women cheated
-
యువతులే అతడి టార్గెట్.. ఖరీదైన కార్లు, బంగ్లాతో రిచ్ బ్యాచిలర్..
ధనవంతుడిలా కటింగ్ ఇచ్చాడు ఓ కన్నింగ్ ఫెలో. బీసీఏ, ఎంబీఏ పూర్తిచేసి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో రెస్టారెంట్ పెట్టి ఘోరంగా నష్టపోయాడు. దీంతో, మనీ సంపాదించడం కోసం అడ్డదారులు తొక్కాడు. మ్యాట్రిమోనిలో రిచ్ బ్యాచ్‌లర్‌గా కలరింగ్ ఇస్తూ.. పెళ్లి పేరుతో పలువురు యువతులను మోసం చేశాడు. ఓ యువతి ద్వారా గుట్టురట్టై జైలుపాలయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ముజఫర్‌నగర్‌కు చెందిన విశాల్(26) బీసీఏ, ఎంబీఏ పూర్తిచేశాడు. అనంతర, గుర్గావ్లోని ఓ మల్టీనేషనల్ కంపెనీలో హెచ్ఆర్గా ఉద్యోగంలో చేరాడు. ఈ క్రమంలో తక్కువ సమయంలోనే లక్షల్లో డబ్బు సంపాదించాలన్న ఆశతో మూడేండ్లకే ఉద్యోగం మానేసి ఓ రెస్టారెంట్ పెట్టుకున్నాడు. అయితే రెస్టారెంట్ వ్యాపారం అతనికి కలిసిరాలేదు. లక్షల్లో అప్పులయ్యాయి. దీంతో, డబ్బు కోసం ఏం చేయాలా అని ఆలోచించాడు. మైండ్ ఐడియా తట్టిందే అదనుగా.. మాట్రిమోనీ వెబ్సైట్లను టార్గెట్‌ను చేశారు. పెళ్లి పేరుతో యువతులను వల వేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే మ్యాట్రిమోనీల్లో రిచ్ బ్యాచిలర్లా ఫ్రొఫైల్ సెట్ చేశాడు. ఆ ప్రోఫైల్ చూసి కాంటాక్ట్ అయిన యువతులకు.. అతను అద్దెకు తెచ్చుకున్న లగ్జరీ కార్లు, భవనాలు చూపిస్తూ అతి తనవేనంటూ ఓవర్ బిల్డప్ ఇచ్చేశాడు. యువతి టచ్‌లోకి రాగానే వారికి మాయమాటలు చెప్పి వాళ్ల నుంచి అందినకాడికి డబ్బులు తీసుకున్నాడు. అనంతరం వాళ్ల ఫోన్ నెంబర్లు బ్లాక్ చేసి దూరంపెట్టేవాడు. అయితే, తాజాగా విశాల్ మ్యాట్రిమోనీ ప్రోఫైల్ చూసి పెళ్లి విషయమై గుర్గావ్కు చెందిన ఓ యువతి, ఆమె ఫ్యామిలీ కాంటాక్ట్ అయ్యారు. ఈ సందర్బంగా తన రిచ్‌నెస్ చూపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాడు. తనకు పలు విల్లాలు ఉన్నాయని, హోటల్ వ్యాపారాలు ఉన్నాయని బిల్డప్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే విదేశాల నుంచి ఖరీదైన వస్తువులు, సెల్‌ఫోన్స్ తక్కువ ధరకే తెప్పిస్తానని మాయమాటలు చెప్పి ఆమె దగ్గరి నుంచి డబ్బులు వసూలు చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె ఫ్రెండ్స్, బంధువుల నుంచి అందినకాడికి ఆర్డర్లు తీసుకున్నాడు. ఇలా మొత్తం రూ.3.05 లక్షలను బాధితురాలి నుంచి రాబట్టాడు. కాగా, వస్తువులు, ఫోన్ల కాలం బాధితులు విశాల్‌కు ఫోన్లు చేయడంతో వారి నంబర్లను కూడా బ్లాక్ చేశాడు. దీంతో, తేరుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించి.. జరిగిన విషయాన్ని తెలిపారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. ఓ మహిళా కానిస్టేబుల్‌తో డెకాయ్ ఆపరేషన్ చేపించి విశాల్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ క్రమంలో రిచ్ బ్యాచిలర్ అసలు కథ బయటకు వచ్చింది. ఇతగాడి మోసాలు తెలుసుకుని బాధితులు, పోలీసులు షాక్ తిన్నారు. -
కి'లేడి'లు గర్భిణిలుగా నటించి ఆపై..
సాక్షి, నెల్లూరు : తల్లి ఒడిలో ఉన్న రెండు నెలలు నిండని చిన్నారిపై కన్ను పడింది. చిన్నారిని ఇవ్వాలని అమ్మమ్మను ప్రాధేయపడ్డారు.. తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో ఎలాగైనా దక్కించుకోవాలనుకున్నారు. వారిని వెంబడించి.. మాటలు కలిపారు. ఆదమర్చి ఉన్న వేళ చిన్నారిని కిడ్నాప్ చేసి వెంట తీసుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు 36 గంటలు శ్రమించి నిందితులను అరెస్ట్ చేశారు. చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాలు.. పశ్చిమగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ఆరుళ్లకు చెందిన గోపీ, కృష్ణవేణి దంపతులు, ముగ్గురు పిల్లలతో కలిసి కూలీ పనులు నిమిత్తం బెంగళూరు వెళ్లేందుకు ఈ నెల ఐదున తణుకులో శేషాద్రి ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. తణుకు రైల్వేస్టేషన్లో వీరితో మాటలు కలిపిన ఇద్దరు మహిళలు చిన్నారుల్లో ఒకర్ని ఇస్తే డబ్బులిస్తామని ప్రాధేయపడ్డారు. వారు నిరాకరించారు. అయితే చిన్నారిని ఎలాగైనా దక్కించుకోవాలని సదరు మహిళలు సైతం శేషాద్రి ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. మరో బోగీలో ఎక్కిన మహిళలు విజయవాడలో గోపీ కుటుంబం ఉన్న బోగీలోకి ఎక్కి మాటలు కలిపారు. బంధువులమని నమ్మించేలా ప్రవర్తించారు. చీరను ఉయ్యాలగా వేసి అందులో పడుకోబెట్టారు. కొంతసేపటికి గోపీ, కృష్ణ దంపతులు ఆదమర్చి నిద్రపోయారు. ఈ క్రమంలో మహిళలిద్దరూ చిన్నారిని ఎత్తుకొని ఆడిస్తున్నట్లు నటిస్తూ కావలి రైల్వేస్టేషన్లో రైలు దిగారు. నిద్ర నుంచి తేరుకున్న వారికి ముగ్గురు పిల్లల్లో ఒక చిన్నారి కనిపించలేదు. ఇద్దరు మహిళల జాడ తెలియరాలేదు. వారి కోసం బోగీ అంతా గాలించారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో నెల్లూరులో దిగి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైల్వే డీఎస్పీ వసంతకుమార్ ఆదేశాల మేరకు కావలి రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. సవాల్‌గా తీసుకున్న పోలీసులు చిన్నారి కిడ్నాప్ విషయాన్ని డీఎస్పీ, సీఐలు సవాల్‌గా తీసుకున్నారు. నెల్లూరు, ఒంగోలు రైల్వే సీఐల ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కావలి రైల్వేస్టేషన్ వద్ద ఓ మహిళ చిన్నారిని తీసుకెళ్లడాన్ని సీసీ కెమెరాల్లో గుర్తించారు. అదే క్రమంలో ప్రత్యక్ష సాక్షి కొంత సమాచారాన్ని అందించడంతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. నిందితులిద్దరూ కావలి బస్టాండ్ నుంచి ఒంగోలుకు ఆర్టీసీ బస్సులో వెళ్లారని సమాచారం అందింది. దీంతో పోలీసులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సెల్‌ఫోన్ టవర్ డంప్‌లను సేకరించారు. ఎంపిక చేసుకున్న నంబర్ల ఆధారంగా పోలీసులు కూపీ లాగాడంతో నిందితులు కృష్ణా జిల్లా నూజివీడు ప్రాంత వాసులుగా గర్తించారు. ప్రత్యేక బృందం శనివారం ఉదయం నూజివీడు చేరుకొని కిడ్నాపర్లు బీబీ, నాగూర్‌బీని అరెస్ట్ చేసి చిన్నారిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పిల్లల్లేకపోవడంతోనే.. కృష్ణా జిల్లా నూజివీడు స్టేషన్ తోట రామాలయం వీధికి చెందిన షేక్ బీబీ, హుస్సేన్ దంపతులు. వారు ప్రస్తుతం తిరుపతి రైల్వేస్టేషన్ పక్కనున్న కస్తూరిభాయ్ వీధిలో నివాసం ఉంటూ స్థానికంగా కొబ్బరి బోండాల వ్యాపారం చేస్తున్నారు. బీబీకి మరో నిందితురాలైన నాగూర్‌బీ చెల్లెలు. ఆమె భర్త నుంచి విడిపోయి ఉండటంతో అక్క భర్తనే రెండో వివాహం చేసుకున్నారు. అందరూ కలిసి తిరుపతిలో ఉంటున్నారు. వివాహమై ఏళ్లు గడుస్తున్నా పిల్లల్లేకపోవడంతో భర్త, చుట్టుపక్కల వారు సూటిపోటి మాటలతో వేధించసాగారు. దీంతో అక్కాచెల్లెళ్లు మాస్టర్‌ప్లాన్ వేశారు. ఎలాగైనా పిల్లలను సంపాదించాలని నిర్ణయించుకున్నారు. తెలిసిన వారందరికీ పిల్లలను ఎవరైనా దత్తతకు లేదా అమ్మకానికి ఇచ్చేవారు ఉంటే చెప్పమని కోరారు. భర్తకు అనుమానం రాకుండా ఉండేందుకు గర్భిణిగా నటించసాగారు. ఈ క్రమంలో పది రోజుల క్రితం కాన్పునకు వెళ్తున్నానని చెప్పి అక్కతో కలిసి నూజీవీడుకు వచ్చారు. గడువు ముంచుకు రావడంతో ఎలాగైనా పిల్లలను దక్కించుకోవాలని నిర్ణయించుకొని సమీపంలోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో మాటేశారు. ఈ క్రమంలో తణుకు రైల్వేస్టేషన్లో గోపీ, కృష్ణవేణి దంపతులు కనిపించడం.. వారి కుమార్తెను కిడ్నాప్ చేశారని నిందితులు పోలీసులకు తెలిపారు. చిన్నారి అప్పగింత నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు చిన్నారిని తీసుకొని ప్రత్యేక వాహనంలో నెల్లూరు చేరుకున్నారు. నెల్లూరు రైల్వే డీఎస్పీ కార్యాలయంలో చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో బాధిత కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. చిన్నారిని సురక్షితంగా అప్పగించిన పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. సిబ్బందికి అభినందన నిందితులను అరెస్ట్ చేసి చిన్నారిని రక్షించిన నెల్లూరు, ఒంగోలు రైల్వే సీఐలు మంగారావు, రామారావు, కావలి రైల్వే ఎస్సై మాలకొండయ్య, హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, శ్యామ్, కానిస్టేబుళ్లు సురేష్‌బాబు, ఆనంద్, సతీష్, ధనుంజయ, రమేష్, పెంచలయ్య, ఐటీ కోర్ సభ్యులు వినోద్, షమీమ్‌ను డీఎస్పీ అభినందించారు. త్వరలో గుంతకల్లు రైల్వే ఎస్పీ చేతుల మీదుగా రివార్డులను అందించనున్నామని ప్రకటించారు. -
కిలాడి లేడి; గవర్నర్ సంతకం నుంచి మొదలుపెట్టి..
సాక్షి, విశాఖపట్నం : సాక్షాత్తూ రాష్ట్ర మాజీ గవర్నర్ నరసింహన్‌తో పాటుగా అప్పటి ఆంధ్రాయూనివర్సిటీ అధికారి ప్రొఫెసర్ ప్రసాదరావు సంతకాలను ఫోర్జరీ చేసిన కేసులో నిందితురాలు సత్యను అరెస్టు చేయడంలో మూడో పట్టణ పోలీసులు విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ఆమె జాడ కూడా కనుక్కోలేకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఆంధ్రాయూనివర్సిటీలో ఉద్యోగాల నియామక ఉత్తర్వులలో సంతకాలు ఫోర్జరీ చేసి మోసం చేశారని త్రీటౌన్ పోలీసులకు అక్టోబర్ 18వ తేదీన ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. మాజీ గవర్నర్, పూర్వ అధికారి సంతకాలను ఫోర్జరీ చేసి నియామక ఉత్వర్వులు జారీచేశారంటూ నిందితురాలు సత్యపై ఏయూ రిజి్రస్టార్ కృష్ణమోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గొంతిన సత్య హైదరాబాద్‌లోని ఓ అపార్ట్మెంట్లో కుమారుడు దినేశ్‌తో కలిసి నివసించేవారు. కాగా, తన తల్లి సత్య ఏయూలో ఉన్నత విద్య ఎంప్లాయిమెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారని ఎదురు ఫ్లాటులో ఉంటున్న రాజశేఖర్‌ని నమ్మించాడు. దీంతో రాజశేఖర్‌తోపాటుగా అతని బంధువులు, స్నేహితులు కలిపి 12 మంది రూ.1.7కోట్లు సమరి్పంచుకున్నారు. పెద్ద పోస్టులకు రూ.15 లక్షలు, చిన్న పోస్టులకు రూ.6లక్షలు వంతున వసూలు చేశారు. తరువాత ఏయూలో నియామకాలు వచ్చేశాయంటూ అప్పటి గవర్నర్ సంతకాలు ఫోర్జరీ చేసి ఉత్తర్వులు ఇచ్చేశారు. ఈ ఉత్తర్వులు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో ఏయూ అధికారి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌కు ఎస్ఐ స్థాయి అధికారి కాకుండా ఒక కానిస్టేబుల్ వెళ్లడం గమనార్హం. ఆయన సత్య నివసించిన ఫ్లాట్ వద్దకు వెళ్లగా సత్య, కుమారుడి ఆచూకీ లభించలేదు. వారు ఫ్లాట్ మాత్రం ఖాళీచేయలేదన్న సమాచారంతో మాత్రమే కొద్దిరోజుల క్రితం విశాఖ తిరిగిచేరుకున్నారు. కాగా ఈ కేసుపై త్రీటౌన్‌పోలీసులు పెద్దగా దృష్టి సారించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతనెలలోనే కొందరు బాధితులు త్రీటౌన్స్టేషన్కు వచ్చి తాము సత్య చేతిలో మోసపోయామని చెప్పగా..మోసం జరిగింది హైదరాబాద్‌లో కాబట్టి అక్కడే ఫిర్యాదు ఇవ్వాలని చెప్పడంతో వారంతా వెనుదిరిగారు. కాగా సత్య సుదీర్ఘకాలం సెలవులు తీసుకోవడంతో 2016 సంవత్సరంలో సస్పెండ్ అయ్యారు. సస్పెన్సన్‌లో ఉన్న మహిళ ఏకంగా రాష్ట్ర గవర్నర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి మరీ డబ్బులు స్వాహా చేయడంతో అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటివరకు సత్య ఆచూకీ తెలియకపోవడంతో ఏయూ అధికారులు సైతం కలవరపడుతున్నారు. ఇదిలా ఉండగా సత్య ఏయూలోని ఓ బ్యాంకులో పొదుపుఖాతా నిమిత్తం తన చిరునామాను పాండురంగాపురం, సెక్టార్–5, ఆరిలోవ అని తప్పుడు చిరునామా ఇచ్చినట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసును త్రీటౌన్‌సీఐ కోరాడ రామారావు పర్యవేక్షణలో ఎస్ఐ ధర్మేంద్ర దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహం అయ్యింది ..బూతు బొమ్మలు పంపుతావా?
ఆటోనగర్ (విజయవాడ తూర్పు) : వాట్సప్‌లో అశ్లీల చిత్రాలను పంపించి ఒక యువకుడి వద్ద నుంచి డబ్బులు కాజేయాలని చూసిన ఓ మాయ లేడీపై మంగళవారం పటమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన జలసూత్రం సుజన్‌కుమార్‌కు కొంత కాలం క్రితం ఓ మహిళ ఫేస్బుక్లో పరిచయం అయ్యింది. రాను రాను వీరి పరిచయం ఎక్కువ అయ్యింది. ఈ నెల 9న వేరే ఫోన్ నుంచి ఆ వివాహిత సుజన్‌కుమార్ సెల్‌కు అశ్లీల ఫొటోలను వాట్సప్ చేసింది. అతని ఫొటోలను కూడా ఆమెకు పంపించమని మెసేజ్ పెట్టింది. దీంతో సుజన్‌కుమార్ కూడా అశ్లీల ఫొటోలను ఆమెకు పంపించాడు. అయితే, ఆ ఫొటోలను అడ్డుపెట్టుకుని తనకు రూ.5 వేలు ఇవ్వాలంటూ ఆమె బెదిరించసాగింది. తనకు వివాహం అయ్యిందని, భర్త హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడని, తమకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని, తనకే బూతు బొమ్మలు పంపుతావా అంటూ బెదిరించింది. డబ్బులివ్వకపోతే తనకు పంపిన అశ్లీల చిత్రాలను పోలీస్‌లకు చూపిస్తానని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పటమట అశోక్‌నగర్‌లోని తన అక్క ఇంటికి ఇటీవల వచ్చిన సుజన్‌కుమార్ ఘటనపై పటమట పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాయ లేడీ కోసం గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ ఉమామహేశ్వరరావు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఫేస్‌బుక్‌లలో పరిచయం పెంచుకుంటే నష్టపోవడమే కాకుండా అనేక సమస్యలను కొని తెచ్చుకుంటారని హెచ్చరించారు. ఫేస్‌బుక్‌ల మాయలో పడి యువకులు అపరిచిత మహిళలతో మాట్లాడవద్దని సూచించారు. -
మోసగత్తెకు ఏడాది జైలు
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ) : ఓమహిళ ఘరానా మోసానికి న్యాయస్థానం సంకెళ్లేసి జైలుకు పంపింది. ఏడాది శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. వివరాలు. గోపాలపట్నంకు చెందిన బర్రి సరోజని ఎల్లపువానిపాలేనికి చెందిన ప్రమీలాదాస్ అనే గృహిణికి పరిచయమైంది. తనకు సర్వే నెంబరు 104లో ప్లాట్ ఉందని, దీన్ని రూ.8.18లక్షలకు అమ్ముతానని చెప్పడంతో ప్రమీలాదాస్ ఆ స్థలాన్ని కొనుగోలు చేసింది. సరోజని ఆ మొత్తాన్ని తీసుకొని ఆమె ఇంట్లో నెలకు నాలుగువేల చొప్పున ఇస్తానని అద్దెకు దిగింది. ఆ మొత్తం తీసుకున్న మూడు నెలల తర్వాత బండారం బయటపడింది. ఆమె మోసకారి అని తేలింది. ప్రమీలాదాస్ కొన్న స్థలాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో గగ్గోలు పెట్టింది. ప్రభుత్వ స్థలాన్ని అమ్మేస్తావా ... మాడబ్బులు మాకివ్వు...ఇల్లు ఖాళీ చేయ్..అంటే ఇపుడు రెండూ జరగవని మోసకారి మహిళ చెప్పడంతో బాధితురాలు 2012లో గోపాలపట్నం పోలీసులను ఆశ్రయించింది. దీంతో అప్పటి సీఐ బాలసూర్యారావు కేసు నమోదు చేసి సరోజనిని అరెస్టు చేసి కోర్టుకు పంపారు. ఏపీపీ కె.సుధారాణి బాధితురాలి తరఫున వాదనలు వినిపించారు. సోమవారం రెండో మెట్రోపాలిటిన్ కోర్టు న్యాయమూర్తి సమ్మిపర్విన్‌సుల్తానాబేగం తీర్పునిచ్చారు. ఏడాది జైలు శిక్ష, రూ. 10వేల జరిమానా విధిస్తూ ఆదేశించారు. -
గల్ఫ్ ఉపాధి పేరిట వ్యభిచార కూపంలోకి..
తూర్పు గోదావరి కేంద్రంగా సాగుతున్న దందా డీజీపీని కలిసేందుకు వచ్చిన బాధితురాలు విజయవాడ సిటీ: గల్ఫ్ ఉద్యోగంతో లక్షలు సంపాదించొచ్చని ఆశ పెట్టారు. ఖర్చులు తామే భరించి పంపుతామని నమ్మబలికారు. రూ.50 వేల పెట్టుబడి పెడుతున్నట్టు చెప్పి ఖాళీ నోట్లపై సంతకాలు చేయించుకున్నారు. ఆపై ఆమెను గల్ఫ్ దేశంలో వ్యభిచార కూపానికి తరలించి సొమ్ము చేసుకున్నారు. ఆ తరువాత ఆమె వివరాలు తెలియకపోవడంతో భర్త పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు మధ్యవర్తులకే వత్తాసు పలికారు. ఏడాదిన్నర పాటు గల్ఫ్ దేశంలోని వ్యభిచార కూపంలో మగ్గిన ఆమె ఎట్టకేలకు సొంత రాష్ట్రం చేరుకుంది. బెజవాడ తెలుగు తమ్ముళ్ల కాల్‌మనీ సెక్స్ రాకెట్ దందా వెలుగులోకి వచ్చిన నెల రోజుల్లోపే.. తూర్పు గోదావరి జిల్లా కేంద్రంగా గల్ఫ్‌లోని వ్యభిచార కూపాలకు మహిళలను తరలిస్తున్న వైనం వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. డబ్బు ఆశ చూపి.. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం ఈలకొలనుకు చెందిన ఒక వికలాంగుడు తల్లి, భార్య, ఇద్దరు పిల్లలతో ఉంటున్నారు. ఏడాదిన్నర కిందట పెదపూడి మండలం పెద్దాడ గ్రామానికి చెందిన పల్లపాటి రామకృష్ణ, మామిడాడకు చెందిన చండ్రమల్ల రత్నం, తెలంగాణలోని వరంగల్‌కు చెందిన రమేశ్ అతడిని కలిశారు. అతడి భార్యను గల్ఫ్‌లో ఇంటి పనులు చేసేందుకు పంపితే పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయని ఆశ చూపారు. భార్యాభర్తలు అంగీకరించడంతో ప్రయాణానికి అయ్యే రూ.50 వేలు తామే వడ్డీకి సమకూరుస్తామని చెప్పి నాలుగు ఖాళీ నోట్లు తీసుకున్నారు. ఆపై ఆమెను గల్ఫ్‌లోని కింగ్డమ్ ఆఫ్ బెహరిన్లోని వ్యభిచార కూపానికి తరలించారు. భూలోక నరకమే రోజూ ఎవరెవరో తాగొచ్చి లైంగిక దాడి చేస్తారని, చిత్రహింసలు పెడతారని బాధిత మహిళ వాపోయింది. రోజులో ఒకసారి ఒక చపాతీ, గ్లాసు నీళ్లు మాత్రమే ఇస్తారని తెలిపింది. జీతం అడిగితే తాము ముందే ఏజెంట్లకు డబ్బులు ఇచ్చి కొనుకున్నట్టు చెప్పారని కన్నీటి పర్యంతమైంది. ఎప్పుడైనా ఎదురు తిరిగితే అక్కడి పోలీసులతో కూడా కొట్టించేవారని చెప్పింది. ఒక మహిళ సహకారంతో ఆ నరకం నుంచి బయటపడి ఇక్కడికి వచ్చినట్టు ఆమె తెలిపింది. మధ్యవర్తులకే పోలీసు సపోర్టు పరిసర ప్రాంతాల్లోని ఆర్థిక ఇబ్బందులున్న కుటుంబాలను గుర్తించి మహిళలను ఉపాధి పేరిట మధ్యవర్తుల ముఠా గల్ఫ్ దేశాలకు పంపుతోందని బాధిత మహిళ భర్త తెలిపారు. లోకల్ పోలీసులతో ముఠాకు సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఎవరూ ముందుకొచ్చి చెప్పుకోలేకపోతున్నారన్నారు. రెండేళ్ల కాలంలో పరిసర మండలాల్లోని 30 మందికి పైగా మహిళలను ఆ ముఠా వేర్వేరు దేశాలకు పంపిందని తెలిపారు. గతంలో తన భార్య ఆచూకీ కోసం పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోలేదని, వారికే మద్దతు ఇచ్చారని, పెద్దాపురం ఇన్స్పెక్టర్ తనతో హీనంగా మాట్లాడారని చెప్పారు. తాను అప్పున్నట్టు లీగల్ నోటీసులు పంపారన్నారు. ఎస్పీని కలుస్తాం డీజీపీ జె.వి.రాముడిని స్వయంగా కలసి బాధలు చెప్పుకునేందుకు ఆదివారం ఉదయం ఆ భార్యాభర్తలు విజయవాడ వచ్చారు. డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదులు తీసుకోరని చెప్పిన అధికారులు తూర్పు గోదావరి ఎస్పీని కలవాలని సూచించారు. దీంతో సోమవారం ఎస్పీని కలుస్తామని తెలిపారు.