గోడ దూకాడు.. పదవి పట్టాడు!
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. గెలిచారు కూడా.. కానీ ఇంకా అసెంబ్లీలోకి కూడా ప్రవేశించక ముందే బీజేపీలోకి జంప్ కొట్టారు. దానికి ప్రతిఫలంగా మంత్రి పదవి కూడా సంపాదించేశారు. ఆయనెవరో కాదు.. ఆండ్రియో ఎమ్మెల్యే శ్యామ్ కుమార్. ఇప్పుడు ఆయనకు మంత్రివర్గంలో చోటు లభించడంతో కాంగ్రెస్ పార్టీ ఆయనకు షోకాజ్ నోటీసు జారీచేసింది. కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, ప్రకాష్ జవదేకర్ సహా బీజేపీ జాతీయ నాయకుడు రాం మాధవ్ సమక్షంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శ్యామ్‌కుమార్‌తో గవర్నర్ నజ్మా హెప్తుల్లా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్ కూడా హాజరయ్యారు. అక్కడ ఆయన శ్యామ్ కుమార్‌ను చూసి వెంటనే మేల్కొన్నారు. దాంతో కొత్త మంత్రికి పాత పార్టీ నుంచి నోటీసులు వెళ్లాయి.
బీజేపీకి మద్దతిచ్చిన నేషనల్ పీపుల్స్ పార్టీ నుంచి నలుగురు, ఎల్‌జేపీ నుంచి ఇద్దరు, ఎన్‌పీఎఫ్ నుంచి ఒకరికి మంత్రి పదవులు దక్కాయి. వాళ్లతో పాటు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఏకైక ఎమ్మెల్యే శ్యామ్ కుమార్‌కు కూడా పదవి ఇచ్చారు. ఆయన పేరును ప్రకటించగానే ఒక్కసారిగా రాజ్‌భవన్ హాల్లో ఉన్న బీజేపీ నాయకులు హర్షధ్వానాలు చేశారు. అయితే.. షోకాజ్ నోటీసులు వచ్చినా, తాను రాబోయే పరిణామాలు ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నట్లు శ్యామ్ చెప్పారు. మణిపూర్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం కోల్పోయారని, అందుకే వాళ్లు అధికారంలో మార్పు కోరుకున్నారని తెలిపారు.
ఇక ఒకప్పుడు ఇబోబి సింగ్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగిన మణిపూర్ మాజీ డీజీపీ.. ఎన్‌పీపీ ఎమ్మెల్యే జోయ్‌కుమార్‌కు మంత్రిపదవి ఇవ్వడమే కాక, ఆయనను ఏకంగా ఉపముఖ్యమంత్రిగా కూడా చేశారు. దీనిపై కూడా వివాదం చెలరేగింది. జోయ్‌కుమార్ డీజీపీగా ఉన్న సమయంలో రాష్ట్రంలో బూటకపు ఎన్‌కౌంటర్లు బాగా పెరిగాయని చెప్పేవారు. ఇలాంటి వ్యక్తికి అంతటి పదవేంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి.