సత్యవేడు: కాంగ్రెస్ పార్టీని ఎదిరించినందుకు కేసులు పెట్టి జైలులో పెట్టినా, ఆస్తులు అటాచ్ చేసినా తన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భయపడలేదని, అలాంటిది కేసీఆర్, మోదీలకు జగన్ భయపడుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు.. తన కుమారుడు భయపడతాడా అని వైఎస్ విజయమ్మ సూటిగా ప్రజల్నే అడిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ విజయమ్మ చిత్తూరు జిల్లా సత్యవేడులో ప్రసంగించారు. చంద్రబాబు ప్రజాస్వామ్యం, విలువలు గురించి మాట్లాడితే నవ్వు వస్తోందన్నారు. ఆయన ఎక్కడ ప్రజాస్వామ్య విలువలు కాపాడారో చెప్పాలని ప్రశ్నించారు. అసెంబ్లీలు దేవాలయాలవంటివని ఆనాడు జవహర్ లాల్ నెహ్రూ చెప్పారు.. అట్లాంటి దేవాలయాల గౌరవాన్ని మంటగలిపింది చంద్రబాబేనని విమర్శించారు.
ప్రజా సమస్యలపై మాట్లాడకుండా అసెంబ్లీలో వైఎస్ జగన్‌ను, రాజశేఖర్ రెడ్డిని తిట్టడానికే ప్రాధాన్యమిచ్చేవారని అన్నారు. వైఎస్సార్‌సీపీకి మైక్ ఇచ్చినట్లే ఇచ్చి చంద్రబాబు, స్పీకర్‌కు సైగ చేసి మైక్ కట్ చేయించే వారని చెప్పారు. అసెంబ్లీలో మైక్ లేకుండా ప్రజాసమస్యలపై ఎలా పోరాడతారో చెప్పాలన్నారు. ఏరోజూ కూడా ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా టీడీపీ నాయకులు అడ్డుకునే వారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొన్నారని వ్యాఖ్యానించారు. పైపెచ్చు వారితో రాజీనామా చేయించకుండా నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారని దుయ్యబట్టారు. టీడీపీకి దమ్మూ దైర్యం ఉంటే వారితో రాజీనామా చేయించి టీడీపీ గుర్తుపైన గెలిచిపించుకుని ఉండాల్సిందన్నారు. ఎన్నిసార్లు స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో న్యాయం జరగదని భావించి ప్రజాసంకల్పయాత్రకు వైఎస్ జగన్ పూనుకున్నాడని తెలిపారు.
వైఎస్సార్‌సీపీలోకి ఏ పార్టీ నాయకుడు వచ్చినా ముందు రాజీనామా చేసి వచ్చిన తర్వాతే పార్టీలోకి చేర్చుకున్నాడని, దీనికి శిల్పా చక్రపాణి రెడ్డే ఉదాహరణ అని చెప్పారు. సేవా మిత్ర యాప్ ద్వారా చంద్రబాబు నాయుడు ఆంధ్రుల డాటా చోరీ చేశారని, దానిని ఐటీ గ్రిడ్ కంపెనీకి ఇచ్చి పెద్ద మోసానికి తెరలేపారని ఆరోపించారు. ఆ డాటాతోనే వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించారని ఆరోపించారు. ప్రత్యేక హోదా ఈనాటికీ సజీవంగా ఉందంటే దానికి వైఎస్ జగనే కారణమన్నారు. ఆంధ్రా, ఢిల్లీలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనలతో వైఎస్ జగన్ ప్రత్యేక హోదా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవులకు కూడా రాజీనామా చేయించిన ఘనత జగన్‌కే దక్కిందన్నారు.
బీజేపీతో ఉన్నపుడు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అన్నాడు..మరి ఇప్పుడో
చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసి ఉన్నపుడు తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అన్నాడు.. ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని వైఎస్ జగన్ బీజేపీతో కలిశాడని ఆరోపిస్తున్నారు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతోనూ పెట్టుకోలేదని స్పష్టంగా చెబుతున్నామని, తాము సింగిల్‌గానే పోటీ చేస్తున్నామని వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే ప్రత్యేక హోదా రావాలని, 25 మంది వైఎస్సార్‌సీపీ ఎంపీలు గెలిపిస్తే ప్రత్యేక హోదా తెచ్చుకోవడం తేలికవుతుందని చెప్పారు. పెద్దన్నయ్య అంటూ ముందుకు వస్తున్న చంద్రబాబు ఈ ఐదేళ్లు ఏమయ్యాడని వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు మాత్రమే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వస్తారని ఎద్దేవా చేశారు.
అధికారంలోకి రాగానే ఖాళీల భర్తీ
అధికారంలో ఉండి ఖాళీగా ఉన్న 2.42 లక్షల ప్రభుత్వ పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదని వైఎస్ విజయమ్మ సూటిగా అడిగారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే భర్తీ చేస్తారని హామీ ఇచ్చారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. స్థానికంగా ఉన్న పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేవిధంగా చట్టచేస్తామని చెప్పారు. 17 కేసుల్లో స్టే తెచ్చుకుని తిరుగుతున్నది ఎవరని పరోక్షంగా చంద్రబాబు నుద్దేశించి ప్రశ్నించారు. కేసుల్ని ఎదుర్కొనే దమ్మూ ధైర్యం నీకు లేదు.. స్టే తెచ్చుకుని బతుకుతున్నారు.. బ్రీఫ్డ్‌మీ అనే స్వరం మీది కాదా.. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు హైదరాబాద్ నుంచి అమరావతికి ఆఘమేఘాల మీద పారిపోయిన చరిత్ర చంద్రబాబుదన్నారు. కేసుల కోసం ఎవరి కాళ్లయినా పట్టుకునే నీచపు చరిత్ర చంద్రబాబుదేనని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment