బాబులాంటి అన్న ఎవరికీ వద్దు | Ys sharmila fire on ap cm chandrababu | Sakshi
Sakshi News home page

బాబులాంటి అన్న ఎవరికీ వద్దు

Published Fri, Apr 5 2019 2:53 AM | Last Updated on Fri, Apr 5 2019 4:14 AM

Ys sharmila fire on ap cm chandrababu - Sakshi

గురువారం పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు హాజరైన జనసందోహంలో ఓ భాగం

వైఎస్సార్‌ సీపీ అధికారంలోకివస్తే ఈ ప్రాంతంలో మంచినీటి సమస్య ఉండదు. ఆక్వా కల్చర్‌ కోసం ఎన్ని వసతులు కావాలన్నా కల్పిస్తాం.ఆక్వా సాగు కోసం కరెంట్‌ యూనిట్‌ రూపాయిన్నరకే ఇస్తాం. కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటు చేస్తాం.కొల్లేరులో చాలా సమస్యలున్నాయని బాధపడుతున్నారు. ఉద్యోగాలులేక వలసలు వెళుతున్నారని చెప్పారు. జగనన్న కొల్లేరులో ప్రతి సమస్యను పరిష్కరిస్తారు. మళ్లీ రీ సర్వే చేయించి కాంటూరు తగ్గించి అదనంగా వచ్చిన భూమిని అక్కడే స్ధానికులకే  ఇస్తాం. ప్రతి విషయంలోనూ మీకు అండగా ఉంటాం. అగ్రిగోల్డ్‌ బాధితులకు కూడా న్యాయం చేస్తాం.    – షర్మిల

సాక్షి ప్రతినిధి, ఏలూరు: చంద్రబాబు లాంటి అన్న ఎవరికీ ఉండకూడదని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు. ‘ఎమ్మార్వో వనజాక్షి చంద్రబాబుకు చెల్లెలులాంటిది కాదా? టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ నడి రోడ్డుపై ఆమెను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లినప్పుడు చంద్రబాబులో అన్న చచ్చిపోయాడా? గుంటూరులో ఆయన మనిషి కారణంగా ఆత్మహత్య చేసుకున్న కాలేజి విద్యార్థిని రిషితేశ్వరి చెల్లెలులాంటిది కాదా? అప్పుడు చంద్రబాబులో అన్న చచ్చిపోయాడా?’ అని షర్మిల సూటిగా ప్రశ్నించారు. బస్సు యాత్ర నిర్వహిస్తున్న షర్మిల గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలో కిక్కిరిసిన సభల్లో ప్రసంగించారు. ఉండి, గుండుగొలను, దేవరపల్లి, నిడదవోలులో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడారు. ఆ వివరాలు అమె మాటల్లోనే...

హింసిస్తుంటే ఈ అన్న చచ్చిపోయాడా?
‘‘గత ఐదేళ్లలో చంద్రబాబు మహిళలకు ఏమీ చేయలేదు. ఇప్పుడు ఎన్నికలు రావడంతో మీరంతా నా అక్కచెల్లెళ్లు, అన్నలాంటి నాకు ఓటేయాలని తిరుగుతున్నారు. అన్న అంటే ఎవరు? తోబుట్టువుకి తోడుగా ఉండేవాడు. అక్కచెల్లెళ్లకు కష్టకాలంలో తోడుగా ఉండే వాడే అన్న. అక్కచెల్లెళ్లకు ఇచ్చిన మాట తప్పనివాడే అన్న. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఐదేళ్లైంది. మాట తప్పినవాడు అన్న అవుతాడా? ఎమ్మార్వో వనజాక్షి చంద్రబాబుకు చెల్లెలు లాంటిది కాదా...? టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ నడి రోడ్డుపై ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లాడు. అప్పుడు ఈ అన్న చచ్చిపోయాడా...? నిస్సిగ్గుగా చింతమనేనికి మళ్లీ ఎమ్మెల్యే టిక్కెట్‌ కూడా ఇచ్చాడు ఈ చంద్రబాబు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధిని రిషితేశ్వరి ఈయనకు చెల్లెలు లాంటిది కాదా? తుందుర్రులో ఆక్వా పార్కు వల్ల కాలుష్యం పెరుగుతుందని ఎంతో మంది మహిళలు ఆందోళన చేస్తే లాఠీలతో కొట్టించి జైళ్లల్లో పెట్టించారు చంద్రబాబు. అప్పుడు ఈ అన్న చచ్చిపోయాడా? అంగన్‌వాడీ మహిళలు జీతాలు సరిపోవడం లేదని ఆందోళన చేస్తే లాఠీలతో కొట్టించాడు. అప్పుడు ఈ అన్న చచ్చిపోయాడా? తమ పొట్ట కొట్టవద్దని మధ్యాహ్న భోజన పథకం మహిళలు వేడుకుంటే లాఠీలతో కొట్టించాడు చంద్రబాబు. అప్పుడు ఈ అన్న చచ్చిపోయాడా? నిజంగానే చంద్రబాబు లాంటి అన్న ఉంటే అంతకు మించి దురదృష్టవంతురాలే ఉండదు.

అనుభవజ్ఞుడినంటూ ఒక్క భవనమైనా కట్టాడా?
చంద్రబాబు డ్వాక్రా మహిళలకు ఒక్క రూపాయి కూడా రుణం మాఫీ చేయలేదు. పసుపు కుంకుమ అంటూ విదిల్చే డబ్బులు ఆ రుణాలపై వడ్డీలకు కూడా సరిపోవు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నాడు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాక, ఫీజులు కట్టలేక ఎంతో మంది విద్యార్ధులు మధ్యలోనే చదువులు మానేస్తున్నారు. ఆరోగ్యశ్రీలో కార్పొరేట్‌ ఆస్పత్రులను తొలగించారు. చంద్రబాబు కుటుంబానికి జబ్బు చేస్తే ప్రభుత్వాసుపత్రికి వెళ్తారా? కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును కమీషన్ల కోసం దక్కించుకుని అంచనాలను రూ.15 వేల కోట్ల  నుంచి రూ.60 వేల కోట్లకు పెంచాడు. మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తానన్న హామీని నిలబెట్టుకోలేదు. అనుభవం ఉందంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అమరావతిలో కనీసం ఒక్కటైనా శాశ్వత భవనంగానీ, ఫ్లైఓవర్‌గానీ కట్టారా? కేంద్రం ఇచ్చిన రూ.2,500 కోట్లు ఏమైనట్లు? మరో ఐదేళ్లు అవకాశం ఇస్తే అమరావతిని అమెరికా, శ్రీకాకుళాన్ని హైదరాబాద్‌ చేస్తానంటూ మన చెవిలో పువ్వులు, క్యాబేజీలు పెడుతున్నాడు. బాబు వస్తే జాబు వస్తుందన్నారు. కేవలం చంద్రబాబు కుమారుడు పప్పు లోకేష్‌కు మాత్రమే వచ్చింది. ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చేశారు. పప్పు లోకేష్‌కు కనీసం జయంతికి, వర్ధంతికి కూడా తేడా కూడా తెలియదు. చంద్రబాబు కుమారుడికి మూడు ఉద్యోగాలు, యువతకు మాత్రం ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లూ లేవు.

కేసీఆర్‌తో పొత్తు కోసం వెంపర్లాడింది బాబే
ఏపీకి ఊపిరి లాంటి హోదాను చంద్రబాబు నీరుగార్చారు. బీజేపీతో కుమ్మకై ప్యాకేజీకి ఒప్పకున్నారు. హోదా కోసం ఐదేళ్లుగా జగనన్న చేయని పోరాటం లేదు. చంద్రబాబు ఇవాళ యూటర్న్‌ తీసుకొని హోదా అనడానికి కారణం జగనన్న కాదా? చంద్రబాబు ఇవాళ పౌరుషం, రోషం అంటూ ఆయనకు సరిపోని మాటలు మాట్లాడుతున్నారు. జగన్‌కు పౌరుషం ఉందా? అంటున్నారు. కేసీఆర్‌తో, బీజేపీతో మాకు పొత్తులు ఉన్నాయంటూ అబద్దాలు ప్రచారం చేస్తున్నాడు. పిల్లి గట్టిగా నాకు పౌరుషం ఉందంటే పులి కాలేదు. పిల్లి పిల్లే.. పులి పులే. ఓదార్పు అనే ఒక్క మాట కోసం జగనన్న కాంగ్రెస్‌ను వీడి బయటకు ఒంటరిగా వచ్చారు. అదీ పౌరుషం, రోషం అంటే. హరికృష్ణ మృతదేహం పక్కనే ఉందనే ఇంగితం కూడా లేకుండా కేసీఆర్‌తో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడారు. మాకు ఎవరితోనూ పొత్తులు అవసరం లేదు. వైఎస్సార్‌ సీపీ సింగిల్‌గానే బంపర్‌ మెజార్టీతో గెలవబోతోందని దేశంలోని అన్ని సర్వేలు చెబుతున్నాయి. నక్కలే గుంపులుగా వస్తాయి. చంద్రబాబు కాంగ్రెస్, జనసేనతో తోడుగా వస్తున్నారు’’. 

బకాయిలపై బాబును నిలదీయండి
గత ఎన్నికల్లో 600కిపైగా హామీలిచ్చి ఒక్కటి కూడా నిలబెట్టుకోకుండా ఇప్పుడు మళ్లీ మీ భవిష్యత్తు నా బాధ్యత.. అంటూ వస్తున్నాడు దొంగబాబు. ఆయనకు హామీలను నిలబెట్టుకునే దమ్ముంటే గత ఎన్నికల్లో చేసిన వాగ్దానాల బకాయి డబ్బులను ఎన్నికలలోపే పూర్తిగా చెల్లించమని నిలదీయండి. అది మీ హక్కు. టీడీపీ నేతలు ఓట్లు అడగటానికి మీ ఇంటికి వస్తే ముందు బాకీలు తీర్చమనండి. పాత హామీలను పాతిపెట్టి కొత్త వాగ్దానాలు చేస్తున్న చంద్రబాబును నిన్ను నమ్మం అని తేల్చి చెప్పండి. అందుకే అంతా బైబై బాబు.. అంటూ ప్రజాతీర్పు చెప్పండి. జగనన్నకు మీకు సేవ చేసుకునే అవకాశం ఒక్కసారి ఇవ్వండి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement