ప్రొద్దుటూరు క్రైం: ‘గతంలో మాదిరే ఇప్పుడు కూడా మేము మీకు విధేయులుగా ఉంటాం.. మాకు ప్రొద్దుటూరులో పోస్టింగ్ ఇప్పించండి సార్’ అంటూ పలువురు సీఐలు నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. త్వరలో పోలీసు శాఖలో బదిలీలు జరగనున్న నేపథ్యంలో పోస్టింగ్‌ల కోసం వారు నాయకులతో పైరవీలు చేయించుకుంటున్నారు. ప్రొద్దుటూరు పట్టణం వాణిజ్యానికి ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ బంగారు వ్యాపారంతో పాటు వస్త్ర వ్యాపారాలు కూడా ప్రతి రోజూ రూ.కోట్లలో జరుగుతాయి. రాజకీయ పరంగా కూడా పోలీసు అధికారులకు మిగతా ప్రాంతాల మాదిరిగా పెద్దగా ఒత్తిళ్లు ఉండక పోయినప్పటికీ పోలీసు అధికారులే స్వామిభక్తి ప్రదర్శిస్తుంటారు. అందువల్ల ఇక్కడ పని చేసేందుకు పోలీసు అధికారులు ఇష్టపడుతుంటారు. గతంలో పని చేసి వెళ్లిన అధికారులు మిగతా వారికి అవకాశం ఇవ్వకుండా తిరిగి వారే ఇక్కడికి బదిలీలు, ప్రమోషన్లపై రావడం పరిపాటిగా మారింది.
గతంలో కూడా చాలా మంది ఎస్‌ఐలు, సీఐలు ఇక్కడిక్కడే బదిలీ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కొందరు సీఐలైతే పట్టణంలోని అన్ని స్టేషన్‌లలో పని చేశారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా బదిలీలు జరగనున్నాయి.
దీంతో చాలా మంది సీఐలు ప్రొద్దుటూరు రావడానికి పోటీ పడుతున్నారు.కొన్ని రోజుల క్రితం ఇక్కడికి రావడానికి సంకోచించినప్పటికీ ఇప్పుడు మాత్రం ఎంతో ఉత్సాహం చూపుతున్పట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు సీఐలు అధికార పార్టీకి చెందిన సీనియర్ నాయకుడిని కలిసి వెళ్లిన ట్లు సమాచారం. గతంలో సునీల్ గ్యాంగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఓ పోలీసు అధికారి వారం రోజుల క్రితం జాతీయ రహదారికి సమీపంలో ఉన్న గ్రామానికి వెళ్లి నాయకుడిని కలిసినట్టు తెలిసింది. అంతేగాక గతంలో బద్వేల్ ప్రాంతంలో పని చే సి వివాదాస్పదుడుగా పేరు తెచ్చుకున్న సీఐ కూడా ఆ నాయకుడిని కలిసి వెళ్లినట్లు సమాచారం. కడపలో పని చేస్తున్న ఓ సీఐ ప్రొద్దుటూరు రావడానికి ఉత్సాహం చూపుతున్నట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా పట్టణంలో సీనియర్ నాయకుడికి ప్రధాన అనుచరుడిగా ఉన్న మాజీ కౌన్సిలర్ కుటుంబం కూడా కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న తమ బంధువైన సీఐకి ప్రొద్దుటూరులో పోస్టింగ్ ఇప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కొందరు సీఐలైతే పోట్లదుర్తికి చెందిన టీడీపీ నాయకులను కలుస్తున్నట్లు తెలిసింది. వారి ద్వారా ప్రొద్దుటూరులో పోస్టింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేసి పోస్టింగ్‌లు తీసుకునే అధికారులు ప్రజలకు ఏం సేవ చేస్తారో వేచి చూడాల్సిందే.
ప్రొద్దుటూరు టు ప్రొద్దుటూరు
Published Mon, Jul 14 2014 2:17 AM | Last Updated on Sat, Sep 2 2017 10:15 AM
Advertisement
Advertisement