80 మందికి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ ఎత్తున స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పదోన్నతులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఒకేసారి 80 మంది రెవెన్యూ అధికారులు పదోన్నతులు పొందనున్నారు. ఈ మేరకు కసరత్తు పూర్తి చేసిన రెవెన్యూ శాఖ.. సిద్ధమైన జాబితాను గురువారం సీసీఎల్‌ఏ రిమార్క్ కోసం పంపింది. అక్కడి నుంచి సమాచారం రాగానే పదోన్నతుల ఉత్తర్వు జారీ కానుంది. ఇటీవల కొత్త జిల్లాల ఏర్పాటుతో ఒక్కసారిగా జిల్లా రెవెన్యూ అధికారుల పోస్టులు ఖాళీ అయ్యాయి. పలువురు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్ పోస్టులు కూడా ఖాళీ అయ్యాయి.
జాయింట్ కలెక్టర్లుగా నాన్ కేడర్ రెవెన్యూ అధికారులను సర్దుబాటు చేయటంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. దీంతో డీఆర్‌ఓ సహా సర్వే సెటిల్‌మెంట్స్, భూసేకరణ తదితర విభాగాల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. పాత జిల్లాల్లో మూడు చోట్ల మినహా మిగతా జిల్లాల డీఆర్‌వోలంతా జాయింట్ కలెక్టర్లు అయ్యారు. వీరు సరిపోక వివిధ పోస్టులు, డిప్యుటేషన్లలో ఉన్న స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకూ జేసీలుగా పదోన్నతి కల్పించి నియమించారు. కొత్త జిల్లాలు ఏర్పడ్డ నేపథ్యంలో ఈ ఖాళీలను భర్తీ చేయకపోతే పాలన పడకేసే ప్రమాదం ఉండటంతో వెంటనే పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కసరత్తు ప్రారంభించారు.