ప్రొద్దుటూరు టౌన్, న్యూస్‌లైన్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇదే చివరి అవకాశం.. మంజూరైన గృహాల్లో వారం రోజుల్లోపు చేరక పోతే సీజ్ చేసి మరొకరికి కేటాయిస్తామని హౌసింగ్ పీడీ సాయినాథ్‌శర్మ నోటీసులు జారీ చేశారు. ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె పంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఫేజ్-1, 2, 3 కింద అర్బన్, రూరల్ పరిధిలో దాదాపు 10 వేల గృహాలను మంజూరు చేశారు. అయితే ఫేజ్-1లోని అర్బన్, రూరల్ పరిధిలో రూ. 40 వేలతో ప్రభుత్వమే గృహాలు నిర్మించి ఇచ్చింది. ఇందులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఫేజ్-2 పరిధిలో మంజూరయిన గృహాలను లబ్ధిదారుడే నిర్మించుకోవాలన్న ఆదేశాలు వచ్చాయి.
ఈ సమయంలోనే ఐహెచ్‌ఎస్‌డీపీ కింద మరో 350కి పైగా గృహాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో రూ.60లక్షల మేర హౌసింగ్ ఏఈలు, వర్క్‌ఇన్‌స్పెక్టర్లు అవినీతికి పాల్పడ్డారంటూ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పట్లో వారిని అరెస్టు కూడా చేశారు.
ఇందిరమ్మ గృహాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో హౌసింగ్ స్పెషల్ అధికారి సుధాకర్‌రెడ్డితో కలెక్టర్ విచారణ చేయించారు. అధికారుల తప్పిదాలపై సుధాకర్‌రెడ్డి లిఖిత పూర్వక విచారణ నివేదికను కలెక్టర్‌కు అందించారు. దీంతో హౌసింగ్ పీడీతోపాటు డీఈలు, ఏఈలతో కలిపి మొత్తం 13 మంది దాకా సస్పెండ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ లబ్దిదారులకు మంజూరయిన గృహాలను 2013 నవంబర్ నెలలో కొందరు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారంటూ కలెక్టర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి.
వారంలోపు చేరాలంటూ నోటీసులు...
ఇందిరమ్మ కాలనీలోని గృహాలను 2013 నవంబర్ 28వ తేదీన హౌసింగ్ పీడీ, డీఈ, ఈఈ, ఏఈలు పరిశీలించారు. గృహాలకు తాళాలు వేసిన వాటిని, ఇంకా నిర్మించు కోకుండా అసంపూర్తిగాా ఉన్న వాటిని, లబ్ధిదారులు కాకుండా మరొకరు నివాసం ఉంటున్న వాటిని గుర్తించి రెండు వారాల గడువు ఇచ్చారు. అయినా లబ్ధిదారులు గృహాల్లో చేరటానికి ముందుకు రాలేదు. మొత్తం 653 లబ్ధిదారుల వివరాలను హౌసింగ్ ఏఈ వెంకటేశ్వర్లు సేకరించారు. ఈ మేరకు నివేదిక అందడంతో వారంలోపు గృహాల్లో చేరాలని, ఇది చివరి అవకాశంగా పేర్కొంటూ శుక్రవారం రాత్రి హౌసింగ్ పీడీ నోటీసులు జారీ చేశారు. వీటిని శనివారం గృహాలకు అంటించారు.
ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వం..
వారంలోపు గృహాల్లో చేరక పోతే ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే సీజ్ చేస్తాం. అలాంటి గృహాలను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరో లబ్ధిదారునికి
కేటాయిస్తాం..
లాస్ట్ ఛాన్స్
Published Sun, Jan 12 2014 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 2:31 AM
Advertisement