ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 71 లక్షల మందికి పెన్షన్ ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కిందని వైఎస్ విజయమ్మ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం వైఎస్ విజయమ్మ కర్నూలు జిల్లా పత్తి కొండ నియోజకవర్గంలో ప్రసంగించారు. ఏపీ మినహా దేశమంతా కూడా 48 లక్షల ఇళ్లు కడితే ఒక్క ఏపీలోనే 49 లక్షల ఇళ్లు కట్టించి వైఎస్సార్ రికార్డు సృష్టించారని తెలిపారు. అలాగే దళితులకు 32 లక్షల ఎకరాల భూములు పంచిన ఘనత కూడా వైఎస్సార్‌కే దక్కిందన్నారు. మైనార్టీలు ఆర్ధికంగా ఎదగాలని 4 శాతం రిజర్వేషన్ కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాగానే 10 లక్షల పెన్షన్లు తీసేశాడని ఆరోపించారు.