ప్రొద్దుటూరు క్రైం, న్యూస్‌లైన్: ప్రొద్దుటూరులోని బంగారు దుకాణాలు, ప్రముఖ డాక్టర్ల ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. తిరుపతి, కడప, ప్రొద్దుటూరుకు చెందిన అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి ఏక కాలంలో దాడులు చేశారు. ముందుగా ఐటీ అధికారులు మెయిన్‌బజార్‌లోని శ్రీలక్ష్మీ జ్యువెలర్ షాపులో సోదాలు చేశారు. ఈ విషయం తెలియడంతో పట్టణంలోని బంగారు వ్యాపార దుకాణాలు చాలా వరకు మూత పడ్డాయి. కొందరైతే దుకాణంలోని విలువైన బంగారు నగలు, వెండి సామగ్రిని వేరే చోటికి తరలించారు. చాలా షాపుల్లో యజమానులు కనిపించలేదు. ఉదయం నుంచి గుమాస్తాలు మాత్రమే కనిపించారు. దాడులు నిర్వహిస్తున్న దృష్ట్యా బుధవారం బంగారు లావాదేవీలు జరగలేదు. చాలా షాపులు కొనుగోలుదారులు లేక ఖాళీగా కనిపించాయి.
డాక్టర్ల ఇళ్లపై ఐటీ దాడులు
బంగారు దుకాణాలతో పాటు పలువురు వైద్యుల ఇళ్లపై కూడా ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. గాంధీ రోడ్డులోని డాక్టర్‌లు సత్యప్రసాద్, నాగార్జునలతోపాటు మరి కొందరి నివాస గృహాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. ఇళ్లతోపాటు ఆస్పత్రుల్లోని పలు రికార్డులను తనిఖీ చేశారు. కొన్ని రికార్డులను అధికారులు తిరుపతికి తీసుకొని వెళ్లినట్లు తెలిసింది. దాడులు చేస్తున్న సమయంలో వివరాలు వెల్లడించలేమని అధికారులు విలేకరులకు చెప్పారు. కడప ఐపీఓ భూపాల్‌నాయక్‌తో పాటు 22 మంది అధికారులు దాడుల్లో పాల్గొన్నారు.
ప్రొద్దుటూరులో ఐటీ దాడులు
Published Thu, Jan 30 2014 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 3:09 AM
Advertisement
Advertisement