
తనకు వివాహం అయ్యిందని, భర్త హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడని, తమకు ఇద్దరు పిల్లలు..
ఆటోనగర్ (విజయవాడ తూర్పు) : వాట్సప్‌లో అశ్లీల చిత్రాలను పంపించి ఒక యువకుడి వద్ద నుంచి డబ్బులు కాజేయాలని చూసిన ఓ మాయ లేడీపై మంగళవారం పటమట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన జలసూత్రం సుజన్‌కుమార్‌కు కొంత కాలం క్రితం ఓ మహిళ ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యింది. రాను రాను వీరి పరిచయం ఎక్కువ అయ్యింది. ఈ నెల 9న వేరే ఫోన్ నుంచి ఆ వివాహిత సుజన్‌కుమార్ సెల్‌కు అశ్లీల ఫొటోలను వాట్సప్ చేసింది. అతని ఫొటోలను కూడా ఆమెకు పంపించమని మెసేజ్ పెట్టింది. దీంతో సుజన్‌కుమార్ కూడా అశ్లీల ఫొటోలను ఆమెకు పంపించాడు.
అయితే, ఆ ఫొటోలను అడ్డుపెట్టుకుని తనకు రూ.5 వేలు ఇవ్వాలంటూ ఆమె బెదిరించసాగింది. తనకు వివాహం అయ్యిందని, భర్త హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడని, తమకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని, తనకే బూతు బొమ్మలు పంపుతావా అంటూ బెదిరించింది. డబ్బులివ్వకపోతే తనకు పంపిన అశ్లీల చిత్రాలను పోలీస్‌లకు చూపిస్తానని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పటమట అశోక్‌నగర్‌లోని తన అక్క ఇంటికి ఇటీవల వచ్చిన సుజన్‌కుమార్ ఘటనపై పటమట పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాయ లేడీ కోసం గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ ఉమామహేశ్వరరావు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఫేస్‌బుక్‌లలో పరిచయం పెంచుకుంటే నష్టపోవడమే కాకుండా అనేక సమస్యలను కొని తెచ్చుకుంటారని హెచ్చరించారు. ఫేస్‌బుక్‌ల మాయలో పడి యువకులు అపరిచిత మహిళలతో మాట్లాడవద్దని సూచించారు.