మణికొండ: అతివేగంతో దూసుకొచ్చిన కారు అదుపు తప్పి రోడ్డు మధ్యలోని హోర్డింగ్ స్తంభాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఓ యువ వైద్యుడు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళా డాక్టర్ గాయాల పాలయ్యారు. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ గ్రామం వద్ద శనివారం తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎల్‌బీ నగర్‌లోని కామినేని ఆస్పత్రిలో వి.జస్వంత్ (25), భూమిక హౌస్ సర్జన్‌లుగా పని చేస్తున్నారు.
శుక్రవారం రాత్రి వీరు కారులో రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లికి ఓ వివాహానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో తెల్లవారు జామున ఖానాపూర్ వద్ద రోడ్డు మలుపును గమనించకుండా వేగంగా రావడంతో కారు అదుపు తప్పింది. రోడ్డు మధ్యలో డివైడర్‌పై ఉన్న హోర్డింగ్ స్తంభాన్ని ఢీకొట్టింది. డ్రైవింగ్ చేస్తున్న జస్వంత్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. పక్క సీటులో కూర్చున్న భూమికకు తీవ్ర గాయాలు కావటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment