పక్కదారిలో పౌష్టికాహారం
ప్రొద్దుటూరు : అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న పౌష్టికాహారం పక్కదారి పడుతోంది. పౌష్టికాహారాన్ని ఆటోలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయమై అంగన్‌వాడీ కార్యకర్తకు మెమో జారీ చేశారు. ప్రతి నెల హైదరాబాద్‌లో తయారైన పౌష్టికాహారాన్ని జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తుంటారు. అయితే చిన్నారులకు ఉపయోగపడాల్సిన పౌష్టికాహారం అనేక చోట్ల పశువుల దాణాగా మారుతోంది.
ప్రొద్దుటూరు అర్బన్ ప్రాజెక్టు పరిధిలోని 118వ అంగన్‌వాడీ కేంద్రం అసార్ వీధిలో నడుస్తోంది. ఈ కేంద్రానికి సరఫరా చేసిన పౌష్టికాహారాన్ని ఎర్రగుంట్ల మండలం చిన్నదండ్లూరుకు చెందిన రమణారెడ్డి అనే వ్యక్తి పశుదాణా కోసం కొనుగోలు చేశాడు. అంగన్‌వాడీ కార్యకర్త ఎస్.శివకళ్యాణి ఈ బస్తాలను అమ్మారు. ఇందులో 31 బస్తాల బాల అమృతం, 3 బస్తాల ఎంటీఎఫ్(10 కేజీలు), 5 బస్తాల పాత ఎంటీఎఫ్(20 కిలోలు) ఉన్నాయి. ప్రభుత్వ అంచనా ప్రకారం వీటి విలువ సుమారు రూ.20వేలు ఉంటుంది.
ఈ బస్తాలను రూ.2వేలకు కొనుగోలుచేసినట్లు రమణారెడ్డి లిఖిత పూర్వకంగా అర్బన్ ప్రాజెక్టు సీడీపీఓ రాజేశ్వరిదేవికి రాయించారు. శుక్రవారం రాత్రి అంగన్‌వాడీ కేంద్రం నుంచి ఆటోలో వీటిని రవాణా చేస్తుండగా వరలక్ష్మి అపార్ట్‌మెంట్ వద్ద వన్‌టౌన్ పోలీసులు పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం జిల్లా ప్రాజెక్టు డైరక్టర్ లీలావతికి తెలియడంతో ఆమె అర్బన్, రూరల్ ప్రాజెక్టు అధికారులను విచారించారు.
అనంతరం అర్బన్ సీడీపీఓ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి బస్తాలను తీసుకొచ్చి ప్రాజెక్టు కార్యాలయంలో ఉంచారు. ఈనెల 9వ తేదీ నుంచి శుక్రవారం వరకు పౌష్టికాహారాన్ని ప్రాజెక్టు కార్యాలయం నుంచి సరఫరా చేశారు. రేపోమాపో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ పౌష్టికాహారాన్ని లబ్ధిదారులకు అందించాల్సి ఉంది. ఆలోపుగానే ఈ సంఘటన వెలుగు చూడటం గమనార్హం. ఈ సంఘటనపై పోలీసు కేసు నమోదు కాలేదు.
బాల అమృతం రుచి చూడని చిన్నారులు
స్త్రీ, శిశుసంక్షేమ శాఖ బాల అమృతమనే పౌష్టికాహారాన్ని కొత్తగా తయారు చేసింది. ఏడు నెలల నుంచి మూడేళ్ల వయసులోపు పిల్లలకు అందించడానికి ఈ ప్యాకెట్లను సరఫరా చేశారు. గోధుమలు, శనగలు, పాలపొడి, నూనె, చక్కెరతో ఈ మిశ్రమాన్ని తయారు చేస్తారు. రోజు 3-5 మార్లు 100 గ్రాముల చొప్పున ఈ పౌష్టికాహారాన్ని తినిపిస్తే పిల్లల్లో సూక్ష్మ పోషకాలు, కాల్షియం అందుతాయని అధికారులు పేర్కొంటున్నారు. ఈ పౌష్టికాహారం వలన ఏడాదికి చిన్నారులు 9 కిలోలు రెండేళ్లకు 12 కిలోలు, 3 ఏళ్లకు 15 కిలోల చొప్పున పెరుగుతారని చెబుతున్నారు.
తీవ్ర పోషకాహారం లోపం ఉన్న పిల్లలకు అంగన్‌వాడీ కార్యకర్తల పర్యవేక్షణలో బాల అమృతాన్ని అందించాల్సి ఉంది. రెండున్నర కిలోల చొప్పున ఈ ప్యాకెట్లను తయారు చేశారు. ఈ పౌష్టికాహారం పరిశ్రమలో తయారు అయిన అనంతరం తొలిమారు జూన్ నుంచి సరఫరా చేస్తున్నారు. ప్రొద్దుటూరు అర్బన్ ప్రాజెక్టుకు ఈనెల 8వ తేదీన 850 బస్తాల బాల అమృతం సరఫరా అయింది.
శుక్రవారం వరకు ప్రాజెక్టు పరిధిలోని 196 అంగన్‌వాడీ కేంద్రాలకు వీటిని అందించారు. చిన్నారులు ఈ పౌష్టికాహార రుచిని చూడకముందే పశుదాణాకు తరలి వెళ్లడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి 196 అంగన్‌వాడీ కేంద్రాలను పర్యవేక్షించేందుకు పర్యవేక్షకులు లేరు. ప్రాజెక్టు అంతటికీ ఒక్కరు మాత్రమే ఏడాది కాలంగా పనిచేస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం నిల్వలు ఏవిధంగా ఉన్నాయి.. ఏవిధంగా సరఫరా చేస్తున్నారన్న విషయాలను కూడా పరిశీలించే వారు లేరు. ఈ కారణంగానే ఇలాంటి సంఘటనలు వెలుగు చూస్తున్నాయి.