
దక్షిణాఫ్రికాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక గనిలో చిక్కుకుని, 100 మంది కార్మికులు మృతిచెందారని సమాచారం. మీడియాకు తెలిసిన వివరాల ప్రకారం ఈ కార్మికులంతా దక్షిణాఫ్రికాలోని ఒక బంగారు గనిలో అక్రమంగా పనులు చేస్తున్నారు.
గనిలో చిక్కుకున్న కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక బృందం మీడియాతో మాట్లాడుతూ ఈ కార్మికులు నెలల తరబడి భూగర్భ గనిలో చిక్కుకున్నారని తెలిపింది. ఈ నేపధ్యంలోనే వారు మరణించారని పేర్కొంది. కాగా గనిలో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి పోలీసులు ప్రయత్నించినప్పటికీ, విజయం సాధించలేకపోయారు.
మైనింగ్ ప్రభావిత కమ్యూనిటీస్ యునైటెడ్ ఇన్ యాక్షన్ గ్రూప్ ప్రతినిధి సబెలో మ్ంగుని మీడియాతో మాట్లాడుతూ కొందరు గని కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారని, వారి దగ్గర రెండు వీడియోలు లభ్యమయ్యాయన్నారు. ఆ వీడియోల్లో డజన్ల కొద్దీ మృతదేహాలు భూగర్భంలో గనిలో కనిపిస్తున్నాయన్నారు.
వాయువ్య ప్రావిన్స్‌లోని ఈ గనిలో 100 మంది వరకూ మృతిచెందారని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. ఇప్పటివరకు భూగర్భ గనిలో నుంచి 18 మృతదేహాలను బయటకుతీశారు. వారు ఆకలి, డీహైడ్రేషన్ కారణంగా చనిపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Mahakumbh-2025: మకర సంక్రాంతి వేళ.. అమృత స్నానానికి పోటెత్తిన జనం
Comments
Please login to add a commentAdd a comment