ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆశలు అడియాశలు అయినట్లు తెలిసింది. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి తొలి నుంచి వెన్నంటి వస్తున్న వరదరాజులరెడ్డి తన రాజకీయ భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకుగాను తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడుతో వరదరాజులరెడ్డి అల్లుడు రామచంద్రారెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారు.
ఇందులో భాగంగానే లింగారెడ్డికి చెక్ పెట్టాలని అనుకున్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే టికెట్ లింగారెడ్డికి కాకుండా తనకే ఇవ్వాలన్నది వరదరాజులరెడ్డి ప్రధాన డిమాండ్. అయితే లింగారెడ్డి ఇందుకు ససేమిరా అంగీకరించడం లేదు. లింగారెడ్డికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యం కల్పించాలని వరద చెప్పినట్లు తెలుస్తోంది. ఈ చర్చల నేపథ్యంలో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ వ్యవహారాలకు బ్రేకులు పడ్డాయి.
ఇంత వరకు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అటు లింగారెడ్డి, ఇటు వరదరాజులరెడ్డి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తమ అభ్యర్థులను నిర్ణయించడం కానీ, ఎన్నికల ప్రచారం చేయడం కానీ జరగలేదు. ఇరువురు ఒకే పార్టీలోకి వచ్చిన తర్వాత అభ్యర్థుల ఎంపిక జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఇరువర్గాలకు చెందిన నాయకులు వేచి చూస్తున్నారు. ముందుగా నాలుగు రోజులు ప్రచారం చేసిన లింగారెడ్డి సైతం మధ్యలో విరమించుకున్నారు. ఇదిలావుండగా గురువారం ఎమ్మెల్యే లింగారెడ్డితోపాటు ఎంపీ సీఎం రమేష్ నాయుడు ఈ విషయంపై చంద్రబాబుతో భేటీ అయ్యారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే లింగారెడ్డిని కాదని ఎమ్మెల్యే టికెట్ మరొకరికి ఇవ్వలేమని, అలా ఇవ్వడం వలన పార్టీకి నష్టం వాటిల్లుతుందని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. ఎన్నికల్లో పార్టీకి సేవ చేస్తే భవిష్యత్తులో అవకాశం కల్పిస్తామని వరదకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రస్తుతం చర్చంశనీయమైంది. అయితే వరద వర్గీయుల్లో మాత్రం టీడీపీలో చేరికపై ఇంకా ఆశ చావలేదు. ఇదిలావుండగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సైతం తన పార్టీలోకి రావాలని వరదరాజులరెడ్డిని గురువారం ఆహ్వానించినట్లు తెలిసింది. అయితే ఈ విషయంపై వరదరాజులరెడ్డి స్పందించలేదని సమాచారం.
వరదకు భంగపాటు
Published Fri, Mar 7 2014 3:41 AM | Last Updated on Fri, Aug 10 2018 5:38 PM
Advertisement
Advertisement