుర్తు చేశారు. అదే పరిస్థితి ప్రతి ఎన్నికలకు రావాలని కోరారు.

ప్రత్యేక హోదా వైఎస్‌ జగన్‌ వల్లే సజీవం
ఈనాటికీ ప్రత్యేక హోదా ఉద్యమం సజీవంగా ఉందంటే దానికి కారణం వైఎస్‌ జగనేనని కొనియాడారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైన 14 సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో, గల్లీలోనూ ధర్నాలు, రాస్తారోకోలు, యువభేరి, జనభేరి, నిరసన కార్యక్రమాలు చేశాడని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ జగన్‌ చివరికి వైఎస్సార్‌సీపీ ఎంపీలతో రాజీనామా కూడా చేయించాడని చెప్పారు. గత ఎన్నికల సమయంలో 40 ఏళ్ల అనుభవం ఉందని, రాజధాని నిర్మించే సత్తా తనకే ఉందని చెప్పి 650 హామీలు ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చాడని గుర్తు చేశారు. ఇచ్చిన హామీల్లో కనీసం 10 శాతం హామీలైనా నెరవేర్చారా అని సూటిగా చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా ఉన్న 14 సంవత్సరాలలో ఏ రోజూ రైతులు గుర్తుకు రాలేదని, కానీ ఎన్నికల సమయంలో మాత్రం అన్నదాత-సుఖీభవ అంటూ మభ్యపెడుతున్నాడని విమర్శించారు.

హంద్రినీవా పూర్తి కాకపోవడానికి బాబే కారణం
హంద్రినీవా ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి చంద్రబాబు నాయుడే కారణమని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టును పూర్తి చేసి 64 చెరువులను నింపుతామన్నారు. అలాగే చుట్టు పక్కల ఉన్న 124 గ్రామాలకు తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. పత్తికొండలో చాలా ఏళ్లుగా టీడీపీని గెలిపిస్తున్నారని, చంద్రబాబు అడుగుపెట్టడం వల్లే పత్తికొండలో వర్షాలు పడటం లేదని వ్యాఖ్యానించారు. 

డ్వాక్రా మహిళకు నాలుగు దఫాల్లో పూర్తి రుణమాఫీ
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే డ్వాక్రా మహిళలకు ఎంత రుణమున్నా నాలుగు దఫాల్లో పూర్తిగా రుణం మాఫీ చేస్తామన్నారు. అలాగే సున్నా వడ్డీకే మళ్లీ రుణాలు ఇచ్చేలా చేస్తామన్నారు. అలాగే 45 ఏళ్ల వయసున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు ఐదు సంవత్సరాలకు కలిపి రూ.75 వేలు అందిస్తామన్నారు. మూడు దఫాలుగా పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తామన్నారు. పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు, 60 ఏళ్లు నిండిన అవ్వాతాతలకు పెన్షన్‌ రూ.3 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు.

స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం
కొత్తగా వచ్చిన పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా కొత్త చట్టం తీసుకువస్తామని చెప్పారు. అలాగే రాష్ట్రలో ఖాళీగా ఉన్న 2.42 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని వెల్లడించారు. గ్రామాల్లో ఏ రేషన్‌ కార్డు కావాలన్నా 72 గంటల్లో వచ్చేవిధంగా గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానాన్నే కొనసాగిస్తామని, సీపీఎస్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి విద్యార్ధికి పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేస్తామని, అలాగే ఏడాది ఖర్చుల కోసం రూ.20 వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

9 గంటల ఉచిత విద్యుత్‌
రైతులకు పట్టపగలు 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తామని ప్రకటించారు. పంట వేసే ముందే మద్ధతు ధర ప్రకటిస్తామని, ధరల స్థిరీకరణ నిధిని రూ.3 వేల కోట్లతో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అలాగే రూ.4 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్య నిధిని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ ట్రాక్టర్ల రోడ్డు టాక్స్‌ను కూడా రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్న వ్యక్తులు ప్రమాదవశాత్తూ ఎవరు చనిపోయినా వైఎస్సార్‌ జీవిత బీమా కింద లక్ష రూపాయలు చెల్లిస్తామన్నారు.

బీసీలకు ప్రమోషన్లు వద్దంటూ బాబు లేఖలు
బీసీలు న్యాయమూర్తిగా పనికిరారంటూ కొలిజియానికి చంద్రబాబు నాయుడు లేఖలు రాసిన విషయాన్ని గుర్తు చేశారు. ఓట్ల కోసమే బీసీలపై బాబు కపట ప్రేమ చూపిస్తాడని విమర్శించారు. చిన్నప్పుడు వైఎస్సార్‌కు చదువు చెప్పిన బీసీ కులానికి చెందిన మాస్టారు వెంకటప్ప గుర్తుగా వైఎస్సార్‌, వెంకటప్ప పేరుతో స్కూల్‌ కట్టించారని గుర్తు చేశారు. ఈ స్కూల్లో 3 వేల మంది ఉచితంగా చదువుకుంటున్నారని వెల్లడించారు.

బాబుకు ఆడవాళ్లంటే గౌరవం లేదు
బాబు అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడని విమర్శించారు. చివరికి ఆడవాళ్లను కూడా బజారుకీడుస్తాడని అన్నారు. లక్ష్మీ పార్వతీ లైంగికంగా వేధించిందని సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేయించాడని, రోజాను కూడా ఇబ్బంది పెట్టడం మీరు చూసే ఉంటారని ప్రజల్నే సూటిగా అడిగారు. మహిళలంటే గౌరవం లేని చంద్రబాబుకు మహిళలు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే పత్తికొండ నియోజకవర్గానికి ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఒక్కసారి వైఎస్‌ జగన్‌కు అధికారం ఇవ్వాలని కోరారు. పత్తికొండ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంగాటి శ్రీదేవి, కర్నూలు ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ సంజీవ్‌ కుమార్‌లను ఫ్యాన్‌ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీ గెలిపించాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement