ఈ విద్యార్థి వయస్సు కేవలం ఎనిమిదేళ్లే శుక్రవారంతో నూరేళ్లు నిండాయి మూత్రం పోస్తుండగా పాఠశాల గోడ కూలడంతో ..తిరిగిరాని లోకాలకు వెళ్లి‘పోయాడు’ఈ పాపం ఎవరిదన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు.పునాది లేకుండా నాసిరకంగా గోడకట్టిన పాఠశాల యాజమాన్యానిదా.. అనుమతి లేకున్నా పాఠశాలపై చర్యలు తీసుకోని విద్యాశాఖదా.. ఏమైతేనేం.. ఎలాగైతేనేం..ఓ చిన్నారి ఊపిరి ఆగి‘పోయింది’..! ఓ కన్నతల్లికి కడుపు కోత మిగిలింది..!!
ప్రొద్దుటూరు క్రైం, న్యూస్‌లైన్: పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యం పసివాడి ప్రాణాలను బలిగొంది. కళ్లముందే నిర్లక్ష్యం కనిపిస్తున్నా యాజమాన్యం పట్టించుకోలేదు. ఫలి తంగా తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. స్థానిక నాగేంద్రనగర్‌లో ఉన్న చైతన్య భారతి స్కూల్‌లో మూత్రశాల గోడ కూలడంతో దేవరెడ్డి గురుమహేశ్వరరెడ్డి(8) అనే ఒకటో తరగతి విద్యార్థి మృతి చెందగా గూడూరు అమర్‌నాథ్‌రెడ్డి అనే రెండో తరగతి విద్యార్థికి స్వల్పగాయాల య్యాయి. విరామ సమయంలో విద్యార్థి మూత్రం పోస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు జమ్మలమడుగు మండలం శేశిరెడ్డిపల్లెకు చెందిన పుల్లారెడ్డి ఎనిమిదేళ్ల క్రితం ప్రొద్దుటూరులోని నాగేంద్రనగర్‌కు వచ్చి స్థిరపడ్డాడు. అతనికి భార్య రమాదేవి, కుమారులు గురుమహేశ్వరరెడ్డి, భార్గవ్‌రెడ్డి ఉన్నారు. అతను బేల్దారి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇంటి సమీపంలో ఉన్న చైతన్యభారతి అనే ప్రైవేట్ స్కూల్‌లో కుమారున్ని చ దివిస్తున్నారు. ఈ పాఠశాలను రాజారావు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం పాఠశాల విరామ సమయంలో మరో విద్యార్థితో కలిసి గురుమహేశ్వరరెడ్డి మూత్రం పోయడానికి వెళ్లగా గోడ ఒక్కసారిగా ఆ విద్యార్థిపై పడింది. గోడ శకలాల కింద విద్యార్థి కుప్పకూలి పోయాడు.
మరో విద్యార్థి అమర్‌నాథ్‌రెడ్డి గట్టిగా కేకలు వేశాడు. దీంతో పాఠశాల సిబ్బంది అక్కడికి చేరుకొని విద్యార్థిని గాంధీరోడ్డులోని శ్రీరాములపేటలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ైవె ద్యులు తెలిపారు. గోడ ఇటుకలు విద్యార్థి ఛాతిపై పడటంతోనే మృతి చెంది ఉంటాడని వైద్యులు భావిస్తున్నారు. ఈ సంఘటనలో అమర్‌నాథ్‌రెడ్డికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. మూత్రశాలలో బండలపై సుమారు నాలుగు అడుగుల మేర ఒంటి వరుసతో ఇటుక గోడ నిర్మించారు. పునాది లేకపోవడం వల్లనే బలహీనంగా ఉన్న గోడ కూలిపోయి ఉంటుందని పోలీసులు అంటున్నారు.
కుప్పకూలిన త ల్లిదండ్రులు
తమ కుమారుడు ఇక లేడన్న వార్త విని తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. ఈ దుర్ఘటన జరిగిన వెంటనే యాజమాన్యం తల్లిదండ్రులకు తెలపలేదు. ఆస్పత్రి నుంచి మృతదే హాన్ని తీసుకొని వచ్చిన తర్వాత మరణ వార్త వారికి తెలిసింది. తల్లి రమాదేవి కుమారుడి మృతదేహంపై పడి రోదించసాగింది. వన్‌టౌన్ సీఐ మహేశ్వరరెడ్డి, ఎస్‌ఐ రెడ్డిశేఖర్‌రెడ్డిలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సంఘటనపై ప్రధానోపాధ్యాయురాలు తబితతో సీఐ మాట్లాడారు.
ముందుగా పాఠశాలకు అనుమతి ఉందని చెప్పిన ప్రధానోపాధ్యాయురాలు సంబంధించిన పత్రాలు చూపాలని అడగటంతో అసలు విషయం బయట పడింది. సంఘటనా స్థలాన్ని సందర్శించిన ఎంఈఓ రాజగోపాల్‌రెడ్డి పాఠశాలకు అనుమతి లేదని చెప్పారు. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులకు తెలియచేస్తామని ఆయన అన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు బంగారురెడ్డి, శేఖర్‌లు విద్యార్థి మృతదేహాన్ని సందర్శించి తల్లిదండ్రులను ఓదార్చారు. తండ్రి పుల్లారెడ్డి ఫిర్యాదు మేరకు పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు సీఐ మహేశ్వరరెడ్డి తెలిపారు.
ఈ పాపం ఎవరిది..!
Published Sat, Feb 8 2014 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM
Advertisement
Advertisement