ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: ప్రొద్దుటూరు పశువైద్య కళాశాలకు భారత పశు వైద్య మండలి (వీసీఐ) గుర్తింపు లభించకపోవడంతో ఇక్కడ చదివిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పశుసంవర్థకశాఖ జారీ చేసిన 469 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు సోమవారంతో గడువు ముగియనుంది. దీంతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఎలాగైనా తమకు అర్హత కల్పించాలని ప్రొద్దుటూరు పశువైద్య కళాశాలలో చదివిన విద్యార్థులు వేడుకుంటున్నారు. ఇందు కోసం వీరు గత 10 రోజులుగా హైదరాబాద్‌లోనే మకాం వేశారు. సీఎం పేషీతోపాటు పశుసంవర్థకశాఖ డెరైక్టర్, చీఫ్ సెక్రటరీ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేస్తున్నారు. 2008 -09 విద్యా సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రొద్దుటూరులో పశువైద్య కళాశాలను ప్రారంభించారు. అంతకుముందు రాష్ట్రంలో హైదరాబాద్, తిరుపతి, కృష్ణా జిల్లా గన్నవరంలో మాత్రమే పశువైద్య కళాశాలలు ఉండేవి. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక పాడి పరిశ్రమాభివృద్ధితో పాటు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రొద్దుటూరు, కరీంనగర్ జిల్లా కోరుట్లలో కొత్తగా పశు వైద్య కళాశాలలను ప్రారంభించారు.
ప్రొద్దుటూరులో రూ.115 కోట్లతో కళాశాలను నిర్మించాలని ప్రతిపాదనలు తయారు చేయగా అందులో భాగంగా వైఎస్ తొలి విడతగా రూ.25 కోట్లు మంజూరు చేశారు. అలాగే కళాశాల నిర్మాణానికి సంబంధించి రంగయ్యగారి సత్రానికి చెందిన 85 ఎకరాల భూమిని గోపవరం గ్రామం వద్ద కేటాయించారు. అయితే వైఎస్ మరణానంతరం ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో భవన నిర్మాణాలు గత మూడేళ్లుగా నత్తనడక సాగుతున్నాయి. విద్యుత్, నీటిసరఫరా పనులు ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో ప్రస్తుతం కళాశాల ప్రొద్దుటూరు పాల పదార్థముల కర్మాగారంలోని భవనాల్లో నిర్వహిస్తున్నారు. మరో వైపు అధ్యాపక పోస్టుల భర్తీలో కూడా జాప్యం జరిగింది.
గతంలో కళాశాలను తనిఖీ చేసిన వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (భారత పశువైద్య మండలి) ఈ విషయాలపై ఆరా తీసింది. వారి సూచనమేరకు ఇటీవల పోస్టులను భర్తీ చేశారు. ఈ నేపథ్యంలో వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారులు కళాశాలకు గుర్తింపు ఇవ్వలేదు. గత ఆగస్టులో కళాశాల విద్యార్థులు తమకు గుర్తింపు ఇవ్వాలని కోరుతూ కళాశాలలో ఆందోళన చేశారు. ఆ సందర్భంగా సెప్టెంబర్ ఆఖరి లోపు కళాశాలకు వీసీఐ గుర్తింపు లభిస్తుందని అధికారులు విద్యార్థులకు రాతపూర్వకంగా తెలిపారు. అయితే కోర్సు పూర్తయినా కళాశాలకు గుర్తింపు లభించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈనెల 10వ తేదీన పట్టాలు కూడా పొందారు.
కాగా గతంలో మాదిరి కాకుండా ప్రస్తుతం ప్రభుత్వం పోస్టుల భర్తీకి సంబంధించి జోన్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది. మొత్తం రాష్ట్రంలోని 6 జోన్లకు కలిపి 469 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. జోనల్ వ్యవస్థ ఏర్పాటైన నేపథ్యంలో తమ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఓ విద్యార్థి న్యూస్‌లైన్‌తో మాట్లాడుతూ శనివారం ఎలాగోలా తమ దరఖాస్తులను స్వీకరించారని, అయితే వాటికి అర్హత ఉందా లేదా అన్న విషయం మళ్లీ చెబుతామని ఉన్నతాధికారి తెలిపారన్నారు. వీసీఐ నిబంధనల ప్రకారం దరఖాస్తులో గుర్తింపు సంఖ్యను నమోదు చేయాల్సి ఉండగా తమను తాత్కాలిక రిజిస్ట్రేషన్ కింద తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ఈనెల 5వ తేదీ వరకు కూడా యూనివర్సిటీ నుంచి వీసీఐకి తమ కళాశాల వివరాలను పంపలేదని మరో విద్యార్థి తెలిపారు. దీనిని బట్టే యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం బయటపడుతోందన్నారు. ఈ విషయంపై కళాశాల ప్రిన్సిపాల్ జగదీశ్వరరావును న్యూస్‌లైన్ వివరణ కోరగా కళాశాలకు వీసీఐ గుర్తింపు తప్పక వస్తుందన్నారు.
ఈ ఏడాది అడ్మిషన్లకు సంబంధించి అనుమతి ఇప్పటికే వచ్చిందన్నారు. ప్రతి నెల కళాశాలకు సంబంధించిన సమాచారాన్ని యూనివర్సిటీ అధికారులు వీసీఐకి పంపుతున్నారన్నారు. విద్యార్థులకు కలుగుతున్న ఇబ్బంది కూడా బాధాకరంగా ఉందని చెప్పారు. మొత్తానికి ప్రొద్దుటూరు పశువైద్య కళాశాలకు వీసీఐ గుర్తింపు లభించడంపైనే ఇక్కడ చదివిన విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంది.
కోర్టును ఆశ్రయిస్తాం
తమకు ప్రస్తుతం న్యాయం జరగని పక్షంలో హైకోర్టును ఆశ్రయిస్తాం. ప్రభుత్వ కళాశాలలో చదివిన తాము అనర్హులమని చెప్పుకోవడానికే బాధగా ఉంది. ఓ విధంగా చెప్పాలంటే తాము ఇక్కడ చదివి తీవ్రంగా నష్టపోయాం.
- బాల వెంకట్, విద్యార్థి
ఎలాగైనా అవకాశం కల్పించాలి
ప్రస్తుతం జరుగుతున్న వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం ఎలాగైనా తమకు అవకాశం కల్పించాలి. నోటిఫికేషన్ అనేది చీటికిమాటికి వచ్చేది కాదు. చదువు పూర్తయినా గుర్తింపు రాకపోవడం బాధగా ఉంది.
- అశోక్, విద్యార్థి
అగమ్యగోచరం
Published Mon, Oct 21 2013 2:47 AM | Last Updated on Fri, Sep 1 2017 11:49 PM
Advertisement
Advertisement