ఇం‘ధనం’ ఉంటే ఇంజనీర్
ఆ విద్యార్థికి చదువంటే చాలా ఇష్టం. కానీ చదువు‘కొనడమే’ పెద్ద కష్టంగా మారింది. వెక్కిరిస్తున్న పేదరికం.. వెంటాడుతున్న ఆర్థిక సమస్యలు.. వెరసి చదువు భారంగా మారుతోంది. ఇంజినీరింగ్ విద్యను కొనసాగిస్తూనే సెలవుల్లో కూలి పనులకు వెళ్తూ అమ్మానాన్నలకు ఆసరాగా ఉంటున్నాడు. ఫీజులు చెల్లించలేక.. చదువును మధ్యలో ఆపేయలేక.. దిక్కు తోచని స్థితిలో దిక్కులు చూస్తున్నాడు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం రూపొందించిన లీడ్ ఇండియా 2020లో పాల్గొన్న ఈ విద్యార్థి భవిష్యత్తులో ఐఏఎస్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నాడు. దాతలు కరుణిస్తే విద్యాభ్యాసం కొనసాగిస్తానంటున్నాడు.
ప్రొద్దుటూరు: రాజుపాళెం మండలం గాదెగూడూరు గ్రామానికి చెందిన సాత్రి శ్యాంకుమార్‌ది నిరుపేద కుటుంబం. తలదాచుకునేందుకు కాసింత గూడు కూడా లేకపోవడంతో పెద్దశెట్టిపల్లెలో బంధువుల ఇంట్లో ఉంటున్నారు. ప్రొద్దుటూరు సరస్వతీ విద్యామందిరంలో 5వ తరగతి వరకు చదివాడు. అనంతరం 6-10వ తరగతి వరకు గండి గురుకుల పాఠశాలలో చదివాడు. 10వ తరగతిలో 510 మార్కులు సాధించాడు. అక్కడి ఉపాధ్యాయుల సూచన మేరకు హైదరాబాద్‌లోని న్యూ నాగోల్‌లో ఉన్న ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ ఐఐటీఎల్‌టీసీడీలో చదివేందుకు పోటీ పరీక్ష రాయగా జిల్లా నుంచి ప్రభుత్వ విద్యా సంస్థల తరపున ఈ ఒక్క విద్యార్థే ఎంపికయ్యాడు.
న్యూనాగోల్ కళాశాలలో రెండేళ్లపాటు ఇంటర్మీడియట్ పూర్తి చేసి 914 మార్కులు సాధించాడు. అనంతరం గత ఏడాది జేఈఈ మెయిన్ పరీక్ష రాయగా జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫౌండరి అండ్ ఫోర్జ్ టెక్నాలజీ కళాశాలలో సీటు వచ్చింది. జాతీయ స్థాయిలో ఈ కళాశాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. న్యూ నాగోల్ కళాశాల నుంచి గత ఏడాది ఎంపికైన విద్యార్థులకు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రూ.45వేలు చొప్పున ప్రోత్సాహక బహుమతి అందించారు.
దీంతో ఫస్ట్ ఇయర్ పూర్తయింది. కాగా ప్రస్తుతం రెండో సంవత్సరం ఫీజు చెల్లించేందుకు విద్యార్థి ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొంటున్నాడు. కళాశాల నిబంధనల ప్రకారం మొత్తం 8 సెమిస్టర్లలో ఇప్పటి వరకు రెండు సెమిస్టర్లు మాత్రమే పూర్తయ్యాయి. ప్రస్తుతం రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదల కాకపోగా ఫస్ట్ సెమిస్టర్‌లో 7.2 ఎస్‌జీపీఏ సాధించాడు. ఈనెల 17 నుంచి 3వ సెమిస్టర్ ప్రారంభం కావాల్సి ఉంది. ప్రతి సెమిస్టర్‌కు రూ.25,800 ఫీజుతోపాటు ఏడాదికి రూ.25వేలు చొప్పున మెస్ చార్జీలను విద్యార్థి చెల్లించాల్సి ఉంది. పేదరికం కారణంగా ఏమి చేయా లో అర్థం కాని స్థితిలో విద్యార్థి ఉన్నాడు. విద్యార్థి తండ్రి చిట్టిబాబు త న ఆరోగ్యం సహకరించకున్నా రోజూ జమ్మలమడుగుకు వెళ్లి అక్కడి వెల్డింగ్‌షాపులో కూలీగా పనిచేస్తున్నాడు. తల్లి పద్మావతికి చెవుడు. ఈమె ఇంటిలోనే కుట్టుమిషన్ కుట్టుకుంటూ నాలుగు రూకలు సంపాదిస్తోంది. సోదరి అనిత స్కాలర్‌షిప్ కింద ఎస్‌వీడీ డిగ్రీ కళాశాలలో ఫస్ట్ ఇయర్ చేరింది. సోదరుడు సాల్మన్ గండి గురుకుల పాఠశాలలో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఈ ఏడాది మే నెలలో సెలవుల కారణంగా ఇంటికి వచ్చిన శ్యాంకుమార్ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా కూలి పనికి వెళుతున్నాడు. నెలన్నరపాటు ముందుగా స్థానిక రామయ్య మిల్లులో పొద్దుతిరుగుడు విత్తన బస్తాలను మోసేందుకు రూ.270తో దినసరి కూలికి వెళ్లగా తర్వాత గోకుల్ నగర్‌లోని సీఎస్‌ఐ చర్చి నిర్మాణ పనులకు సంబంధించి రూ.300 దినసరి కూలితో పనికివెళ్లాడు. ప్రస్తుతం ఈ పనులు పూర్తికావడంతో గ్రామంలో వ్యవసాయ కూలి పనులకు వెళుతున్నాడు.
ఎవరైనా ఆదుకుంటారనే ఆశతో..
ఈనెల 17వ తేదీ నుంచి రెండో విద్యా సంవత్సరం ప్రారంభంకానుంది. దీంతో ఫీజు చెల్లించేందుకు డబ్బు లేక విద్యార్థి శ్యాంకుమార్ ఆవేదన చెందుతున్నాడు. తొలి ఏడాది సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన డబ్బుతో చదువుకున్న విద్యార్థి ప్రస్తుతం ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. దాతలు స్పందించి తనకు ఆర్థిక సహాయం అందించాలని వేడుకుంటున్నాడు. పూర్తి వివరాల కోసం శ్యాంకుమార్ 8897072482 నెంబర్‌కు ఫోన్ గానీ, లేదా కళాశాల పరిధిలో ఉన్న కెనరా బ్యాంక్‌లో ఉన్న అకౌంట్ నెంబర్ 2730101008764కు ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నాడు.