పత్తికొండ: మాటలు చెప్పకండి సార్.. చెప్పిన మాటల్లో నిజం ఉండాలంటూ కర్నూలు జిల్లా పత్తికొండలో ఓ రైతు వ్యవసాయ శాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావును నిలదీయడంతో మంత్రి ఖంగుతిన్నాడు. వివరాల్లోకి వెళితే..పత్తికొండ మండలంలోని కోతిరాళ్ల క్రాస్ రోడ్డులో జిల్లా కలెక్టర్ విజయమోహన్ అధ్యక్షతన రైతులతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా సభలో రైతు కేశవయ్య మాట్లాడుతూ తాను ఉల్లి పంట సాగు చేశానని, ఎకరాకు రూ.80 వేల పెట్టుబడి అయిందన్నాడు.
అయితే పక్కనే ఉన్నా హంద్రీ నీవా నీళ్లు అందించలేని పరిస్థితి ఉంది. కష్టపడి పంట పండిస్తున్నా. ఇంతా చేస్తే.. కిలో రూ.6లతో కొనుగోలు చేస్తామంటారు. ఎట్లా గిట్టుబాటు అవుతుంది అంటూ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో వాపోయాడు. ఇందుకు ఆయన సమాధానమిస్తూ నీకు రుణమాఫీ అయిందా అన్నారు. కాలేదని రైతు చెప్పడంతో కొన్ని లోపాల వల్ల రాకపోయి ఉండొచ్చని సర్ది చెప్పారు. దీంతో రైతు మాటలు చెప్పకండి సార్, చెప్పిన మాటల్లో నిజం ఉండాలన్నాడు. ఆ మాటలకు ఖంగుతిన్న మంత్రి నువ్వుగా ఇక్కడికి వచ్చావా.. లేక సాక్షి విలేకరులు.. వైఎస్సార్ సీపీ నాయకులు చెబితే వచ్చావా అంటూ రైతును దబాయించాడు. దీంతో అదే స్థాయిలో రైతు కేశవయ్య నేను రైతును. మీరు అడుగుతుంటే నా బాధ చెబుతున్నా అన్నాడు. దీంతో రైతును సభ నుంచి దూరంగా పంపేశారు.
మాటలు చెప్పకండి సార్..
Published Thu, Sep 1 2016 12:10 AM | Last Updated on Mon, Oct 1 2018 4:42 PM
Advertisement