ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరు ధర్మాసుపత్రికి అవినీతి జ్వరం పట్టుకుంది. ఇక్కడి సిబ్బంది ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తున్నారు. డెలివరీతో పాటు ఇతర కేసులను డాక్టర్ లేరంటూ కడప రిమ్స్‌కు రెఫర్ చేస్తున్నారు. ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి 2012 ఆగస్టులో జిల్లా స్థాయి ఆస్పత్రిగా స్థాయి పెరిగింది. ఇక్కడికి ప్రొద్దుటూరు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వైద్యం కోసం వస్తుంటారు. ఆస్పత్రిలో సివిల్ సర్జన్ పోస్టులు 9 ఉండగా కేవలం ఇద్దరు డాక్టర్లు మాత్రమే ఉన్నారు. అలాగే సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 21 ఉండగా 12 మంది రెగ్యులర్, ముగ్గురు కాంట్రాక్ట్ బేసిక్ డాక్టర్లు ఉన్నారు. ఇద్దరు దంత వైద్యులు ఉన్నారు. అయితే రేడియాలజితో పాటు పలు విభాగాలకు సర్జన్‌లు లేరు.
కాసులు ఇవ్వందే కాన్పు కాలేరు
జిల్లా ఆస్పత్రిలోని కాన్పుల వార్డులో గతంలో నెలకు 120-130 దాకా కాన్పులు జరిగేవి. అయితే గత ఆరు నెలల నుంచి కాన్పుల సంఖ్య నెలకు 30-40 మాత్రమే నమోదవుతోంది. గతంలో నలుగురు గైనకాలజిస్టులు ఉండేవారు. ఇద్దరు దీర్ఘకాలంగా సెలవులో ఉండటం వల్ల కాన్పుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఉన్న డాక్టర్‌లు ఇద్దరూ ఓపీ చూడటమే గాక ఆపరేషన్‌లు నిర్వహిస్తున్నారు. ఇళ్లలో కాన్పులు జరగరాదని, ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పులు జరగాలని ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తోంది.
అయితే ఇక్కడికి ఎంతో ఆశతో వస్తున్న పేదలకు తీవ్ర నిరాశ ఎదురవుతోంది. కాఫీ, టీ ఖర్చులకు డబ్బులు తెచ్చుకున్న బాధితులను డబ్బు ఇవ్వాల్సిందేనని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యే ముందు ఒక సారి, కాన్పు అయ్యాక మరో సారి వేలల్లో డబ్బు ఇవ్వాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. ఆపరేషన్ థియేటర్‌లో కూడా సిబ్బంది డబ్బు ఇవ్వనిదే పసికందును చేతిలో పెట్టడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కేసులు తగ్గడంతో సీ గ్రేడుకు
ఆస్పత్రిలోని పలు విభాగాలలో పరికరాలున్నప్పటికీ డాక్టర్లులేరు. కొన్ని విభాగాల్లో వైద్యులు ఉన్నారే కానీ ఆపరేషన్ చేయడానికి పరికరాలు లేవు. ఆర్థో విభాగంలో డాక్టర్‌లు ఉన్నారు. అయితే తగినన్ని పరికరాలు లేకపోవడంతో ఆపరేషన్‌లు సరిగా జరగడం లేదు. ఆస్పత్రిలో గత కొన్నేళ్ల నుంచి అల్ట్రాసౌండ్ మిషన్ ఉంది. అయితే రేడియాలజిస్టు లేకపోవడంతో లక్షలు విలువ చేసే స్కానింగ్ మిషన్ మూలన పడిఉంది. దీంతో ప్రజలు రూ. వందలు చెల్లించి బయట స్కానింగ్ చేయించుకుంటున్నారు. అలాగే ఈసీజీ విభాగంలో కూడా కొన్ని నెలల నుంచి టెక్నీషియన్ లేడు. దీంతో ఈసీజీ విభాగం మూతపడి ఉంది. గుండెకు సంబంధమైన ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలన్నా రోగులు ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ విధంగా ఆస్పత్రిలో అనేక సమస్యలు రోగులను పట్టి పీడిస్తున్నాయి.
నేడు ఆస్పత్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో భారీ ధర్నా
స్థానిక జిల్లా ఆస్పత్రి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పరిరక్షణకమిటీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించనున్నారు.
రోగం కుదిరేదెలా..!
Published Mon, Feb 23 2015 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 9:44 PM
Advertisement