అంగన్ వాడీ టీచర్ నుంచి జెడ్పీ చైర్‌పర్సన్‌గా..
రఘునాథపల్లి మండలం ఖిలాషాపురం గ్రామానికి చెందిన శాగ మాణిక్యమ్మ, యాదగిరి దంపతుల నలుగురు సంతానంలో పద్మ పెద్దది. ఈమెకు చెల్లెలు అనిత, రజిత, తమ్ముడు సతీష్ ఉన్నారు. పేదరికంలో మగ్గుతూనే పద్మ ఇంటర్ వరకు చదువుకున్నారు. ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తిచేశారు. 1994లో నర్మెట మండలం గండి రామారం గ్రామానికి చెందిన గద్దల నర్సిం గరావును వివాహం చేసుకున్నారు. వీరికి అఖిల్, నిఖిల్‌లు జన్మించారు. ప్రస్తుతం పెద్ద కుమారుడు అఖిల్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి, నిఖిల్ జనగామలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నారు. 1998 నుంచి 2006 వరకు నర్సింగరావు వివిధ పత్రికలో విలేకరిగా పనిచేశారు. ప్రస్తుతం వీరు జనగామలో అద్దె ఇంట్లో ఉంటున్నారు.
2001లో తొలిసారిగా..
తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా 2000 సంవత్సరంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని ఏ ర్పాటు చేయగా నర్సింగారావు ఆ పార్టీలో చేరారు. ఈ క్రమంలో చురుకైనా నాయకుడిగా ఎదిగారు. ఈ క్రమంలో 2001లో తన భార్య పద్మను పార్టీ తరపున ఎంపీటీసీగా బరిలో నిలిపే అవకాశం వచ్చింది. ఆ ఎన్నికల్లో విజయం సాధించిన పద్మ అబ్దుల్ నాగారం ఎంపీటీసీ సభ్యురాలిగా 2006 వరకు కొనసాగారు.
ఈ సమయంలో రాజకీయాలపై ఆమెకు కొంత అవగాహన ఏర్పడినప్పటికీ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీచేసే అవకాశం రాలేదు. దీంతో గృహిణిగానే ఉండిపోయారు. 2010లో గండిరామారం అంగన్‌వాడీ-2 సెంటర్‌లో టీచర్‌గా ఉద్యోగం పొందిన ఆమె మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల వరకూ ఉద్యోగం చేశారు. నర్మెట జెడ్పీటీసీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతోఉద్యోగానికి రాజీనామా చేశారు. ఎన్నికల బరిలో నిలిచి జెడ్పీటీసీ సభ్యురాలిగా గెలుపొందారు. కలిసి వచ్చిన రిజర్వేషన్.. పార్టీ సమీకరణల నేపథ్యంలో శనివారం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్థానాన్ని దక్కించుకున్నారు.
ఆమె ఓ సాధారణ గృహిణి.. అతి పేద కుటుంబానికి చెందిన మహిళ. నిన్న మొన్నటి వరకు అంగన్‌వాడీ టీచర్. పిల్లలకు నాలుగు అక్షరాలు నేర్పే పంతులమ్మ. ఉండేది అద్దె ఇంట్లో. నేడు.. తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్. రాజకీయాలంటే ఏమాత్రం అవగాహన లేని ఆమెకు రిజర్వేషన్ రూపంలో అదృష్టం కలిసొచ్చింది. ఎంపీపీగా రాజకీయ ఆరంగేట్రం చేసినా తర్వాత ఐదేళ్ల విరామం.. మళ్లీ సాధారణ జీవితం. ఇప్పుడు ఏకంగా జెడ్పీ చైర్‌పర్సన్‌గా రికార్డుల్లోకి ఎక్కిన ఆమె మరెవరో కాదు.. నర్మెట మండలం గండి రామారానికి చెందిన గద్దల పద్మ.
- జనగామ
పద్మ వికాసం
Published Sun, Jul 6 2014 2:44 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement