రేషన్ కార్డు లేదు | Ration card not their? | Sakshi
Sakshi News home page

రేషన్ కార్డు లేదు

Published Thu, Dec 5 2013 2:46 AM | Last Updated on Sat, Sep 2 2017 1:15 AM

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రచ్చబండ కార్యక్రమంలో మంజూరైన రేషన్ కార్డుల పరిస్థితి ఈ విధంగా ఉండటంతో పేదలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.

 ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రచ్చబండ కార్యక్రమంలో మంజూరైన రేషన్ కార్డుల పరిస్థితి ఈ విధంగా ఉండటంతో పేదలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేశారు. అనంతరం ముఖ్యమంత్రిగా ఉన్న రోశయ్య హయాంలో ఏ ఒక్క రేషన్ కార్డు మంజూరు కాలేదు.
 
 కాగా కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మళ్లీ రేషన్ కార్డులను మంజూరు చేశారు.
 అయితే ఈ విధానం గతానికి పూర్తి భిన్నంగా ఉండటంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తొలివిడత రచ్చబండ కార్యక్రమం 2011 ఫిబ్రవరిలో నిర్వహించారు. మళ్లీ అదే ఏడాది నవంబర్‌లో రెండో మారు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. రెండు విడతల రచ్చబండ కార్యక్రమాల్లో అధికారులు దరఖాస్తు దారులకు నేరుగా రేషన్‌కార్డులు మంజూరు చేయకుండా తాత్కాలిక రేషన్‌కార్డుతోపాటు 12 నెలలకు సంబంధించిన కూపన్లు పంపిణీ చేశారు. ఈ ప్రకారం కూపన్లు ఉన్నవారికే డీలర్లు సరుకులు ఇస్తారు.
 
 కూపన్లు అయిపోయే లోపు వినియోగదారులు మళ్లీ తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. దరఖాస్తు ఫారంతోపాటు ఫొటోలు, పూర్తి వివరాలు అందజేస్తే రెవెన్యూ అధికారులు ఒరిజనల్ కార్డుల మంజూరు కోసం హైదరాబాద్‌లోని పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులకు లేఖ పంపాల్సి ఉంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత తిరిగి ఒరిజనల్ రేషన్ కార్డులను వినియోగదారులకు అందజేయాల్సి ఉంది. ఈ కారణంగా చాలా మంది కూపన్లు అయిపోవడంతో రేషన్ పొందలేకపోతున్నారు. పదే పదే తమకు డీలర్లు సరుకులు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు.
 
 కూపన్లు ఉన్నంత వరకే మీకు సరుకులు ఇస్తామని, మీరు ఒరిజనల్ కార్డుల కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. 2011లో జరిగిన రచ్చబండ కార్యక్రమం సందర్భంగా పంపిణీ చేసిన కూపన్ల గడువు ముగియడంతో చాలా రోజులుగా పేదలు రేషన్‌కు నోచుకోలేకపోతున్నారు. జిల్లాలో సుమారు 7వేల మంది ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నారు. 3వ విడత రచ్చబండ కార్యక్రమంలో మాత్రం తాత్కాలిక రేషన్‌కార్డుతోపాటు 7 నెలలకు సంబంధించిన కూపన్లను పంపిణీ చేశారు.
 
 ఫొటోలోని వల్లంకొండు గంగాదేవి నిరుపేద. ప్రొద్దుటూరు శ్రీనివాసనగర్‌లో 7/3853/3 నెంబర్‌గల పెంకుటింటిలో రూ.450లు అద్దె చెల్లిస్తూ నివాసం ఉంటోంది. ఇళ్లల్లో పాచిపని చేస్తూ నాలుగు రూకలు సంపాదిస్తుండగా ఈమె భర్త నాగయ్య కూలీనాలీ చేస్తాడు. వంట మాస్టర్లకు సహాయకునిగా పనిచేస్తున్నారు. వీరిరువురు కలిసి పనిచేస్తేనే కానీ ఏపూటకాపూట కడుపు నింపుకోవడం కష్టం. వీరికి ఇంతకాలం రేషన్ కార్డు లేకపోగా తొలివిడత రచ్చబండ కార్యక్రమంలో తాత్కాలిక రేషన్ కార్డు(ఆర్‌ఏపీ 118203202830)తోపాటు 12 నెలలకు సంబంధించిన రేషన్ కూపన్లను అధికారులు ఇచ్చారు. ఈ ఏడాది మే నెలకు కూపన్లు అయిపోయాయి. అనంతరం వీరు రేషన్‌కు వెళ్లగా కూపన్లు తెచ్చుకోవాలని డీలర్లు చెబుతున్నారు. రెవెన్యూ అధికారులు కూడా వీరికి కూపన్లు ఇవ్వకపోవడంతో రేషన్ తీసుకునేందుకు నోచు కోలేదు.
 
 ఈయన పేరు వడ్ల వెంకటసుబ్బయ్య ఆచారి. మున్సిపాలిటీ పరిధిలోని 7/3833 ఇంటి నెంబర్‌లో నివాసం ఉంటున్నాడు. చె క్కపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈయన భార్య పెంచలదేవి పేరు మీద తొలివిడత రచ్చబండ కార్యక్రమంలో తాత్కాలిక రేషన్‌కార్డు (ఆర్‌ఏపీ 118203200717)తోపాటు 12 నెలలకు సంబంధించిన కూపన్లు ఇచ్చారు. మే నెలకు వీరికి కూపన్లు అయిపోవడంతో రేషన్ రావడం లేదు. తనకు ఒరిజనల్ రేషన్ కార్డు మంజూరు చేయాలని నెలల తరబడి తహశీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement