తింటే ఫినిష్ | Finish eating | Sakshi
Sakshi News home page

తింటే ఫినిష్

Published Mon, Jun 30 2014 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 9:34 AM

Finish eating

చేపలు తింటే ఆరోగ్యానికి మంచిది.. ఇది డాక్టర్లు చెప్పే మాట క్యాట్‌ఫిష్ తింటే ఆరోగ్యానికి ముప్పు... ఇదీ డాక్టర్లు చెప్పే మాటే  క్యాట్‌ఫిష్... కోళ్ల వ్యర్థాలు.. ఇంకా చెప్పాలంటే జంతు కళేబరాలను ఇవి ఆహారంగా తీసుకుంటాయి.. వీటి శరీరంలో సీసంతో పాటు అనేక విషరసాయనాలు ఉంటాయి.. వీటి పెంపకం, విక్రయాలపై ప్రభుత్వం నిషేదం విధించింది. అతి తక్కువ కాలంలో ఎక్కువ బరువు పెరగడంతో చేపల వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.
 
 ప్రొద్దుటూరు టౌన్ : అవి సాధారణ చేపలు కాదు. రక్త మాంసాలు తిని అనతి కాలంలోనే చాలా బరువు పెరిగే క్యాట్‌ఫిష్‌లు.  వీటి పెంపకం, విక్రయాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. నిషేదాజ్ఞలను అమలు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం వహిస్తుండటంతో  జిల్లా వ్యాప్తంగా క్యాట్ ఫిష్‌లను  పెంచే చెరువులు వెలిశాయి. క్యాట్ ఫిష్‌లతో పాటు వాటి ఆహారంగా తీసుకెళుతున్న  చికెన్ వ్యర్థాల వాహనాన్ని ప్రొద్దుటూరు  మున్సిపల్  క మిషనర్ స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. ప్రొద్దుటూరు పట్టణం గాంధీరోడ్డులోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఎదుట  వ్యాపారులు ప్రతి రోజు వివిధ రకాల చేపలను విక్రయిస్తుంటారు. కిలో రూ.100- రూ.200 వరకు విక్రయించే ఈ చేపలకు గిరాకీ ఉంటుంది.  దీన్ని ఆసరాగా చేసుకుని  జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అక్రమంగా చేపల చెరువులు ఏర్పాటు చేసి అక్కడ క్యాట్‌ఫిష్‌లను పెంచుతున్నారు. అతి తక్కువ కాలంలో ఎక్కువ బరువు పెరిగే ఈ చేపల పెంపకానికి ఎలాంటి ఖర్చు లేకుండా  చికెన్  వ్యర్థాలను ఆహారంగా వేస్తుంటారు. కళేబరాలను కూడా ఇవి ఆహారంగా తీసుకుంటాయి.   దుర్గంధం వెదజల్లే మురికి నీటిలో ఇవి పెరుగుతాయి. గాంధీరోడ్డులోని ఓ చికెన్ దుకాణం ముందు కొద్దిరోజుల క్రితం వాహనంలోని డబ్బాలలో  చికెన్ వ్యర్థాలను నింపుతున్న విషయాన్ని గమనించి ‘సాక్షి’  ఆరా తీసింది. చేపలకు ఆహారంగా వేసేందుకు తీసుకెళుతున్నట్లు వాహన డ్రైవర్ తెలిపాడు. క్యాట్‌ఫిష్‌ల కోసమే ఈ వ్యర్థాలను తీసుకెళుతున్నట్లు తెలియవచ్చింది.
 
 కమిషనర్‌కు సమాచారంతో దాడులు...
 గాంధీరోడ్డులో, విజయ్‌కుమార్ థియేటర్ వద్ద క్యాట్‌ఫిష్ విక్రయిస్తున్న విషయాన్ని సాక్షి ప్రతినిధి మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణకు ఆదివారం  సమాచారం అందిచారు. దీంతో కమిషనర్ వెంటనే అక్కడికి వచ్చి చేపలు విక్రయిస్తున్న వారిని ఆరా తీశారు.  డబ్బాల్లో బతికి ఉన్న క్యాట్‌ఫిష్‌లను కమిషనర్ చూసి వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని స్వాధీనం చేసుకుని కార్యాలయానికి తరలించారు. ఈ విషయాన్ని జాయింట్ కలెక్టర్ రామారావు దృష్టికి తీసుకెళ్లారు. కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కేసులు పెట్టాలని జేసీ ఆదేశించారు.
 
 వ్యర్థాలను తీసుకెళ్లే  వాహనం పోలీసులకు అప్పగింత...
 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ02 ఎక్స్ 5784 నెంబర్ గల టాటా వాహనం గాంధీరోడ్డులోని చికెన్ దుకాణాల్లోని వ్యర్థాలను తీసుకెళుతున్న విషయాన్ని సాక్షి ప్రతినిధి తిరిగి కమిషనర్‌కు సమాచారం ఇచ్చారు.  ఆర్ట్స్ కళాశాల రోడ్డు, బీజీఆర్ కాంప్లెక్స్ రోడ్డుల్లో ఉన్న చికెన్ దుకాణాల్లోని వ్యర్థాలను వాహనంలో వేస్తుండగా శానిటరీ ఇన్‌స్పెక్టర్ సింగ్, మేస్త్రీ మత్తేసు, మున్సిపల్ సిబ్బంది  డ్రైవర్‌ను ప్రశ్నించారు. వాహనాన్ని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించారు.
 
 ప్రాణాంతకం : ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్
 క్యాట్ ఫిష్‌లు ప్రాణాంతకరమైనవని, వీటిని తిని అనారోగ్యం  పాలు కావద్దని  ఫిషరిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ రెడ్డయ్య తెలిపారు. వీటి వల్ల జలకాలుష్యం ఏర్పడటంతో ఇతర జల చరాలు ఏవీ ఆ నీటిలో బతకవన్నారు. వీటి శరీరంలో సీసంతో సహా అనేక విష రసాయనాలు ఉంటాయన్నారు.  నీరు లేకున్నా గంటల తరబడి బతికి ఉండే చేప క్యాట్‌ఫిష్ ఒక్కటేనన్నారు.  అతి తక్కువ కాలంలో ఎక్కువ బరువు పెరగడం వల్ల వీటిని అక్రమంగా పెంచి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. క్యాట్‌ఫిష్‌ల పెంపకం, అమ్మకంపై ప్రభుత్వం నిషేధం విధించిందన్నారు.  వీటిని తినడం వల్ల క్యాన్సర్, కిడ్నీ తదితర ప్రాణాంతకర వ్యాధులు వస్తాయన్నారు. ఎక్కడైనా వీటిని విక్రయిస్తుంటే తమకు సమాచారం అందించాలన్నారు.
 
 కోళ్ల వ్యర్థాలతో క్యాట్  ఫిష్ పెంపకం
 
 క్యాట్ ఫిష్‌ల పెంపకంపై నిషేదాజ్ఞలు ఉన్నా కొందరు వ్యాపారులు వాటిని అక్రమంగా పెంచుతున్నారు.  కోళ్ల వ్యర్థాలే కాక  జీవాల కళేబరాలను కూడా వాటికి ఆహారంగా అందిస్తుంటారు.      ప్రొద్దుటూరులో దాదాపు 100కు పైగా కోళ్ల మాంసం అమ్మే వ్యాపారులు ఉన్నారు. పెద్ద ఎత్తున కోళ్లను  కోసి మాంసం విక్రయిస్తుంటారు.  కోళ్లను కోయగా వచ్చే వ్యర్థాలను పారేస్తుంటారు. అయితే  జమ్మలమడుగు ప్రాంతం  నుంచి వచ్చే వాహనాలలో వ్యర్థాలను తీసుకెళుతుండటం పలు అనుమానాలకు తావిచ్చింది. క్యాట్‌ఫిష్‌లకు ఆహారంగా వేసేందుకే వ్యర్థాలను తీసుకెళుతున్నట్లుగా వెలుగులోకి వచ్చింది.
 
 పతి రోజు ప్రొద్దుటూరుకు రెండు ప్రత్యేక వాహనాలు వస్తాయి. వాటిలో పెద్ద పెద్ద ప్లాస్టిక్ డబ్బాలు ఏర్పాటు చేసి ఉంటాయి. వ్యర్థాలను  వాటిలో వేసి తీసుకెళుతుంటారు. జమ్మలమడుగు, మైలవరం మండలాల్లో అక్రమంగా పెంచుతున్న క్యాట్‌ఫిష్‌లకు వీటిని ఆహారంగా వేస్తుంటారు.  క్యాట్ ఫిష్‌లను తింటే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని వైద్యులు చెబతున్నారు. ఈ చేపలు కళేబరాలు,  కోళ్ల వ్యర్థాలను తిని జీవిస్తాయన్నారు.  ఒక విధంగా ఇవి  విషంతో సమానమని చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement