సాక్షి, కడప : జిల్లాలోని కొన్ని బస్టాండ్లలో బస్సు ఎక్కాలంటే అదిరిపోవాల్సిందే. కడప పాత బస్టాండులాంటి ప్రాంతాల్లో ప్రొద్దుటూరు, కమలాపురం వెళ్లే బస్సుల్లో ప్రయాణికులు ఎక్కేచోట చూస్తే ఒళ్లు జలదరించాల్సిందే. దుర్వాసనతో అదిరిపోవాల్సిందే! బస్టాండు ప్రాంగణంలో చెత్తతోపాటు ఆరుబయటే మల, మూత్ర విసర్జన చేస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లపాలవుతున్నారు.
అనేక చోట్ల తాగునీటి సౌకర్యం లేదు. మూత్ర శాలలు అంతంత మాత్రమే. ప్రయాణికులకు బస్టాండుచుట్టుపక్కల ఉన్న పరిసరాలే మరుగుదొడ్లుగా, మూత్రశాలలుగా మారుతున్నాయి. ఆర్టీసీ అధికారులు బస్టాండుల నిర్వహణను గాలికొదిలేశారు.బస్టాండ్లలో తాగునీటి సౌకర్యం కల్పించామని చెబుతున్నప్పటికీ ట్యాంకులు శుభ్రపర్చక పోవడంతోపాటు నీరు బాగా లేకపోవడంతో ఆ నీటిని ప్రయాణికులు ఎవరూ తాగడం లేదు.
కడప పాత బస్టాండు పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తతోపాటు ప్రాంగణంలోనే మూత్ర, మల విసర్జన చేస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లపాలవుతున్నారు. బుగ్గవంక సమీపంలో పాతబస్టాండ్ ఉండటంతో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. బస్టాండులో ప్రయాణికులు నిలువలేని పరిస్థితి నెలకొంది.
ప్రొద్దుటూరులో 30 ఏళ్ల నాటి భవనం పెచ్చులూడి అధ్వానంగా కనిపిస్తోంది. పురుషుల మరుగుదొడ్లు ఏడాదిగా పనిచేయడం లేదు. తాగునీటి కొళాయి వద్ద అపరిశుభ్రత తాండవిస్తోంది. చెత్త, పందుల సంచారంతో పరిసరాలన్నీ దుర్వాసనతో అధ్వానంగా ఉన్నాయి. అధికారులు డిపోలోకి ప్రతిరోజు వెళుతూ వస్తున్నప్పటికీ ఇవేవీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
జమ్మలమడుగు కొత్త బస్టాండులో తాగడానికి నీరు, కూర్చోవడానికి సీట్లు లేవు. ప్రయాణికులకు సమాచారం అందించేవారు కూడా లేరు. మరుగుదొడ్ల పరిస్థితి అంతంత మాత్రమే. ముద్దనూరు, మైలవరంలో లక్షలాదిరూపాయలు వెచ్చించి బస్టాండు నిర్మాణాలు చేపట్టినప్పటికీ అవి నిరుపయోగంగా ఉన్నాయి.
రాయచోటి బస్టాండులో మరుగుదొడ్ల కొరత ఉంది. ఆరుబయటే మూత్ర విసర్జన చేయాల్సి వస్తోంది. ప్రయాణికులు కూర్చోనేందుకు కనీసం స్థలం కూడా సరిగా లేదు. మంచినీరు లేక ఇబ్బందులు పడుతున్నారు.
రైల్వేకోడూరులో బస్టాండు సౌకర్యం లేదు. 1993లో నిర్మించినప్పటికీ ఇప్పటికీ నిరుపయోగంగానే ఉంది. హైవే రోడ్డే ప్రయాణికులకు దిక్కయింది. మహిళలు బస్సు ఎక్కాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సిందే!
బద్వేలులో ఎటు చూసినా మూత్ర విసర్జన, చెత్తాచెదారం, పందుల సంచారంతో బస్టాండు పరిసరాలలో దుర్వాసన వెదజల్లుతూ ఉంటుంది. తాగేందుకు నీటి సౌకర్యం లేదు.
రాజంపేటలో మరుగుదొడ్ల సౌకర్యం లేదు. బస్టాండు ఆరంభంలోనే చెత్త దర్శనమిస్తుంటుంది. పాత బస్టాండులో నిలబడేందుకు కూడా సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు.
పులివెందులలో ప్రయాణికుల సౌకర్యార్థం మినరల్ ప్లాంట్ ఉన్నప్పటికీ అది పనిచేయకపోవడంతో కుళాయి నీళ్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. పందుల సంచారంతోపాటు పరిసరాల్లోని చెత్తతో ఇబ్బందులు తప్పడం లేదు.
మైదుకూరులో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం అంతంత మాత్రంగానే ఉంది. పరిసరాల్లో ప్రవహిస్తున్న మురుగునీరు, చెత్తతో బస్టాండు పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి.
కమలాపురంలోబస్టాండు ఉన్నప్పటికీ బస్సులు వెళ్లే పరిస్థితి లేదు. బస్టాండు శిథిలావస్థకు చేరింది. మెయిన్‌రోడ్డులోనే నిలబడి తోసుకుంటూ బస్సు ఎక్కాల్సిందే!
ఏమున్నది గర్వకారణం..
Published Mon, Jan 20 2014 3:22 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM
Advertisement
Advertisement