అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని అన్న చందంగా తయారైంది ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిస్థితి. రూ. 50 కోట్ల నిధులు మున్సిపాలిటీలో మూలుగుతున్నా ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టడం లేదు. అభివృద్ధి పనులకు సంబంధించిన ఫైళ్లపై స్పెషలాఫీసర్ సంతకాలు చేయకపోవడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది.
ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో సుమారు రూ.50కోట్ల నిధులు మురిగిపోతున్నాయి. రూ.40కోట్లు జనరల్ ఫండ్‌తోపాటు వివిధ గ్రాంట్ల కింద సుమారు మరో రూ.10కోట్లు నిధులు ఉన్నాయి. మున్సిపాలిటీ పాలకవర్గ పదవీ కాలం 2010 సెప్టెంబర్ 28 నాటికి పూర్తయింది. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ కావడంతో ఇక్కడ జిల్లా జాయింట్ కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు.
ముందుగా ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులకు సంబంధించి అనుమతులు ఇవ్వడం (కౌన్సిల్ ఆమోదం), పనులు చేయడం జరిగేది. అయితే గత ఏడాది ఆగస్టు నుంచి మున్సిపాలిటీకి సంబంధించిన పనులపై స్పెషల్ ఆఫీసర్ ఏ కారణంగానో సంతకాలు చేయడం లేదు. కొన్ని పనులకు అనుమతులు మంజూరు చేసినా మళ్లీ టెండర్లు రద్దు చేశారు. ఇలాంటి కారణాల వలన మున్సిపాలిటీకి సంబంధించి సుమారు రూ.8కోట్ల విలువ కలిగిన 70 పనులకు స్పెషల్ ఆఫీసర్ అనుమతి మంజూరు చేయలేదని తెలుస్తోంది. దీంతో మున్సిపాలిటీలో నిధులు ఉన్నా ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది.
కోడ్ అమలైతే పరిస్థితి ఏమిటి
ప్రస్తుతం జిల్లా జాయింట్ కలెక్టర్ నిర్మల బదిలీ అయ్యారు. నూతనంగా రామారావు బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. ఆయన బాధ్యతలు స్వీకరించి ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి వచ్చేలోపు అనివార్యంగా ఎన్నికల కోడ్ అమలైతే మున్సిపాలిటీ అభివృద్ధి ఆగిపోయినట్లే.
కౌన్సిల్ ఆమోదం తర్వాతనే పనులు
కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాతే మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు జరుగుతాయి. నిబంధనల ప్రకారమే తప్ప మున్సిపల్ కమిషనర్ స్థాయిలో పనులు మంజూరు చేయడానికి వీలుకాదు. ప్రతి పనికి కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి.
- సంక్రాంతి వెంకటకృష్ణ, మున్సిపల్ కమిషనర్
రూ.2వేల వరకు ఖర్చయింది
వార్డు పరిధిలో ట్యూబ్‌లైట్లు, బోర్ల మరమ్మతులకు సుమారు రూ.2వేల వరకు ఖర్చయింది. మున్సిపాలిటీ సిబ్బందికి చెప్పినా సామాన్లు లేవని చెబుతుండటంతో సొంతంగా బిగించుకున్నాం.
కోట సంజీవరాయుడు, మాజీ కౌన్సిలర్
ఈయన పేరు అబ్దుల్లా. మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకుడుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ సమన్వయకర్త రాచమల్లు ప్రసాదరెడ్డి ఆదేశించడంతో వార్డు పరిధిలో ఇటీవల మూడు బోరింగ్‌లను మరమ్మతు చేయించారు.
ఈయన పేరు బలిమిడి చిన్న రాజు. 30వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకునిగా వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ అధికారులకు పది మార్లు విన్నవించినా సమస్యలను పట్టించుకోకపోవడంతో చివరకు ఆయనే వార్డు పరిధిలో 8 ట్యూబ్‌లైట్లను కొనుగోలు చేసి సిబ్బందితో బిగించారు.
రూ.50 కోట్లు మురుగుతున్నాయ్..!
Published Wed, Feb 12 2014 1:48 AM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM
Advertisement
Advertisement