సాక్షి, కర్నూలు : భర్త చాటు భార్యే అయినా ఊహించని విధంగా రాజకీయాల్లోకి వచ్చారామె. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని రైతులకు చేతనైనంత సాయం చేశారు. మంచి పేరు తెచ్చుకుంటున్న దశలో అనుకోకుండా పదవిని వదులుకోవాల్సి రావడంతో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న భర్తకు చేదోడు వాదోడుగా మెలిగారు. ఇంతలో ప్రత్యర్థుల పాశవిక దాడిలో భర్త దారుణ హత్యకు గురి కావడం ఆమె జీవితాన్ని కుదిపేసింది. ‘నీకు పూర్తి అండగా ఉంటాం’ అని చెప్పిన సమీప బంధువులు సైతం ప్రత్యర్థులతో చేయి కలిపారు. ఇన్ని కష్టాల్లోనూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన భరోసానే తనకు ధైర్యాన్నిచ్చిందని.. అదే తనను ముందుకు నడిపిస్తోందని అంటున్నారు కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంగాటి శ్రీదేవి. ఇంకా ఏమన్నారో ఆమె మాటల్లోనే....
‘నా రాజకీయ ప్రస్థానం ఊహించనిది. కాంగ్రెస్ పార్టీలో తిరిగే నా భర్త చెరుకులపాడు నారాయణరెడ్డి ప్రోత్సాహంతో కర్నూలు డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నికయ్యా. రాజకీయ ఒడుదొడుకుల నేపథ్యంలో ఆ పదవిని వీడాల్సి వచ్చింది. అయినా నిరుత్సాహం చెందలేదు. తదనంతర పరిణామాల్లో నా భర్త నారాయణరెడ్డి వైఎస్సార్‌సీపీలోకి వచ్చారు. పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రజల్లోకి చొచ్చుకెళ్లారు. దీనిని జీర్ణించుకోలేని ప్రత్యర్థులు రెండేళ్ల క్రితం ఓ వివాహానికి హాజరై వస్తుండగా వేట కొడవళ్లు, బాంబులు వేసి అతి కిరాతకంగా హత్య చేశారు.
ఇలాంటి స్థితిలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నన్ను ఓదార్చారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ ఇస్తామని ప్రకటించారు. అలా టిక్కెట్ దక్కిన తొలి వ్యక్తి నేనే. నా భర్త హత్య అనంతరం నన్ను పరామర్శించిన దగ్గరి బంధువులు ఇప్పుడు అదే హంతకులతో చేతులు కలిపారు. జగనన్న ఇచ్చిన కొండంత ధైర్యం తోడుగా నన్ను, పార్టీని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలను కాపాడుకుంటూ ముందుకెళ్తున్నా.
కేఈ ఏమీ చేయలేదు...
మా నియోజకవర్గం దశాబ్దాలుగా కరువు కాటకాలకు నిలయం. రైతుల సమస్యలను తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఇక్కడి ఎమ్మెల్యే కేఈ కృష్ణమూర్తి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా ప్రజల తాగు నీటి, రైతుల సాగునీటి ఇబ్బందులు తీరలేదు. హంద్రీ నీవా నీటితో నియోజకవర్గంలో మొదట 106 చెరువులను నింపుతామని చెప్పిన ఉప ముఖ్యమంత్రి తర్వాత 68 చెరువులని మాట మార్చారు. ఈ పనులూ అసంపూర్తిగానే ఉన్నాయి . కేఈ హామీలను తుంగలో తొక్కారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హంద్రీ నీవా నీటితో చెరువులను నింపేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తాం.
సాగునీటి కల్పనే ధ్యేయం
నియోజకవర్గంలోని 32 వేల ఎకరాలకు సాగు నీరు అందించడమే నా ధ్యేయం. రైతులు నష్టపోకుండా అన్ని చర్యలను తీసుకుంటాం. ఏ గ్రామంలోనూ తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేస్తా. సమస్యలను అంచెలంచెలుగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తా.
బాలికా విద్యకు ప్రాధాన్యం
నేను డిగ్రీ (బీఏ) చదివా. బాలికా విద్య ప్రాధాన్యం తెలుసు. నియోజకవర్గంలో బాలికల విద్యకు పెద్ద పీట వేస్తాం. బీసీ బాలికలకు వసతి గృహం, పాలిటెక్నికల్ కళాశాల నెలకొల్పేలా చూస్తా. నా భర్త ఉన్నప్పుడు పలు సేవా కార్యక్రమాలు చేపట్టాం. పేదల ఇంట వివాహాలకు తాళి బొట్లు, కాలి మెట్టెలు, దుస్తులు అందజేశాం. వీటిని కొనసాగిస్తానని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment