కొందామా.. వద్దా..!
ప్రొద్దుటూరు కల్చరల్ : మార్కెట్‌లో పుత్తడి ధరలు ఊగిసలాడుతున్నాయి. కొన్ని రోజులు గా బంగారు ధరలు పెరగడం అంతలోనే తగ్గుతూ రావడంతో కొందామా.. వద్దా అని వినియోగదారులు ఊగిసలాడుతున్నారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలలో బంగారానికి ఎంతో ప్రత్యేకత ఉంది. బంగారాన్ని ప్రతి శుభకార్యంలోనూ ఉపయోగించడం ఆనవాయితీగా వస్తోంది. కొన్నేళ్లుగా బంగారం ధర చుక్కలను అంటుతుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనే పరిస్థితి కనిపించడంలేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడం, తగ్గడం, రూపాయి మారకం విలువలో హెచ్చుతగ్గులు ఉండటంతో బంగారు ధరలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
శుక్రవారం 24 క్యారెట్ల బంగారం ధర గ్రాము రూ.2680, 22 క్యారెట్ల బంగారం ధర రూ.2467 ఉండగా వెండి కిలో రూ.36800గా ఉంది. డిసెంబర్ 1వ తేదీన 24క్యారెట్ల బంగారం ధర గ్రాము రూ.2,620, 22 క్యారెట్లు రూ.2,410, వెండి కిలో ధర రూ.34,400గా ఉంది. 2వ తేదీనాటికి 10 గ్రాముల మీద దాదాపు రూ.850 వరకు పెరిగి 24 క్యారెట్ల గ్రాము ధర రూ.2705, 22 క్యారెట్ల ధర రూ.2488కు చేరింది. వెండి కిలో మీద రూ.2500 పెరిగి రూ.36,900కు చేరింది.
పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ...
పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికి బంగారం కొనుగోలు అంతంత మాత్రంగా జరుగుతుండటంతో షరాబు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. ధరలు కాస్త దిగి రావడంతో పసిడి విక్రయాలు పుంజుకుంటాయని వధూవరులకు అవసరమైన బ్రాస్‌లెట్, చైను, గాజులు, హారాలు, ఉంగరాలు వంటి నూతన డిజైన్‌లను తయారు చేయించి అమ్మకానికి సిద్ధం చేశారు. అయితే రెండేళ్లలో ఎప్పుడూ లేని విధంగా వ్యాపారాలు పడిపోయాయని వ్యాపారులు వాపోతున్నారు. పుత్తడి ధరలు భారీగా దిగిరావచ్చనే భావన ఉండటమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ప్రజలలో ఆర్థిక పరిస్థితి సరిగా లేదని, పెట్టుబడులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని, ఇళ్లు, వాహన కొనుగోళ్లకు ఇచ్చినట్లు బంగారానికి రుణాలు ఇవ్వక పోవడం వంటి కారణాలను వ్యాపారులు చెబుతున్నారు.
సీజన్ అయినా...
పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ వ్యాపారాలు లేవు. గతంతో పోలిస్తే ఎన్నడూ లేని విధంగా కొనుగోళ్లు చాలా వరకు పడిపోయాయి. వివాహాలు ఉన్నా అవసరమైన మేరకే ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారు.
- బుశెట్టి రామ్మోహన్‌రావు,
బులియన్ మార్కెట్ మెంబర్
ధరలు తగ్గుతాయని చూస్తున్నారు
బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని తెలుసుకుంటుండటంతో ప్రజలు కొనుగోలు చేసేందుకు వేచిచూస్తున్నారు. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ అయినా అంతంతమాత్రంగానే కొనుగోళ్లు ఉన్నాయి.
- రామమనోహర్,
షరాబు వ్యాపారస్తుల సంఘం అధ్యక్షుడు
ఆర్డర్లు తగ్గాయి...
బంగారం ధరల హెచ్చుతగ్గుల వల్ల ప్రజలు కొనేందుకు ఆసక్తి కనపరచడం లేదు. దీంతో ఆర్డర్లు తగ్గాయి. కొందరు వ్యాపారస్తులు ఇతర ప్రాంతాల నుంచి ఆభరణాలు దిగుమతి చేసుకుంటున్నారు.
- రమణాచారి, స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు