Shyam Kumar
-
శ్యామ్ కుమార్‌కు స్వర్ణం
జకార్తా: తెలుగుతేజం కాకర శ్యామ్ కుమార్ మళ్లీ తన పంచ్ పవర్‌తో అదరగొట్టాడు. ఆసియా క్రీడల టెస్టు ఈవెంట్లో ఈ ఆంధ్రప్రదేశ్ బాక్సర్ బంగారు పతకం సాధించాడు. ఈ పోటీల్లో మరో నలుగురు భారత బాక్సర్లు కూడా పసిడి పతకాలు నెగ్గారు. మూడు సార్లు కింగ్స్ కప్‌లో విజేతగా నిలిచిన శ్యామ్ కుమార్ 49 కేజీల ఫైనల్లో 4–1తో మరియో బ్లాసియస్ కలి (ఇండోనేసియా)పై గెలుపొందాడు. ఇతనితో పాటు మనీశ్ కౌషిక్, షేక్ సల్మాన్ అన్వర్, ఆశిష్, మహిళల ఈవెంట్లో పవిత్ర బంగారు పతకాలు సాధించారు. 52 కేజీల ఫైనల్లో సల్మాన్ అన్వర్ 5–0తో ఫిలిప్పీన్స్‌కు చెందిన రోజెన్ లాడన్‌ను ఓడించగా, 64 కేజీల విభాగంలో ఆశిష్ 5–0తో సుగెర్ రే ఒకానా (ఇండోనేసియా)పై గెలుపొందాడు. 60 కేజీల ఈవెంట్లో మనీశ్ కౌషిక్ 5–0తో రెంటారో కిముర (జపాన్)పై నెగ్గాడు. మహిళల 60 కేజీల తుదిపోరులో పవిత్ర 5–0తో నిలవన్ టెచసుప్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించింది. మరో మహిళా బాక్సర్ శశి చోప్రా (57 కేజీలు) కాంస్యంతో సరిపెట్టుకుంది. -
ఫైనల్లో శ్యామ్‌కుమార్
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ (49 కేజీలు) ఫైనల్లో ప్రవేశించాడు. వైజాగ్‌కు చెందిన శ్యామ్ బుధవారం సెమీ ఫైనల్లో థానీ నారిన్రామ్ (థాయ్‌లాండ్) పై గెలుపొందాడు. ప్రత్యర్థి నుంచి వాకోవర్ లభించడంతో శ్యామ్ కుమార్ సునాయాసంగా ఫైనల్‌కు చేరాడు. మరో సెమీస్‌లో అమిత్ (భారత్) 4–1తో నట్లాయి లాల్బియాకిమా (భారత్)పై గెలుపొంది తుదిపోరుకు చేరాడు. శ్యామ్‌కుమార్ ఫైనల్లో అమిత్ (భారత్)తో తలపడనున్నాడు. సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు), అమిత్ (49 కేజీలు), మనీశ్ (60 కేజీలు), సంజీత్ (91 కేజీలు) కూడా ఫైనల్‌కు చేరుకున్నారు. మహిళల విభాగంలో మేరీకోమ్ (48 కేజీలు), మీనాకుమారి (54 కేజీలు), సోనియా (57 కేజీలు), సరితా దేవి (60 కేజీలు), పూజా (69 కేజీలు), సవితి బోరా (75 కేజీలు) సెమీఫైనల్లో అడుగుపెట్టారు. -
క్వార్టర్ ఫైనల్లో శ్యామ్ కుమార్
ఇండియా ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. న్యూఢిల్లీలో సోమవారం జరిగిన పురుషుల 49 కేజీల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో వైజాగ్ బాక్సర్ శ్యామ్ 5–0తో భారత్‌కే చెందిన నీరజ్ స్వామిని ఓడించాడు. మరో బౌట్లో ప్రపంచ యూత్ చాంపియన్ సచిన్ సివాచ్ థాయ్‌లాండ్ బాక్సర్ థాని నరీన్రామ్ చేతిలో ఓడిపోయాడు. మహిళల 51 కేజీల విభాగంలో భారత బాక్సర్లు సర్జూబాలా దేవి, పింకీ జాంగ్రా సెమీఫైనల్‌కు చేరి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. -
శ్యామ్ కుమార్‌కు స్వర్ణ పతకం
జాతీయ సీనియర్ ఎలైట్ పురుషుల సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాకర శ్యామ్ కుమార్ పసిడి పతకాన్ని గెల్చుకున్నాడు. విశాఖపట్నంలో సోమవారం ముగిసిన ఈ పోటీల్లో రైల్వేస్ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డుకు ప్రాతినిధ్యం వహించిన శ్యామ్ కుమార్ 49 కేజీల విభాగంలో విజేతగా నిలిచాడు. ఫైనల్లో శ్యామ్ 3–2తో ఎన్టీ లాల్బియాకిమా (మిజోరం)పై విజయం సాధించాడు. -
క్వార్టర్స్‌లో క్రాంతి, శ్యామ్
సాక్షి, విశాఖపట్నం: జాతీయ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కె.క్రాంతి... రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్ఎస్పీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ బాక్సర్ శ్యామ్ కుమార్ క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖాయం చేసుకున్నారు. 49 కేజీల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్లలో క్రాంతి 5–0తో వీర్ సింగ్ (హిమాచల్‌ప్రదేశ్)పై గెలుపొందగా... శ్యామ్ 4–1తో హిమాంశు శర్మ (పంజాబ్)ను ఓడించాడు. 60 కేజీల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో వి.దుర్గా రావు (ఆంధ్రప్రదేశ్) 3–2తో సచిన్ (చండీగఢ్)పై నెగ్గగా... వన్‌లాల్‌రియత్‌కిమా (మిజోరం) చేతిలో లలిత్ కిశోర్ (తెలంగాణ) ఓడిపోయాడు. -
శ్యామ్ కుమార్ శుభారంభం
సాక్షి, విశాఖపట్నం: జాతీయ సీనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో రైల్వేస్ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్ఎస్పీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన 49 కేజీల తొలి రౌండ్లో శ్యామ్ 5–0తో హెచ్‌పీ కుమార్ (మణిపూర్)ను ఓడించాడు. ఇదే విభాగంలో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కె.క్రాంతి 3–2తో శివాజీ మోరే (మహారాష్ట్ర)పై గెలిచాడు. 52 కేజీల విభాగం తొలి రౌండ్లో అప్పలరాజు (ఆంధ్రప్రదేశ్) 0–5తో విజయ్ అరోరా (జార్ఖండ్) చేతిలో ఓడిపోయాడు. మరోవైపు తెలంగాణ బాక్సర్లు బి.దీపక్ (49 కేజీలు) 3–2తో రిషి కుమార్ (రాజస్తాన్)పై, ఎన్.లలిత్ కిశోర్ (60 కేజీలు) 3–2తో రమణ్ (జార్ఖండ్)పై గెలిచి ముందంజ వేశారు. తెలంగాణకే చెందిన డి.ధర్మరాజు (హెవీవెయిట్), మొహమ్మద్ మోసిన్ (సూపర్ హెవీవెయిట్) కూడా తమ ప్రత్యర్థులపై గెలిచారు. -
పసిడి పోరుకు శ్యామ్
సెమీస్‌లో సంచలన విజయం న్యూఢిల్లీ: థాయ్‌లాండ్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ అదరగొట్టాడు. బ్యాంకాక్‌లో గురువారం జరిగిన సెమీస్ మ్యాచ్‌లో 49 కేజీల విభాగంలో తలపడిన శ్యామ్... గ్యాంకుయాగ్ గ్యాన్ ఎర్డ్నె (మంగోలియా)పై సంచలన విజయం సాధించి తుదిపోరుకు అర్హత సాధించాడు. 2015లో ఈ ఈవెంట్లో స్వర్ణాన్ని సాధించిన శ్యామ్ మరోసారి పసిడి పోరుకు సిద్ధమయ్యాడు. ఫైనల్లో ఒలింపిక్ చాంపియన్ హసన్‌బోయ్ డస్మటోవ్ (ఉజ్బెకిస్థాన్) తో అమీతుమీ తేల్చుకుంటాడు. మరో సెమీస్ మ్యాచ్‌లో రోహిత్ టోకస్ (64 కేజీ)... అబ్దుర్ రైమోవ్ ఎల్నూర్ (ఉజ్బెకిస్థాన్) చేతిలో పరాజయం పాలై కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. 2015లో కూడా రోహిత్ కాంస్యం సాధించాడు. -
గోడ దూకాడు.. పదవి పట్టాడు!
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. గెలిచారు కూడా.. కానీ ఇంకా అసెంబ్లీలోకి కూడా ప్రవేశించక ముందే బీజేపీలోకి జంప్ కొట్టారు. దానికి ప్రతిఫలంగా మంత్రి పదవి కూడా సంపాదించేశారు. ఆయనెవరో కాదు.. ఆండ్రియో ఎమ్మెల్యే శ్యామ్ కుమార్. ఇప్పుడు ఆయనకు మంత్రివర్గంలో చోటు లభించడంతో కాంగ్రెస్ పార్టీ ఆయనకు షోకాజ్ నోటీసు జారీచేసింది. కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, ప్రకాష్ జవదేకర్ సహా బీజేపీ జాతీయ నాయకుడు రాం మాధవ్ సమక్షంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శ్యామ్‌కుమార్‌తో గవర్నర్ నజ్మా హెప్తుల్లా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్ కూడా హాజరయ్యారు. అక్కడ ఆయన శ్యామ్ కుమార్‌ను చూసి వెంటనే మేల్కొన్నారు. దాంతో కొత్త మంత్రికి పాత పార్టీ నుంచి నోటీసులు వెళ్లాయి. బీజేపీకి మద్దతిచ్చిన నేషనల్ పీపుల్స్ పార్టీ నుంచి నలుగురు, ఎల్జేపీ నుంచి ఇద్దరు, ఎన్పీఎఫ్ నుంచి ఒకరికి మంత్రి పదవులు దక్కాయి. వాళ్లతో పాటు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఏకైక ఎమ్మెల్యే శ్యామ్ కుమార్‌కు కూడా పదవి ఇచ్చారు. ఆయన పేరును ప్రకటించగానే ఒక్కసారిగా రాజ్‌భవన్ హాల్లో ఉన్న బీజేపీ నాయకులు హర్షధ్వానాలు చేశారు. అయితే.. షోకాజ్ నోటీసులు వచ్చినా, తాను రాబోయే పరిణామాలు ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నట్లు శ్యామ్ చెప్పారు. మణిపూర్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం కోల్పోయారని, అందుకే వాళ్లు అధికారంలో మార్పు కోరుకున్నారని తెలిపారు. ఇక ఒకప్పుడు ఇబోబి సింగ్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగిన మణిపూర్ మాజీ డీజీపీ.. ఎన్పీపీ ఎమ్మెల్యే జోయ్కుమార్కు మంత్రిపదవి ఇవ్వడమే కాక, ఆయనను ఏకంగా ఉపముఖ్యమంత్రిగా కూడా చేశారు. దీనిపై కూడా వివాదం చెలరేగింది. జోయ్‌కుమార్ డీజీపీగా ఉన్న సమయంలో రాష్ట్రంలో బూటకపు ఎన్కౌంటర్లు బాగా పెరిగాయని చెప్పేవారు. ఇలాంటి వ్యక్తికి అంతటి పదవేంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
థాయ్‌లాండ్ బాక్సింగ్ టోర్నీకి శ్యామ్, హుస్సాముద్దీన్
న్యూఢిల్లీ: వచ్చే నెలలో థాయ్‌లాండ్‌లో జరిగే అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాకర శ్యామ్ కుమార్, తెలంగాణకు చెందిన మొహమ్మద్ హుస్సాముద్దీన్‌లకు చోటు లభించింది. ఏప్రిల్ 1 నుంచి 7 వరకు బ్యాంకాక్‌లో జరిగే ఈ టోర్నీలో ఏడు వెయిట్ కేటగిరీలలో బౌట్లు ఉంటాయి. ఒలింపియన్ బాక్సర్లు దేవేంద్రో సింగ్, శివ థాపా, మనోజ్ కుమార్, వికాస్ కృషన్‌లు కూడా ఈ టోర్నీలో బరిలోకి దిగనున్నారు. గతంలో ‘కింగ్స్ కప్’గా వ్యవహరించిన ఈ టోర్నీలో 2015లో శ్యామ్ కుమార్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఇటీవలే బల్గేరియాలో ముగిసిన స్ట్రాండ్జా కప్‌లో హుస్సాముద్దీన్ రజత పతకాన్ని గెలిచాడు. వీసాలు రాకపోవడంతో... మరోవైపు ఈనెల 13 నుంచి 18 వరకు జర్మనీలో జరిగే కెమిస్ట్రీ కప్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీకి భారత బాక్సర్లు వెళ్లడం లేదు. నిర్ణీత సమయానికి వీసాలు రాకపోవడంతో ఈ టోర్నీకి భారత బాక్సర్లు దూరమయ్యారు. భారత బాక్సింగ్ జట్టు: కాకర శ్యామ్ కుమార్ (49 కేజీలు), దేవేంద్రో సింగ్ (52 కేజీలు), మొహమ్మద్ హుస్సాముద్దీన్ (56 కేజీలు), శివ థాపా (60 కేజీలు), రోహిత్ టొకాస్ (64 కేజీలు), మనోజ్ కుమార్ (69 కేజీలు), వికాస్ కృషన్ (75 కేజీలు). -
ఆ నవల ప్రభావం ఇప్పటికీ తగ్గలేదు!
- రచయిత ‘అంపశయ్య’ నవీన్ తెలుగు సాహితీ చరిత్రలో ‘అంపశయ్య’ ఓ సంచలనం. 1969లో వచ్చిన ఈ నవలతో రచయిత నవీన్ ఇంటిపేరు ‘అంపశయ్య’గా మారిపోయింది. ఈ నవలకు తెర రూపమే ‘క్యాంపస్ అంపశయ్య’. ప్రభాకర్ జైని నటించి, దర్శకత్వం వహించారు. జైనీ క్రియేషన్స్, ఓం నమో భగవతే వాసుదేవాయ ఫిలిమ్స్ పతాకంపై విజయలక్ష్మి జైని ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్యామ్‌కుమార్, పావని కీలక పాత్రల్లో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నిర్మించి, హిందీలోకి అనువ దించారు. సోమవారం ఈ చిత్రం హిందీ పాటలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘అంపశయ్య’ నవీన్ మాట్లాడుతూ - ‘‘ఈ సినిమా చాలా మంది జీవితాలకు గమ్యంగా మారింది. ఈ నవల వచ్చి 47 ఏళ్లయినా దీని ప్రభావం ఇంకా తగ్గలేదు. మొత్తం నాలుగు భాషల్లో విడుదల చేయడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. దర్శకుడు ప్రభాకర్ జైని మాట్లాడుతూ- ‘‘క్యాంపస్‌లో చదివే ప్రతి విద్యార్థి అంపశయ్య స్టేజ్ నుంచి దాటి వచ్చినవాడే. ఈ చిత్రాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అని అన్నారు. -
44కిలోల గంజాయి స్వాధీనం
విశాఖ జిల్లా రోలుగుంట మండలం గుత్తింపేట సమీపంలో మంగళవారం వేకువజామున 44 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. జిగిరెడ్డి నాయుడు, శ్యామ్‌కుమార్ అనే ఇద్దరు గంజాయిని ఆటోలో తరలిస్తుండగా... పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్ట్ చేశారు. -
కన్నీటి కథ... ‘అంపశయ్య’
ప్రముఖ రచయిత ‘అంపశయ్య’ నవీన్ రాసిన ‘అంపశయ్య’ నవల ఇప్పుడు వెండి తెరపై ఆవిష్కృతం కావడానికి సిద్ధమైంది. శ్యామ్ కుమార్, పావని జంటగా ‘అమ్మా నీకు వందనం’ ఫేవ్‌ు ప్రభాకర్ జైని దర్శకత్వంలో విజయలక్ష్మి జైని నిర్మించారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘1965-1970 కాలంలోని పేదరికం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. కొడుకు చదువు కోసం రూ. 200 కూడా చెల్లించలేని పేదరికం తండ్రిది. ఫీజు కోసం భార్య కడియాలు అమ్మినా డబ్బు సరిపోక, ఆ తండ్రి నిస్సహాయ స్థితిలో కన్నీరు కారుస్తాడు. ఆ సీన్లో వచ్చే పాట, అందులోని సాహిత్యం గుండెలు పిండేస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలో, మలయాళంలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: రవికుమార్ నీర్ల. సంగీతం: సందీప్. -
శ్యామ్ కుమార్‌కు కాంస్య పతకం
రియో డి జనీరో (బ్రెజిల్): ఒలింపిక్ టెస్ట్ ఈవెంట్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ కాంస్య పతకాన్ని సాధించాడు. పురుషుల 51 కేజీల విభాగం సెమీఫైనల్లో హసన్‌బాయ్ దుస్మతోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో శ్యామ్ ఓడిపోయి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. భారత్‌కే చెందిన మనోజ్ కుమార్ (64 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు), ప్రవీణ్ కుమార్ (91 కేజీలు) కూడా సెమీఫైనల్లో ఓటమిపాలై కాంస్య పతకాలతో సంతృప్తి పడ్డారు. మహిళల విభాగంలో మేరీకామ్ (51 కేజీలు) కూడా కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత్‌కు ఐదు కాంస్య పతకాలు లభించాయి. -
హైదరాబైక్
సిటీ మీద ఇష్టం ఉన్న కవులైతే దాని మీద పాటలు రాస్తారు. గాయకులైతే పాటలు పాడతారు. ఫొటోగ్రాఫర్లయితే సిటీ గొప్పతనాన్ని తెలిపే ఫొటోలు తీస్తారు... మరి బైక్ ప్రియులైతే ఏం చేస్తారు? సిటీ చుట్టూ బైక్ వేసుకుని రౌండ్లు కొడతారు అని సమాధానం చెబితే మీరు టైర్ కింద కాలేసినట్టే. బైక్‌నే హైదరాబాద్‌గా మార్చేస్తారు. అదెలా అంటే ఇలా అని చేసి చూపించారు శ్యామ్‌కుమార్. - ఎస్.సత్యబాబు నగరంలో గత కొంతకాలంగా నివసిస్తున్న శ్యామ్‌కుమార్... బైక్ ప్రియుడు. ఇటీవలే హార్లీ డేవిడ్సన్ బైక్ కొన్నారు. వల్లమాలిన బైక్ ప్రియత్వంతో పాటు నగర ప్రియత్వం కూడా ఉన్న శ్యామ్‌కుమార్... తన మోటార్ సైకిల్.. సిటీ మీద తనకున్న ఇష్టానికి సింబల్‌లా ఉండాలని ఆశించారు. దీని కోసం సీట్ నుంచి టైర్ల వరకు సిటీతో నింపేయాలనుకున్నారు. అయితే బైక్ అందం చెడకుండా, హైదరాబాద్‌ను దానిపై చిత్రించాలని కోరుకున్నారు. ఈ పనిలో ఆయనకు మాదాపూర్‌లోని ఈస్ట్ ఇండియా మోటార్ సైకిల్ రెవల్యూషన్ కంపెనీ సహకరించింది. కొన్ని రోజుల ఆలోచనలు, ప్లానింగ్ తర్వాత హార్లీ డేవిడ్సన్ కాస్తా హైదరాబాద్ రిఫ్లెక్షన్ అయింది. షహర్ హమారా.. బైక్ హమారా.. ఇప్పుడు నగర వీధుల్లో పరుగులు తీస్తున్న శ్యామ్‌కుమార్ బైక్‌ను చూస్తే హైదరాబాద్‌ను షార్ట్‌కట్‌లో చూసినట్టే. చరిత్ర చెప్పే చార్మినార్ నుంచి చవులూరించే బిర్యానీ దాకా, సాగర్ మధ్యలో ఉన్న బుద్ధ విగ్రహం నుంచి గోల్కొండ కోట వరకు, మొన్నటి దర్పానికి చిహ్నమైన కుతుబ్‌షాహీ టూంబ్స్ నుంచి నేటి మోడ్రన్ సిటీని చూపించే సైబర్ టవర్స్ దాకా... తన బైక్‌పై కొలువుదీర్చారు. మక్కా మసీదు, ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్లతో పాటు రిక్షాలూ, ముత్యాలూ ఇలా హైదరాబాద్‌ను అన్ని విధాలుగా బైక్‌పై ప్రతిష్టించిన శ్యామ్‌కుమార్... హార్లీ డేవిడ్సన్పై తనకు ఉన్న ఇష్టాన్ని కూడా చూపించారు. ఈ కంపెనీ బైక్‌లు ఇండియాలోకి రావడానికి 2007లో అనుమతి లభించింది. మ్యాంగోస్ తమకు ఇవ్వడానికి ఇండియా ఒప్పుకున్నందుకు కృతజ్ఞతగా అమెరికా భారత్‌కు హార్లీని ఇచ్చింది. ఈ కారణంగా దీనికి మ్యాంగో డిప్లొమసీ అనే పేరొచ్చింది. దీన్ని కూడా బైక్‌పై చిత్రింపజేశారు శ్యామ్. -
జాతీయ క్రీడల్లో తెలంగాణకు రెండు రజతాలు
తిరువనంతపురం: నిలకడగా రాణిస్తున్న తెలంగాణ క్రీడాకారులు జాతీయ క్రీడల్లో తమ పతకాల వేటను కొనసాగిస్తున్నారు. బుధవారం జరిగిన పోటీల్లో తెలంగాణకు రెండు రజత పతకాలు వచ్చాయి. 500 మీటర్ల కనోయ్ సింగిల్స్‌లో నవోబీ సింగ్... 500 మీటర్ల కయాక్ డబుల్స్ విభాగంలో పదమ్‌కర్ ప్రసాద్, ప్రేమానంద సింగ్ ద్వయం రజత పతకాలు గెల్చుకున్నారు. కనోయ్ ఫైనల్స్‌లో నవోబీ సింగ్ రెండు నిమిషాల 9.15 సెకన్లలో గమ్యానికి చేరుకొని రెండో స్థానంలో నిలిచాడు. కయాక్ డబుల్స్‌లో ప్రసాద్-ప్రేమానంద సింగ్ జంట ఒక నిమిషం 44 సెకన్లలో లక్ష్యాన్ని అధిగమించి రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. మహిళల బ్యాడ్మింటన్ వ్యక్తిగత విభాగంలో తెలంగాణ క్రీడాకారిణులు రుత్విక శివాని, రితూపర్ణ దాస్ రెండో రౌండ్లోకి చేరుకున్నారు. తొలి రౌండ్లో రుత్విక 21-11, 21-9తో ముద్రా ధైంజీ (మహారాష్ట్ర)పై, రితూపర్ణ దాస్ 17-21, 21-17, 21-18తో నేహా పండిత్ (మహారాష్ట్ర)పై గెలిచారు. శ్యామ్ సంచలనం పురుషుల బాక్సింగ్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ సంచలనం సృష్టించాడు. 49 కేజీల విభాగం రెండో రౌండ్లో శ్యామ్ కుమార్ 18-6 పాయింట్ల తేడాతో ప్రపంచ యూత్ మాజీ చాంపియన్ థోక్చోమ్ నానౌ సింగ్ (సర్వీసెస్)ను బోల్తా కొట్టించి సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. ప్రస్తుతం తెలంగాణ 20 పతకాలతో (6 స్వర్ణాలు, 9 రజతాలు, 5 కాంస్యాలు) 11వ స్థానంలో; ఆంధ్రప్రదేశ్ 14 పతకాలతో (5 స్వర్ణాలు, 3 రజతాలు, 6 కాంస్యాలు) 15వ స్థానంలో ఉన్నాయి. డిఫెండింగ్ చాంపియన్ సర్వీసెస్ 109 పతకాలతో (68 స్వర్ణాలు, 19 రజతాలు, 22 కాంస్యాలు) అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
ఇం‘ధనం’ ఉంటే ఇంజనీర్
ఆ విద్యార్థికి చదువంటే చాలా ఇష్టం. కానీ చదువు‘కొనడమే’ పెద్ద కష్టంగా మారింది. వెక్కిరిస్తున్న పేదరికం.. వెంటాడుతున్న ఆర్థిక సమస్యలు.. వెరసి చదువు భారంగా మారుతోంది. ఇంజినీరింగ్ విద్యను కొనసాగిస్తూనే సెలవుల్లో కూలి పనులకు వెళ్తూ అమ్మానాన్నలకు ఆసరాగా ఉంటున్నాడు. ఫీజులు చెల్లించలేక.. చదువును మధ్యలో ఆపేయలేక.. దిక్కు తోచని స్థితిలో దిక్కులు చూస్తున్నాడు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం రూపొందించిన లీడ్ ఇండియా 2020లో పాల్గొన్న ఈ విద్యార్థి భవిష్యత్తులో ఐఏఎస్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నాడు. దాతలు కరుణిస్తే విద్యాభ్యాసం కొనసాగిస్తానంటున్నాడు. ప్రొద్దుటూరు: రాజుపాళెం మండలం గాదెగూడూరు గ్రామానికి చెందిన సాత్రి శ్యాంకుమార్ది నిరుపేద కుటుంబం. తలదాచుకునేందుకు కాసింత గూడు కూడా లేకపోవడంతో పెద్దశెట్టిపల్లెలో బంధువుల ఇంట్లో ఉంటున్నారు. ప్రొద్దుటూరు సరస్వతీ విద్యామందిరంలో 5వ తరగతి వరకు చదివాడు. అనంతరం 6-10వ తరగతి వరకు గండి గురుకుల పాఠశాలలో చదివాడు. 10వ తరగతిలో 510 మార్కులు సాధించాడు. అక్కడి ఉపాధ్యాయుల సూచన మేరకు హైదరాబాద్‌లోని న్యూ నాగోల్‌లో ఉన్న ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ ఐఐటీఎల్టీసీడీలో చదివేందుకు పోటీ పరీక్ష రాయగా జిల్లా నుంచి ప్రభుత్వ విద్యా సంస్థల తరపున ఈ ఒక్క విద్యార్థే ఎంపికయ్యాడు. న్యూనాగోల్ కళాశాలలో రెండేళ్లపాటు ఇంటర్మీడియట్ పూర్తి చేసి 914 మార్కులు సాధించాడు. అనంతరం గత ఏడాది జేఈఈ మెయిన్ పరీక్ష రాయగా జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫౌండరి అండ్ ఫోర్జ్ టెక్నాలజీ కళాశాలలో సీటు వచ్చింది. జాతీయ స్థాయిలో ఈ కళాశాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. న్యూ నాగోల్ కళాశాల నుంచి గత ఏడాది ఎంపికైన విద్యార్థులకు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రూ.45వేలు చొప్పున ప్రోత్సాహక బహుమతి అందించారు. దీంతో ఫస్ట్ ఇయర్ పూర్తయింది. కాగా ప్రస్తుతం రెండో సంవత్సరం ఫీజు చెల్లించేందుకు విద్యార్థి ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొంటున్నాడు. కళాశాల నిబంధనల ప్రకారం మొత్తం 8 సెమిస్టర్లలో ఇప్పటి వరకు రెండు సెమిస్టర్లు మాత్రమే పూర్తయ్యాయి. ప్రస్తుతం రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదల కాకపోగా ఫస్ట్ సెమిస్టర్లో 7.2 ఎస్‌జీపీఏ సాధించాడు. ఈనెల 17 నుంచి 3వ సెమిస్టర్ ప్రారంభం కావాల్సి ఉంది. ప్రతి సెమిస్టర్‌కు రూ.25,800 ఫీజుతోపాటు ఏడాదికి రూ.25వేలు చొప్పున మెస్ చార్జీలను విద్యార్థి చెల్లించాల్సి ఉంది. పేదరికం కారణంగా ఏమి చేయా లో అర్థం కాని స్థితిలో విద్యార్థి ఉన్నాడు. విద్యార్థి తండ్రి చిట్టిబాబు త న ఆరోగ్యం సహకరించకున్నా రోజూ జమ్మలమడుగుకు వెళ్లి అక్కడి వెల్డింగ్‌షాపులో కూలీగా పనిచేస్తున్నాడు. తల్లి పద్మావతికి చెవుడు. ఈమె ఇంటిలోనే కుట్టుమిషన్ కుట్టుకుంటూ నాలుగు రూకలు సంపాదిస్తోంది. సోదరి అనిత స్కాలర్షిప్ కింద ఎస్వీడీ డిగ్రీ కళాశాలలో ఫస్ట్ ఇయర్ చేరింది. సోదరుడు సాల్మన్ గండి గురుకుల పాఠశాలలో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఈ ఏడాది మే నెలలో సెలవుల కారణంగా ఇంటికి వచ్చిన శ్యాంకుమార్ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా కూలి పనికి వెళుతున్నాడు. నెలన్నరపాటు ముందుగా స్థానిక రామయ్య మిల్లులో పొద్దుతిరుగుడు విత్తన బస్తాలను మోసేందుకు రూ.270తో దినసరి కూలికి వెళ్లగా తర్వాత గోకుల్ నగర్‌లోని సీఎస్ఐ చర్చి నిర్మాణ పనులకు సంబంధించి రూ.300 దినసరి కూలితో పనికివెళ్లాడు. ప్రస్తుతం ఈ పనులు పూర్తికావడంతో గ్రామంలో వ్యవసాయ కూలి పనులకు వెళుతున్నాడు. ఎవరైనా ఆదుకుంటారనే ఆశతో.. ఈనెల 17వ తేదీ నుంచి రెండో విద్యా సంవత్సరం ప్రారంభంకానుంది. దీంతో ఫీజు చెల్లించేందుకు డబ్బు లేక విద్యార్థి శ్యాంకుమార్ ఆవేదన చెందుతున్నాడు. తొలి ఏడాది సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన డబ్బుతో చదువుకున్న విద్యార్థి ప్రస్తుతం ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. దాతలు స్పందించి తనకు ఆర్థిక సహాయం అందించాలని వేడుకుంటున్నాడు. పూర్తి వివరాల కోసం శ్యాంకుమార్ 8897072482 నెంబర్‌కు ఫోన్ గానీ, లేదా కళాశాల పరిధిలో ఉన్న కెనరా బ్యాంక్‌లో ఉన్న అకౌంట్ నెంబర్ 2730101008764కు ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నాడు. -
పోరాడి ఓడిన శ్యామ్
ప్రపంచ యూత్ బాక్సింగ్‌లో కాంస్యంతో సరి సోఫియా (బల్గేరియా): ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ బరిలో నిలిచిన ఏకైక భారత బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన 49 కేజీల విభాగం సెమీఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్యామ్ కుమార్ 1-2తో శాల్కర్ అఖిన్‌బే (కజకిస్థాన్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. హోరాహోరీగా సాగిన ఈ బౌట్లో తొలి రౌండ్‌ను చేజార్చుకున్న శ్యామ్ రెండో రౌండ్లో పైచేయి సాధించాడు. నిర్ణాయక మూడో రౌండ్లో మాత్రం అఖిన్‌బే ఆధిపత్యం చలాయించాడు. ఈ ఓటమితో శ్యామ్ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. ‘శ్యామ్ బాగా పోరాడాడు. అయితే ఓటమి ఓటమే. అతను యూత్ ఒలింపిక్స్‌కు అర్హత పొందడం సానుకూలాంశం’ అని భారత కోచ్ రామానంద్ తెలిపారు. భారత బాక్సింగ్ సమాఖ్యపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ-ఐబా) నిషేధం కారణంగా ఈ మెగా ఈవెంట్లో భారత బాక్సర్లు ‘ఐబా’ పతాకం కింద పోటీపడ్డారు. మొత్తానికి ఈ చాంపియన్‌షిప్ భారత్‌కు నిరాశనే మిగిల్చింది. కేవలం ఒక కాంస్య పతకంతో భారత్ సంతృప్తి పడింది. 2012 ఈవెంట్లో భారత్‌కు రజతం, రెండు కాంస్యాలు వచ్చాయి. 2010లో వికాస్ కృషన్ స్వర్ణం సాధించాడు. -
క్వార్టర్స్‌లో శ్యామ్
ప్రపంచ యూత్ బాక్సింగ్ న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బల్గేరియాలోని సోఫియాలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో ఆది వారం జరిగిన పురుషుల 49 కేజీల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్యామ్ కుమార్ ‘టెక్నికల్ నాకౌట్’ పద్ధతిలో తన ప్రత్యర్థి బ్రెండన్ ఇర్విన్ (ఐర్లాండ్)ను ఓడించాడు. వైజాగ్‌లోని కంచరపాలెం ప్రాంతానికి చెందిన శ్యామ్ కుమార్ బరిలోకి దిగిన వెంటనే తన పదునైన పంచ్‌లతో బ్రెండన్‌పై విరుచుకుపడ్డాడు. శ్యామ్ పంచ్‌ల ధాటికి బ్రెండన్ పరిస్థితిని గమనించిన రిఫరీ తొలి రౌండ్లోనే బౌట్‌ను నిలిపివేసి శ్యామ్‌ను విజేతగా ప్రకటించారు. యోల్ ఫినోల్ (వెనెజులా), మైకేల్ లెగోస్కీ (పోలండ్) మధ్య మ్యాచ్ విజేతతో శ్యామ్ క్వార్టర్స్‌లో తలపడతాడు. మరోవైపు 52 కేజీల విభాగంలో భారత యువ బాక్సర్ గౌరవ్ సోలంకి క్వార్టర్ ఫైనల్లోకి చేరుకున్నాడు. ప్రిక్వార్టర్స్‌లో గౌరవ్ 3-0తో విలియమ్ డొనోగూ (ఐర్లాండ్)ను వరుస రౌండ్లలో మట్టికరిపించడం విశేషం. క్వార్టర్స్‌లో సోలంకి... ఎల్వీ పింగ్ (చైనా)తో తలపడతాడు. 64 కేజీ విభాగంలో నీరజ్ పరాశర్ 1-2తో రిచర్డ్ టోత్ (హంగేరి) చేతిలో పరాజయం చవిచూశాడు.