సాక్షి, నెల్లూరు : తల్లి ఒడిలో ఉన్న రెండు నెలలు నిండని చిన్నారిపై కన్ను పడింది. చిన్నారిని ఇవ్వాలని అమ్మమ్మను ప్రాధేయపడ్డారు.. తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో ఎలాగైనా దక్కించుకోవాలనుకున్నారు. వారిని వెంబడించి.. మాటలు కలిపారు. ఆదమర్చి ఉన్న వేళ చిన్నారిని కిడ్నాప్ చేసి వెంట తీసుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు 36 గంటలు శ్రమించి నిందితులను అరెస్ట్ చేశారు. చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
వివరాలు.. పశ్చిమగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ఆరుళ్లకు చెందిన గోపీ, కృష్ణవేణి దంపతులు, ముగ్గురు పిల్లలతో కలిసి కూలీ పనులు నిమిత్తం బెంగళూరు వెళ్లేందుకు ఈ నెల ఐదున తణుకులో శేషాద్రి ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. తణుకు రైల్వేస్టేషన్లో వీరితో మాటలు కలిపిన ఇద్దరు మహిళలు చిన్నారుల్లో ఒకర్ని ఇస్తే డబ్బులిస్తామని ప్రాధేయపడ్డారు. వారు నిరాకరించారు. అయితే చిన్నారిని ఎలాగైనా దక్కించుకోవాలని సదరు మహిళలు సైతం శేషాద్రి ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. మరో బోగీలో ఎక్కిన మహిళలు విజయవాడలో గోపీ కుటుంబం ఉన్న బోగీలోకి ఎక్కి మాటలు కలిపారు. బంధువులమని నమ్మించేలా ప్రవర్తించారు. చీరను ఉయ్యాలగా వేసి అందులో పడుకోబెట్టారు.
కొంతసేపటికి గోపీ, కృష్ణ దంపతులు ఆదమర్చి నిద్రపోయారు. ఈ క్రమంలో మహిళలిద్దరూ చిన్నారిని ఎత్తుకొని ఆడిస్తున్నట్లు నటిస్తూ కావలి రైల్వేస్టేషన్లో రైలు దిగారు. నిద్ర నుంచి తేరుకున్న వారికి ముగ్గురు పిల్లల్లో ఒక చిన్నారి కనిపించలేదు. ఇద్దరు మహిళల జాడ తెలియరాలేదు. వారి కోసం బోగీ అంతా గాలించారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో నెల్లూరులో దిగి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైల్వే డీఎస్పీ వసంతకుమార్ ఆదేశాల మేరకు కావలి రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.
సవాల్‌గా తీసుకున్న పోలీసులు
చిన్నారి కిడ్నాప్ విషయాన్ని డీఎస్పీ, సీఐలు సవాల్‌గా తీసుకున్నారు. నెల్లూరు, ఒంగోలు రైల్వే సీఐల ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కావలి రైల్వేస్టేషన్ వద్ద ఓ మహిళ చిన్నారిని తీసుకెళ్లడాన్ని సీసీ కెమెరాల్లో గుర్తించారు. అదే క్రమంలో ప్రత్యక్ష సాక్షి కొంత సమాచారాన్ని అందించడంతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. నిందితులిద్దరూ కావలి బస్టాండ్ నుంచి ఒంగోలుకు ఆర్టీసీ బస్సులో వెళ్లారని సమాచారం అందింది. దీంతో పోలీసులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సెల్‌ఫోన్ టవర్ డంప్‌లను సేకరించారు. ఎంపిక చేసుకున్న నంబర్ల ఆధారంగా పోలీసులు కూపీ లాగాడంతో నిందితులు కృష్ణా జిల్లా నూజివీడు ప్రాంత వాసులుగా గర్తించారు. ప్రత్యేక బృందం శనివారం ఉదయం నూజివీడు చేరుకొని కిడ్నాపర్లు బీబీ, నాగూర్‌బీని అరెస్ట్ చేసి చిన్నారిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
పిల్లల్లేకపోవడంతోనే..
కృష్ణా జిల్లా నూజివీడు స్టేషన్ తోట రామాలయం వీధికి చెందిన షేక్ బీబీ, హుస్సేన్ దంపతులు. వారు ప్రస్తుతం తిరుపతి రైల్వేస్టేషన్ పక్కనున్న కస్తూరిభాయ్ వీధిలో నివాసం ఉంటూ స్థానికంగా కొబ్బరి బోండాల వ్యాపారం చేస్తున్నారు. బీబీకి మరో నిందితురాలైన నాగూర్‌బీ చెల్లెలు. ఆమె భర్త నుంచి విడిపోయి ఉండటంతో అక్క భర్తనే రెండో వివాహం చేసుకున్నారు. అందరూ కలిసి తిరుపతిలో ఉంటున్నారు. వివాహమై ఏళ్లు గడుస్తున్నా పిల్లల్లేకపోవడంతో భర్త, చుట్టుపక్కల వారు సూటిపోటి మాటలతో వేధించసాగారు.
దీంతో అక్కాచెల్లెళ్లు మాస్టర్‌ప్లాన్ వేశారు. ఎలాగైనా పిల్లలను సంపాదించాలని నిర్ణయించుకున్నారు. తెలిసిన వారందరికీ పిల్లలను ఎవరైనా దత్తతకు లేదా అమ్మకానికి ఇచ్చేవారు ఉంటే చెప్పమని కోరారు. భర్తకు అనుమానం రాకుండా ఉండేందుకు గర్భిణిగా నటించసాగారు. ఈ క్రమంలో పది రోజుల క్రితం కాన్పునకు వెళ్తున్నానని చెప్పి అక్కతో కలిసి నూజీవీడుకు వచ్చారు. గడువు ముంచుకు రావడంతో ఎలాగైనా పిల్లలను దక్కించుకోవాలని నిర్ణయించుకొని సమీపంలోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో మాటేశారు. ఈ క్రమంలో తణుకు రైల్వేస్టేషన్లో గోపీ, కృష్ణవేణి దంపతులు కనిపించడం.. వారి కుమార్తెను కిడ్నాప్ చేశారని నిందితులు పోలీసులకు తెలిపారు.
చిన్నారి అప్పగింత
నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు చిన్నారిని తీసుకొని ప్రత్యేక వాహనంలో నెల్లూరు చేరుకున్నారు. నెల్లూరు రైల్వే డీఎస్పీ కార్యాలయంలో చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో బాధిత కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. చిన్నారిని సురక్షితంగా అప్పగించిన పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
సిబ్బందికి అభినందన
నిందితులను అరెస్ట్ చేసి చిన్నారిని రక్షించిన నెల్లూరు, ఒంగోలు రైల్వే సీఐలు మంగారావు, రామారావు, కావలి రైల్వే ఎస్సై మాలకొండయ్య, హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, శ్యామ్, కానిస్టేబుళ్లు సురేష్‌బాబు, ఆనంద్, సతీష్, ధనుంజయ, రమేష్, పెంచలయ్య, ఐటీ కోర్ సభ్యులు వినోద్, షమీమ్‌ను డీఎస్పీ అభినందించారు. త్వరలో గుంతకల్లు రైల్వే ఎస్పీ చేతుల మీదుగా రివార్డులను అందించనున్నామని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment