ఖరీదైన రెండు వజ్రాలు లభ్యం !
గుత్తి :కర్నూలు జిల్లా తుగ్గలి మండల పరిధిలోని జొన్నగిరి గ్రామ శివారులోని పొలాల్లో అత్యంత విలువైన రెండు వజ్రాలు లభ్యమైనట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. వజ్రాల అన్వేషణకు వెళ్లిన అనంతపురం జిల్లా గుత్తి, కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని రామాపురానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు గత ఆదివారం ఇవి వేర్వేరుగా దొరికాయి. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ వ్యక్తులు గుత్తిలోని ఓ వజ్రాల వ్యాపారికి వాటిని విక్రయించినట్లు తెలుస్తోంది. ఓ వజ్రాన్ని రూ.10 లక్షలు, 10 తులాల బంగారం, మరొక దానిని రూ.3.50 లక్షల నగదు, 3 తులాల బంగారం తీసుకుని విక్రయించినట్లు తెలుస్తోంది. అయితే ఆ రెండు వజ్రాల విలువ సుమారు రూ. 50 లక్షలు ఉంటుందని అంచనా. తుగ్గలి మండలంలోని జొన్నగిరి, కానుగ బసినేపల్లి, గుత్తి మండలంలోని బేతాపల్లి, ఊటకల్లు గ్రామాల్లో తరచూ వజ్రాలు లభిస్తుంటాయి.
వర్షా కాలం వచ్చిందంటే ఆశాజీవులు కొందరు చద్దులు కట్టుకుని మరీ పొలాల వెంట వజ్రాల కోసం అన్వేషించడం పరిపాటి. ఏటా వర్షా కాలం ప్రారంభంలో 50-60 వజ్రాల దాకా లభ్యమవుతుంటాయని అంచనా. ఈ నేపథ్యంలో వీటి వ్యాపారాన్ని గుట్టుగా సాగిస్తుంటారు. ఈ ఏడాది ఇప్పటిదాకా వేర్వేరు ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు 13 వజ్రాలు లభించినట్లు తెలుస్తోంది. గతంలో కర్నూలు జిల్లా పెరవలిలో మాత్రమే వజ్రాల వ్యాపారులు ఉండేవారు. ఇటీవల గుత్తిలో కూడా వజ్రాల వ్యాపారుల సంఖ్య పెరిగింది. ఒకే వంశానికి చెందిన ఆరుగురు వజ్రాల వ్యాపారులు గుత్తిలో ఉండడం విశేషం.