యువకుడిపై దాడిచేసినకుటుంబ సభ్యులు
భయాందోళనతో యువకుడి ఆత్మహత్య?
గాజువాకలో దారుణం
అక్కిరెడ్డిపాలెం(విశాఖపట్నం): యువతి స్నానం చేస్తుండగా ఓ యువకుడు వీడియో తీశాడు. ఇది గమనించిన యువతి బంధువులు ఆ యువకుడిపై దాడి చేసి గదిలో బంధించారు. భయాందోళన చెందిన ఆ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా.. తమ కుమారుడిని ఆ యువతి బంధువులు కొట్టి హత్య చేశారని బాధిత తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన శనివారం గాజువాకలో చోటుచేసుకుంది. గాజువాక సీఐ ఎ.పార్థసారథి తెలిపిన వివరాలివీ. విజయనగరం జిల్లాకు చెందిన జి.భాస్కరరావు(30) ఫార్మాసిటీలోని ఓ ఫార్మా కంపెనీలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు.
ఇంకా వివాహం కాలేదు. గాజువాక శ్రీనగర్‌లోని శ్రీరాంనగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితం ఇంటి యజమానురాలి మనవరాలు ఊరు నుంచి వచ్చింది. పై ఇంట్లో యజమానురాలి బాత్‌రూమ్ కొంత ఓపెన్‌గా ఉంటుంది. శనివారం మనవరాలు స్నానం చేస్తుండగా భాస్కరరావు వీడియో తీస్తున్నాడని బిగ్గరగా అరిచింది. దీంతో భాస్కరరావు అక్కడ నుంచి తన రూమ్‌లోకి వచ్చేశాడు. అక్కడకి వచ్చిన యువతి బంధువులు భాస్కరరావుపై దాడి చేసి అతడి రూమ్‌లోనే బంధించి తాళం వేశారు.
వీడియో విషయాన్ని అతడి తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో ఆందోళన చెందిన భాస్కరరావు తన రూమ్‌లోనే కేబుల్ వైర్లతో ఉరివేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. విజయనగరంలో ఆటోడ్రైవర్‌గా జీవిస్తున్న భాస్కరరావు తండ్రి తాతారావు.. తన కుమారుడిని యువతి బంధువులు కొట్టి హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో యువతికి సంబంధించిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment