ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: పసిడి ధర నానాటికీ పడిపోతోంది. ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల (24 క్యారెట్లు) బంగారం ధర బుధవారం రూ.27,800లకు పలికింది. ఈనెల 15న రూ.30,130లు ఉన్న ఈ ధర క్రమేణా తగ్గుతూ వస్తోంది. సార్వత్రిక ఎన్నికల అనంతరం మార్కెట్‌లో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రధాని మోడీ హయాంలో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని వార్తలు పెద్ద ఎత్తున వస్తుండటంతో బంగారం కొనుగోళ్లపై కొనుగోలు దారులు ఆసక్తి చూపడం లేదు.
ధరలు మరింత తగ్గుతాయేమోనని ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల కారణంగా ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్ వ్యాపారాలు లేక డీలా పడింది. రాయలసీమలోనే పసిడి వ్యాపారానికి ప్రొద్దుటూరు ప్రసిద్ధిగాంచింది. వ్యాపారులతోపాటు వేలాది మంది కార్మికులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్నారు. సాధారణంగా మార్కెట్ ధరలు అప్పుడప్పుడు తగ్గడం మళ్లీ పెరగడం జరుగుతుండేది. ఈనెల 16న వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో నరేంద్రమోడీ ప్రభుత్వం రావడంతో మార్కెట్ పరిస్థితులు మారిపోయాయి. బంగారం ధరలు క్రమేణా తగ్గుతూ వస్తున్నాయి. ధరలు మరింత క్షీణిస్తాయని ప్రముఖ వ్యాపారులు ప్రకటిస్తుండటంతో కొనుగోలుదారుల్లో ఆశలు పెరుగుతున్నాయి. తొందరపడి కొనుగోలు చేసేకన్నా మరింత కాలం ఆగితే మేలు ఉంటుందని భావిస్తున్నారు. మార్కెట్ పరిస్థితులను చూసి కొనుగోలుదారులెవ్వరూ దుకాణాలకు రావడం లేదు. కేవలం ధరల గురించి మాత్రం ఆరా తీస్తున్నారు.
దీంతో దుకాణాలన్నీ కొనుగోలు దారులు లేక బోసిపోయినట్లు దర్శనమిస్తున్నాయి. పట్టణంలోని ఓ కార్పొరేట్ దుకాణంలో ఒక్క కొనుగోలుదారుడు కూడా లేకపోవడాన్ని చూస్తే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతోంది. ఏ దుకాణాన్ని చూసినా బుధవారం ఇదే పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం బంగారంపై దిగుమతి సుంకం 10 శాతం ఉండగా ప్రభుత్వం దీనిని తగ్గించే అవకాశాలు ఉన్నాయని వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే జరిగితే బంగారం దిగుమతులు పెరిగి ధరలు తగ్గుతాయని చెబుతున్నారు.
ధరలు తగ్గడంతో నష్టపోయా
గత నెలలో ప్రొద్దుటూరులో బంగారం కొనుగోలు చేశా. గ్రాము రూ.30వేలు చొప్పున కొనుగోలు చేశాను. ఆర్డర్ ఇచ్చిన బంగారాన్ని తీసుకునేందుకు రాగా ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ.27,800 ఉందన్నారు. నేను కొనుగోలు చేసిన బంగారంపై రూ.7వేలు నష్టపోయా.
- తల్లపురెడ్డి రమణమ్మ, కోగటం
రూపాయి విలువ తగ్గడమే కారణం
రూపాయి విలువ తగ్గడమే బంగారు ధరల పతనానికి ప్రధాన కారణం. రూపాయి విలువ బుధవారం నాటికి రూ.62.30 నుంచి రూ.58.83కు తగ్గింది. దీనికితోడు దిగుమతి సుంకం ప్రస్తుతం ఉన్న 10 శాతాన్ని తగ్గిస్తారని వార్తలు వస్తున్నాయి. దిగుమతి సుంకం తగ్గితే బంగారం ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉంది.
- హాజీ ఎస్‌ఎం ఇబ్రహీం, ఇబ్రహీం జువెలర్స్
మార్కెట్ డీలా పడింది
బంగారం ధరలు తగ్గుతుండటంతో కొనుగోలుదారులు రావడం లేదు. ఇంకా ధరలు తగ్గుతాయని ఆశపడుతున్నారు. వ్యాపారాలు లేక బులియన్ మార్కెట్ డీలాపడింది.
- బుశెట్టి రామ్మోహన్‌రావు,
బులియన్ మర్చంట్స్ అసోషియేషన్
ఎగ్జిక్యూటివ్ మెంబర్
పడిపోతున్న పసిడి ధర
Published Thu, May 29 2014 1:55 AM | Last Updated on Thu, Aug 2 2018 3:58 PM
Advertisement
Advertisement