ప్రొద్దుటూరులో ఆదివారం బాలకృష్ణ పర్యటన ఓ కుటుంబానికి కడుపుకోతను మిగిల్చింది. ‘లెజెండ్’ విజయోత్సవ సభకు బాలకృష్ణ వస్తుండటంతో ఆయనను చూడటానికి గంగాధర్, నాగశేషుడు, రమేష్ అనే వారు బైక్‌లో బయల్దేరారు. ఇంతలో పోలీస్ ఎస్కార్ట్ వాహనం ఢీ కొనడంతో గంగాధర్ మృతి చెందాడు రమేష్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.
ప్రొద్దుటూరు క్రైం: లెజండ్ విజయోత్సవ సభ విషాదాన్ని మిగిల్చింది. అతి వేగంగా వస్తున్న పోలీసు ఎస్కార్ట్ వాహనం ఢీ కొనడంతో 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసు వాహనం ఢీ కొన్న సంఘటనలో పొట్టిపాడు రోడ్డులోని కాల్వకట్టకు చెందిన దిద్దిగారి గంగాధర్ (11) మృతి చెందగా ఎర్రబల్లి నాగశేషుడు, మిద్దె రమేష్ గాయపడ్డారు.
వారిలో మిద్దె రమేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. లెజండ్ చిత్రం విజయోత్సవ సభను ఆదివారం పట్టణ శివారులో ఉన్న రాయల్ కౌంటీ రిసార్ట్స్‌లో నిర్వహించాలని భావించారు. బాలకృష్ణకు రక్షణ కల్పించేందుకు కడప నుంచి ఎస్కార్ట్ వాహనం రాయల్ కౌంటీ మార్గంలో వెళుతోంది.
పట్టణంలోని కాల్వకట్టకు చెందిన గంగాధర్, నాగశేషుడు, మిద్దె రమేష్ అదే సమయంలో రాయల్ కౌంటీకి బయల్దేరారు. రాయల్ కౌంటీ సమీపంలోని మైలవరం కెనాల్ వద్దకు వెళ్లగానే వెనుకవైపు నుంచి వస్తున్న పోలీస్ ఎస్కార్ట్ వాహనం వారి మోటార్‌బైక్‌ను ఢీకొంది. గాయపడిన వారిని వెంటనే 108 అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే దిద్దిగారి గంగాధర్ మృతి చెందాడు. ఎర్రబల్లి నాగశేషుడుకు కాలు విరిగింది, మిద్దె రమేష్ ప్రమాదం జరిగినప్పటి నుంచి అపస్మారక స్థితిలో ఉన్నాడు. రమేష్‌ను కర్నూలు ఆస్పత్రికి తరలించగా నాగశేషుడిని కడప రిమ్స్‌కు తరలించారు.
మధ్యతరగతి కుటుంబాల్లో విషాదం
గంగన్న పొట్టిపాడు రోడ్డులోని కాల్వకట్టలో నివాసం ఉంటున్నాడు. అతనికి గంగాధర్, గణేష్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. గంగాధర్ ఒలివియా స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. గంగన్న రాయల్ కౌంటీలో పనిచేస్తున్నాడు. బాలకృష్ణ అక్కడికి రానుండటంతో గంగాధర్, నాగశేషుడు కలిసి రాయల్ కౌంటీకి బయల్దేరారు. విషయం తెలియడంతో రమేష్ కూడా వారితోపాటు వెళ్లాడు. అతను గంగాధర్‌ను ఉన్నత చదువులు చదివించాలని తపించాడు. అయితే విధి మరోలా తలిచింది. కుమారుడు మృతి చెందాడన్న విషయం తెలియడంతో తల్లిదండ్రులు నాగలక్షుమ్మ, గంగన్నలు ఆస్పత్రికి చేరుకున్నారు. కుమారుని పరిస్థితిని చూసి వారు సొమ్మసిల్లిపోయారు.
ఐదు నెలల క్రితమే వివాహం అయింది
మిద్దె రమేష్ పట్టణంలోని గాంధీరోడ్డులో టైలర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి ఐదు నెలల క్రితం అమృతానగర్‌కు చెందిన లక్ష్మిదేవితో వివాహం అయింది. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో బంధువులు ఈ వార్తను భార్యకు తెలియనివ్వలేదు. వెంటనే అతన్ని మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. ఎర్రబల్లి నాగశేషుడు గంగాధర్‌కు సమీప బంధువు. ఇద్దరు ఒకే పాఠశాలలో చదువుతున్నారు. అతని తండ్రి నాగమయ్య బేల్దారి పనికి వెళ్లేవాడు. నాగమయ్యకు నాగశేషుడితోపాటు నాగమల్లేశ్వరి, నాగమ్మ అనే కుమార్తెలు ఉన్నారు. విషయం తెలియడంతో డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి సంఘటన స్థలికి చేరుకున్నారు.
ఎర్రగుంట్లలో..
ఎర్ర గుంట్ల: సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటన అభిమానులలో, టీడీపీ కార్యకర్తలతో నిరాశ మిగిల్చింది. అంతేకాక అపశృతి దొర్లింది. బాలయ్యను చూడడానికి వచ్చిన ఓ కార్యకర్తపై లెజండ్ బస్సు ఎక్కింది. దీంతో ఆ కార్యకర్త కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ముద్దనూరు మండలం కొత్తపల్లెకు చెందిన ప్రవీణ్ బాలయ్య చూడడానికి ఎర్రగుంట్లకు వచ్చాడు. పోలీస్‌స్టేషన్ వద్దకు రాగానే అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ రద్దీలో ప్రవీణ్‌ను బస్సు ఢీకొంది. 108 వాహనంకు సమాచారం అందించి గాయాలపాలైన ప్రవీణ్‌ను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా బాలయ్య వస్తున్నారని తెలిసి చూడడానికి వచ్చిన అబిమానులలో ప్రత్యేకించి మహిళలలో టీడీపీ కార్యకర్తలలో నిరాశ మిగిలింది.
బిడ్డా.. వెళ్లిపోయావా
Published Mon, Dec 29 2014 3:25 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM
Advertisement
Advertisement