ప్రొద్దుటూరు క్రైం, న్యూస్‌లైన్: ప్రొద్దుటూరులో మరో కిడ్నాపింగ్ ముఠా వెలుగులోకి వచ్చింది. సునీల్ గ్యాంగ్ అంటూ దుండగులు డాక్టర్ దంపతులకు ఫోన్ చేసి రూ.50 లక్షలు కావాలని..లేదంటే మీ పిల్లల్ని చంపేస్తామంటూ బెదిరించిన సంఘటన ప్రొద్దుటూరు పట్టణంలో సంచలనం రేకెత్తించింది. గాంధీరోడ్డులోని భవ్య ఆస్పత్రి నిర్వాహకులు డాక్టర్ సత్యప్రసాద్, డాక్టర్ సంధ్యారాణిలను గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించినట్లు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు అందింది. మంగళవారం డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి, సీఐ మహేశ్వరరెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
సోమవారం ఉదయం 10 గంటల సమయంలో పలువురు వ్యక్తులు డాక్టర్ సంధ్యారాణి, సత్యప్రసాద్‌కు ఫోన్ చేసి మేము సునీల్ గ్యాంగ్ సభ్యులం..ఇప్పటికే ఎన్నో కిడ్నాప్‌లు చేశాం..ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది..మాకు వెంటనే రూ.50 లక్షలు కావాలి.. లేదంటే మీ పిల్లల్ని చంపేస్తామని హెచ్చరించారు. సాయంత్రం 5 గంట ల్లోపు డబ్బు పంపే ఏర్పాటు చేయండి..పోలీసులకు చెప్పారో ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరే చూస్తారు..అంటూ బెదిరించారు. దీంతో భయపడిన డాక్టర్లు అంత డబ్బు మా వద్ద లేదని అనగా డబ్బుతోపాటు మీ వద్ద బంగారు కూడా ఉందని మాకు తెలుసులే.. ఎక్కువగా మాట్లాడకుండా 5 గంటల్లోగా డబ్బు పంపించండి..ఎక్కడికి తీసుకొని రావాలో ఫోన్ చేసి చెబుతామన్నారు.
ఉన్న బంగారంతా బ్యాంక్‌లో పెట్టి ఆ డబ్బుతోనే ఆస్పత్రి కట్టామని డాక్టర్ దంపతులు వారితో చెప్పారు. అవన్నీ మాకు తెలియవు అని చెప్పి ఫోన్ కట్ చేశారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మళ్లీ ఫోన్ చేసి డబ్బు రెడీ చేసుకున్నారా అని అడిగారు. అంత డబ్బు మా వద్ద లేదు.. 5 లక్షలు ఇస్తామని చెప్పగా..సరే సరే ఆ డబ్బు తీసుకొని మీరు రావద్దు.. మీ డ్రైవర్ చేతికి ఇచ్చి పంపండి.. సాయంత్రం మేము ఫోన్ చేయగానే డబ్బు పంపించండి అని డ్రైవర్ ఫోన్ నెం బర్‌ను వారు రాసుకున్నారు. సాయంత్రం 6 గం టల సమయంలో డాక్టర్‌తో పాటు ఆయన డ్రైవర్ కలిసి వెళ్లి అయ్యప్పస్వామి ఆలయం సమీపంలో వారికి రూ.5 లక్షలు ఇచ్చారు. డాక్టర్ దంపతులు బయపడి ఈ విషయాన్ని ముందుగా ఎవ్వరికీ చెప్పలేదు. తర్వాత వారి సన్నిహితులకు చెప్పగా వారి సూచన మేరకు డాక్టర్‌లు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. నలుగురు వ్యక్తులు తన వద్ద డబ్బు తీసుకొన్నారని, వారిని చూస్తే కచ్చితంగా గుర్తు పడతానని డాక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నాడు.
నేరస్తులు తప్పించుకోలేరు
నేరస్తులు ఎప్పటికైనా కటకటాల పాలు కావల్సిం దేనని డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి అన్నారు. సునీల్ గ్యాంగ్ అని వారు చెప్పారని, అయితే సునీల్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడన్నారు. అయినా సునీల్ గ్యాంగ్ నిందితులపై విచారణ చేస్తామన్నారు. డాక్టర్ ఇచ్చిన ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
వైద్యులకు బెదిరింపు
Published Wed, Nov 20 2013 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 AM
Advertisement