ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించండి | YS vijayamma election campaign for ysrcp party | Sakshi
Sakshi News home page

ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించండి

Published Fri, Apr 5 2019 2:48 AM | Last Updated on Fri, Apr 5 2019 11:08 AM

YS vijayamma election campaign for ysrcp party - Sakshi

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడి మండలంలో నిర్వహించిన ఎన్నికల సభలో పాల్గొన్న అశేషజనవాహిని

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘సరిగ్గా ఎన్నికల ముందు మాత్రమే పెద్దన్ననంటూ మాయమాటలతో వచ్చే చంద్రబాబు కావాలా? ఎల్లవేళలా మీ కష్టాల్లో, సమస్యల్లో తోడుగా ఉండి పోరాటం చేసిన జగనన్న కావాలా?’ అని ప్రజలను వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ ప్రశ్నించారు. ఒక్కసారి ఆలోచించి ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు చేతిలో మళ్లీ మోసపోవద్దని హితవు పలికారు. తొమ్మిదేళ్లుగా జగన్‌ ఎప్పుడూ మీ మధ్యలోనే ఉన్నాడన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. మీకు ఎప్పుడు సమస్య వచ్చినా కూడా.. అది తన కష్టంగా భావించి, రోజుల తరబడి కడుపు మాడ్చుకొని నిరాహార దీక్షలు చేస్తూ చంద్రబాబుపై పోరాడిన జగన్‌కు ఒక్క అవకాశమివ్వాలని కోరారు. గురువారం తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గం గోకవరంలో విజయమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో ఆమె ఏం మాట్లాడారంటే.. 

వైఎస్సార్‌ది సంక్షేమ పాలన.. 
ఎన్నికలు దగ్గరకు వచ్చేశాయి. రాజశేఖరరెడ్డిగారి పాలన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఆయన ప్రతి జిల్లాలోనూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వ్యవసాయాన్ని పండుగ చేశారు. ఉచిత విద్యుత్, గిట్టుబాటు ధరలతో రైతులకు ఎంతో మేలు చేశారు. జలయజ్ఞం కింద నీటి ప్రాజెక్టులు మొదలుపెట్టారు. పుష్కర ఎత్తిపోతల పథకం, తాడిపూడి, చింతలపూడి ఎత్తిపోతల పథకాలు చేపట్టారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించారు. ఈరోజు లక్షలాది ఎకరాలు సాగు చేస్తున్నారంటే.. అంతా ఆయన చేపట్టిన ప్రాజెక్టుల వల్లే. ఆనాడు డెల్టా ఆధునికీకరణ పనులను రాజశేఖరరెడ్డి గారు 80 శాతం మేర పూర్తి చేశారు. మిగిలిన 20 శాతం పనులను టీడీపీ ప్రభుత్వం ఇప్పటికీ పూర్తి చేయలేకపోయింది. రాజశేఖరరెడ్డిగారు పోలవరం ప్రాజెక్టు కట్టబోతే.. దానికి చంద్రబాబు అడ్డుపడ్డాడు. అయినా కూడా రాజశేఖరరెడ్డిగారు జాతీయ ప్రాజెక్టు హోదా తీసుకొచ్చి.. పనులు మొదలుపెట్టారు. ఆయన మరణించి పదేళ్లవుతున్నా కూడా ఈ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారు. ఇప్పటికీ వైఎస్సార్‌ తవ్వించిన కాలువలే.. అక్కడ కనిపిస్తున్నాయి. అలాగే వైఎస్సార్‌ హయాంలో 71 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు. పేదలకు సైతం కార్పొరేట్‌ వైద్యం అందించాలని ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు. లక్షలాది మంది దీని ద్వారా లబ్ధి పొందారు. 108తో అనేక మందికి ప్రాణం పోశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా లక్షలాది మందిని ఉన్నత చదువులు చదివించారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు వచ్చినా కూడా.. ప్రజల కోసం వారి పనులు చేసిపెట్టేవారు. ఆనాడు విద్యుత్‌ చార్జీలు గానీ, పన్నులు గానీ పైసా కూడా పెంచకుండా పాలన అందించారు. చివరి నిమిషం వరకూ ఆయన ప్రజల కోసమే జీవించారు.   

రాజధానిలో అంతా గ్రాఫిక్సే.. 
రాజశేఖరరెడ్డి గారి పాలనలో సంక్షేమం, అభివృద్ధితో రాష్ట్రం సుభిక్షంగా ఉంటే.. నేడు ఎక్కడ చూసినా అన్యాయం, అక్రమాలే. టీడీపీ నేతలు ఇసుక నుంచి మట్టి, బొగ్గు దాకా అన్నీ దోచేశారు. రాజధాని భూములు, గుడి భూములు, దళితుల భూములు.. ఇలా అన్నీ అమ్మేస్తున్నారు. 40 ఏళ్ల అనుభవముందని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇప్పటి వరకు రాజధానిలో శాశ్వత భవన నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా వేయలేదు. ఏమైనా అడిగితే గ్రాఫిక్స్‌ చూపిస్తున్నాడు. మరోవైపు వర్షం వస్తే చాలు తాత్కాలిక భవనాల్లో నీళ్లు కారుతున్నాయి.  

బాబుకు తెలిసింది మోసాలు చేయడమే.. 
ముఖ్యమంత్రి కాగానే చంద్రబాబు ఐదు సంతకాలు చేశాడు. వాటికి కూడా దిక్కులేదు. వైఎస్సార్‌ తాను సీఎం కాగానే ఉచిత విద్యుత్‌ ఫైల్‌పై సంతకం చేసి.. వెంటనే దాన్ని అమలు చేశారు. కానీ చంద్రబాబు పెట్టిన ఒక సంతకమైనా నెరవేరిందా? రుణమాఫీ పేరిట రైతులను మోసం చేశాడు. చంద్రబాబు నిర్వాకం వల్ల ఈరోజు ఒక్క రైతుకు కూడా బ్యాంకులు రుణాలివ్వడం లేదు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలను కూడా ఇలాగే మోసం చేశాడు. మళ్లీ ఎన్నికలు దగ్గర పడేసరికి పసుపు కుంకుమ, పెద్దన్న అనుకుంటా వస్తున్నాడు. పోస్ట్‌డేటెడ్‌ చెక్కులిస్తున్నాడు. ఈ ఐదేళ్లలో డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు పైసా కూడా రుణమాఫీ చేయని వ్యక్తి.. ఇప్పుడు హఠాత్తుగా పసుపు కుంకుమ అంటున్నాడంటే మళ్లీ మోసం చేయడం కాదా అని ప్రశ్నిస్తున్నా? ఎన్నికల ముందు వచ్చే అన్న మీకు కావాలా? ఎల్లప్పుడూ మీతోనే ఉండే జగనన్న కావాలా? ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు చేతిలో మళ్లీ మోసపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా.  

మాకు తెలిసిందల్లా  పేదలకు ఆస్తులు పంచడమే..  
చంద్రబాబు మా మీద దుష్ప్రచారం చేస్తున్నాడు. ఆయనలా దోచుకోవడం, దాచుకోవడం మాకు తెలీదు. మాకు తెలిసిందల్లా పేదలకు ఆస్తులు పంచడమే. చంద్రబాబు నాలుగున్నరేళ్లు బీజేపీతో కలిసి తిరిగాడు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్యాకేజీ కావాలన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్‌తో తిరుగుతూ.. బీజేపీ, కేసీఆర్, జగన్‌ అంటూ విషప్రచారం చేస్తున్నాడు. చంద్రబాబును ఒక్కటే అడుగుతున్నా.. కేసీఆర్‌కు, మన రాష్ట్రానికి సంబంధమేంటి? కేసీఆర్‌ ఏమైనా ఇక్కడ పోటీ చేస్తున్నాడా? మరెందుకు తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నావ్‌ చంద్రబాబూ? అందరికీ ఒక్కటే చెబుతున్నా.. వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ ఒంటరిగానే పోటీ చేస్తుంది. సింహం సింగిల్‌గానే వస్తుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదానే మాకు ముఖ్యం. వైఎస్సార్‌సీపీ గెలిస్తేనే.. ప్రత్యేక హోదా సాధ్యమవుతుంది. ప్రతిఒక్కరూ ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా. 

ఎవరికిచ్చావ్‌ భద్రత? 
చంద్రబాబు మీ భవిష్యత్, మీ భద్రత.. నా బాధ్యత అంటున్నాడు. అసలు చంద్రబాబు ఎవరికి భద్రత ఇచ్చాడు..? యువతకు భద్రత ఇచ్చాడా? రైతులకు భద్రత ఇచ్చాడా? డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు భద్రత ఇచ్చాడా? రాష్ట్రంలో ఎవ్వరికీ భద్రత లేకుండా పోయింది. మహిళలపై దాడులు జరగుతున్నా పట్టించుకోవడం లేదు. రిషితేశ్వరి హత్య కేసు నిందితులకు రక్షణగా నిలిచాడు. వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి చేసినా చంద్రబాబు చర్యలు తీసుకోలేదు. మహిళలపై వేధింపుల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులే నిందితులుగా ఉన్నారు. మరోవైపు సంక్షేమ పథకాలనూ నిర్వీర్యం చేశాడు. ఆరోగ్య శ్రీ, 108, ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. ఇలా అన్ని పథకాలను అటకెక్కించాడు. లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కూడా వాటిని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. తాగునీరు ఇవ్వడం లేదు గానీ.. గ్రామగ్రామానా మద్యం ఏరులై పారిస్తున్నాడు.  

జగన్‌ కూడా తన తండ్రిలానే.. 
కాంగ్రెస్, టీడీపీ కలిసి జగన్‌పై ఎన్నో కుట్రలు పన్నాయి. సీబీఐ, ఈడీని ఉసిగొల్పాయి. ఆస్తులను అటాచ్‌ చేశారు. ఆ సమయంలో కూడా 18 మంది ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ మా వెంట నిలిచారు. వారి స్థానాలకు 12 రోజుల్లో ఉప ఎన్నిక అనగా.. విచారణ పేరుతో పిలిచి జగన్‌ను జైల్లో పెట్టారు. మా కుటుంబాన్ని అన్నిరకాలుగా వేధించారు. కాంగ్రెస్‌కు రాజశేఖరరెడ్డిగారు సుమారు 30 ఏళ్ల పాటు సేవలందించారు. అలాంటి నాయకుడి బిడ్డను కాంగ్రెస్, టీడీపీ కలిసి 11 కేసుల్లో అన్యాయంగా ఇరికించాయి. ఆరోజు మాకు అండగా నిలిచిన ప్రజల కోసమే.. నేను, షర్మిలమ్మ బయటకు వచ్చాం. మేము వచ్చామని ప్రజలంతా కూడా రోడ్డు మీదకు వచ్చారు. మమ్మల్ని ముందుకు నడిపించారు. అప్పుడే నిర్ణయించుకున్నాం.. ఈ ప్రజల కోసం ఎందాకైనా పోరాడాలని. అప్పట్నుంచి ఈ తొమ్మిదేళ్లలో జగన్‌ ఎప్పుడూ మీతోనే ఉన్నాడు. నెలలో 25 రోజులు మీ మధ్యనే ఉండేవాడు. మీకు వచ్చిన ప్రతి సమస్యపైనా పోరాడాడు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా దీక్షలు, ధర్నాలు చేశాడు. ఏడు, ఎనిమిది రోజుల పాటు తన కడుపు మాడ్చుకొని మీ కోసం నిరాహార దీక్షలు చేశాడు. ఏ ప్రమాదం జరిగినా.. జగన్‌ వెంటనే వెళ్లి వారిని పరామర్శించేవాడు. వారికి ధైర్యం చెప్పేవాడు. కానీ ఈ తొమ్మిదేళ్లలో జగన్‌ ఎప్పుడూ తన కష్టం మీకు చెప్పుకోలేదు. పైగా మీ కష్టాలు తెలుసుకునేందుకు ఓదార్పుయాత్రలు, పాదయాత్రలు చేశాడు. మీ అందరికీ ‘నేను ఉన్నాను..’ అని భరోసా ఇస్తున్నాడు. వైఎస్సార్‌ భార్యగా చెబుతున్నా.. జగన్‌ కూడా తన తండ్రిలా మాట ఇస్తే తప్పడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement