గల్ఫ్ ఉపాధి పేరిట వ్యభిచార కూపంలోకి..
- తూర్పు గోదావరి కేంద్రంగా సాగుతున్న దందా
- డీజీపీని కలిసేందుకు వచ్చిన బాధితురాలు
విజయవాడ సిటీ: గల్ఫ్ ఉద్యోగంతో లక్షలు సంపాదించొచ్చని ఆశ పెట్టారు. ఖర్చులు తామే భరించి పంపుతామని నమ్మబలికారు. రూ.50 వేల పెట్టుబడి పెడుతున్నట్టు చెప్పి ఖాళీ నోట్లపై సంతకాలు చేయించుకున్నారు. ఆపై ఆమెను గల్ఫ్ దేశంలో వ్యభిచార కూపానికి తరలించి సొమ్ము చేసుకున్నారు. ఆ తరువాత ఆమె వివరాలు తెలియకపోవడంతో భర్త పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు మధ్యవర్తులకే వత్తాసు పలికారు. ఏడాదిన్నర పాటు గల్ఫ్ దేశంలోని వ్యభిచార కూపంలో మగ్గిన ఆమె ఎట్టకేలకు సొంత రాష్ట్రం చేరుకుంది. బెజవాడ తెలుగు తమ్ముళ్ల కాల్‌మనీ సెక్స్ రాకెట్ దందా వెలుగులోకి వచ్చిన నెల రోజుల్లోపే.. తూర్పు గోదావరి జిల్లా కేంద్రంగా గల్ఫ్‌లోని వ్యభిచార కూపాలకు మహిళలను తరలిస్తున్న వైనం వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.
డబ్బు ఆశ చూపి..
తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం ఈలకొలనుకు చెందిన ఒక వికలాంగుడు తల్లి, భార్య, ఇద్దరు పిల్లలతో ఉంటున్నారు. ఏడాదిన్నర కిందట పెదపూడి మండలం పెద్దాడ గ్రామానికి చెందిన పల్లపాటి రామకృష్ణ, మామిడాడకు చెందిన చండ్రమల్ల రత్నం, తెలంగాణలోని వరంగల్‌కు చెందిన రమేశ్ అతడిని కలిశారు. అతడి భార్యను గల్ఫ్‌లో ఇంటి పనులు చేసేందుకు పంపితే పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయని ఆశ చూపారు. భార్యాభర్తలు అంగీకరించడంతో ప్రయాణానికి అయ్యే రూ.50 వేలు తామే వడ్డీకి సమకూరుస్తామని చెప్పి నాలుగు ఖాళీ నోట్లు తీసుకున్నారు. ఆపై ఆమెను గల్ఫ్‌లోని కింగ్‌డమ్ ఆఫ్ బెహరిన్‌లోని వ్యభిచార కూపానికి తరలించారు.
భూలోక నరకమే
రోజూ ఎవరెవరో తాగొచ్చి లైంగిక దాడి చేస్తారని, చిత్రహింసలు పెడతారని బాధిత మహిళ వాపోయింది. రోజులో ఒకసారి ఒక చపాతీ, గ్లాసు నీళ్లు మాత్రమే ఇస్తారని తెలిపింది. జీతం అడిగితే తాము ముందే ఏజెంట్లకు డబ్బులు ఇచ్చి కొనుకున్నట్టు చెప్పారని కన్నీటి పర్యంతమైంది. ఎప్పుడైనా ఎదురు తిరిగితే అక్కడి పోలీసులతో కూడా కొట్టించేవారని చెప్పింది. ఒక మహిళ సహకారంతో ఆ నరకం నుంచి బయటపడి ఇక్కడికి వచ్చినట్టు ఆమె తెలిపింది.
మధ్యవర్తులకే పోలీసు సపోర్టు
పరిసర ప్రాంతాల్లోని ఆర్థిక ఇబ్బందులున్న కుటుంబాలను గుర్తించి మహిళలను ఉపాధి పేరిట మధ్యవర్తుల ముఠా గల్ఫ్ దేశాలకు పంపుతోందని బాధిత మహిళ భర్త తెలిపారు. లోకల్ పోలీసులతో ముఠాకు సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఎవరూ ముందుకొచ్చి చెప్పుకోలేకపోతున్నారన్నారు. రెండేళ్ల కాలంలో పరిసర మండలాల్లోని 30 మందికి పైగా మహిళలను ఆ ముఠా వేర్వేరు దేశాలకు పంపిందని తెలిపారు. గతంలో తన భార్య ఆచూకీ కోసం పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోలేదని, వారికే మద్దతు ఇచ్చారని, పెద్దాపురం ఇన్‌స్పెక్టర్ తనతో హీనంగా మాట్లాడారని చెప్పారు. తాను అప్పున్నట్టు లీగల్ నోటీసులు పంపారన్నారు.
ఎస్పీని కలుస్తాం
డీజీపీ జె.వి.రాముడిని స్వయంగా కలసి బాధలు చెప్పుకునేందుకు ఆదివారం ఉదయం ఆ భార్యాభర్తలు విజయవాడ వచ్చారు. డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదులు తీసుకోరని చెప్పిన అధికారులు తూర్పు గోదావరి ఎస్పీని కలవాలని సూచించారు. దీంతో సోమవారం ఎస్పీని కలుస్తామని తెలిపారు.