కటకటాల్లో కానిస్టేబుల్
నిశ్చితార్థం ఒకరితో.. పెళ్లి మరొకరితో
సస్పెన్షన్‌కు రంగం సిద్ధం
ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: బాధ్యతగల కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ముందుగా ఓ యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. కట్నంపై ఆశతో మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు జిల్లా ఎస్పీని ఆశ్రయించగా రాజుపాళెం పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆ కానిస్టేబుల్ ప్రొద్దుటూరు సబ్‌జైలులో కటకటాలు లెక్కిస్తున్నాడు. రాజుపాళెం మండలం అర్కటవేముల గ్రామానికి చెందిన మడూరి రమణయ్య, ఆదిలక్ష్మిల పెద్ద కుమార్తె శివలక్ష్మిని కాశినాయన మండలం నరసాపురం గ్రామానికి చెందిన దూరపు బంధువు సీతగారి శంకరయ్య కుమారుడు మల్లికార్జునకు ఇచ్చి వివాహం జరిపించేలా నిర్ణయించారు.
2010 జూన్ 30న అర్కటవేములలోని శివలక్ష్మి ఇంటిలో ఘనంగా నిశ్చితార్థం జరిపించారు. కట్నం కింద రూ.2లక్షల నగదుతోపాటు 15 గ్రాముల బంగారు చైన్, 7 గ్రాముల బంగారు ఉంగరం ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. నిశ్చితార్థం అనంతరం శివలక్ష్మి తల్లిదండ్రులు వివాహం కోసం మల్లికార్జునను సంప్రదిస్తూ వచ్చారు. డిగ్రీ చదువుతున్నానని, ఉద్యోగం వస్తానే పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. దీంతో పెళ్లికి జాప్యం జరుగుతూ వచ్చింది. గత ఏడాది కానిస్టేబుల్ సెలక్షన్లలో మల్లికార్జున సివిల్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు.
విషయం తెలుసుకున్న శివలక్ష్మి తల్లిదండ్రులు ఉద్యోగం వచ్చింది కదా పెళ్లి చేసుకొమ్మని అడగగా శిక్షణ తర్వాత చేసుకుంటానని చెప్పాడు. శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం ప్రస్తుతం గోపవరం పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా మల్లికార్జున పనిచేస్తున్నాడు. కట్నంపై ఆశతో శివలక్ష్మిని కాదని మరో చోట పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు.
విషయం తెలుసుకున్న శివలక్ష్మి తల్లిదండ్రులు గత అక్టోబర్ 30న జిల్లా ఎస్పీని కలిసి సమస్యను వివరించారు. ఫిర్యాదును కడపలోని మహిళా పోలీస్‌స్టేషన్‌కు ఎస్పీ బదిలీ చేయగా పోలీసులు ఇరువురిని విచారించారు. వివాహం చేసుకోవడానికి మరో రెండేళ్లు సమయం కావాలని మల్లికార్జున కోరగా పోలీసులు అంగీకరించలేదు. దీంతో 3 నెలలకు శివలక్ష్మిని వివాహం చేసుకుంటానని మల్లికార్జున లిఖిత పూర్వకంగా తెలియజేశాడు. అయితే మాటతప్పిన మల్లికార్జున బీ మఠం మండలం మల్లేపల్లె గ్రామానికి చెందిన కోనేటి రామకృష్ణ, ఉమ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. శివలక్ష్మి తల్లిదండ్రుల అభ్యంతరాన్ని ఏ మాత్రం లెక్కచేయలేదు. వివాహం సందర్భంగా మల్లికార్జునకు రూ.7లక్షల వరకు కట్నం ఇచ్చినట్లు సమాచారం. శివలక్ష్మి తల్లిదండ్రులు ఈనెల 17న జిల్లా ఎస్పీని మళ్లీ ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఎస్పీ ఆదేశాల మేరకు మల్లికార్జునపై ఐపీసీ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మూడు రోజులుగా నిందితుడు ప్రొద్దుటూరు సబ్ జైలులో ఉన్నాడు. ఈ విషయాన్ని సబ్‌జైలర్ ‘న్యూస్‌లైన్’కు ధ్రువీకరించారు. నిబంధనల ప్రకారం 24 గంటలకు మించి రిమాండ్‌లో ఉంటే సస్పెండ్ చేస్తారు. ఈ ప్రకారం మల్లికార్జునపై కూడా చర్య తీసుకోనున్నారు.