sainath sharma
-
ఎయిర్‌పోర్టులోకి తూటాలతో ప్రవేశం
రేణిగుంట(చిత్తూరు జిల్లా): అత్యంత భద్రతా వలయంతో కూడుకున్న ఎయిర్ పోర్టులోకి ఓ టీడీపీ నేత తుపాకీ తూటాలతో ప్రవేశించగా భద్రతా సిబ్బంది గుర్తించారు. రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో శనివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వైఎస్సార్ జిల్లా కమలాపురం సింగిల్ విండో అధ్యక్షుడు సాయినాథ్ శర్మ హైదరాబాద్ వెళ్లేందుకు శనివారం స్పైస్‌జెట్ విమానంలో టికెట్ బుక్ చేసుకున్నాడు. అతను మధ్యాహ్నం 2 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. ప్రవేశ ద్వారం వద్ద సెక్యూరిటీ సిబ్బంది, సీఐఎస్ఎఫ్ సిబ్బంది అతని బ్యాగును తనిఖీ చేయగా 20 బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే విమానాశ్రయం పోలీసులకు సమాచారం అందించారు. ఏర్పేడు సీఐ మురళీ నాయక్ అక్కడకు చేరుకుని బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. సాయినాథ్ అదుపులోకి తీసుకుని రాత్రి 8 గంటల వరకు విచారణ చేసినట్లు సమాచారం. అతను లైసెన్డŠస్ తుపాకీని కలిగి ఉన్నప్పటికీ మారణాయుధాలతో ఎయిర్‌పోర్ట్‌లోకి ప్రవేశించడాన్ని ఎయిర్‌పోర్టు అధికారులు సీరియస్‌గా పరిగణిస్తున్నారు. తనను విడిచి పెట్టాలని, హైదరాబాద్‌లో పని ఉందని, తాను త్వరగా వెళ్లాలని పోలీసులతో సాయినాథ్ గొడవపడినట్లు సమాచారం. టీడీపీ పెద్దలు రంగంలోకి దిగి పోలీసులపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏడాదిన్నర కిందట ఇదే తరహాలో నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి బంధువు తూటాలను తీసుకెళుతూ రేణిగుంట విమానాశ్రయంలోనే పట్టుబడిన విషయం తెలిసిందే. భద్రతా కారణాల దృష్ట్యా ఇక్కడ విజిటర్స్ పాసులను సైతం రద్దు చేసిన నేపథ్యంలో ప్రయాణికుల ముసుగులో మారణాయుధాలతో విమానాశ్రయంలోకి తరచూ ప్రవేశిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. -
బుల్లెట్లతో దొరికిపోయిన టీడీపీ నేత!
సాక్షి, రేణిగుంట : తిరుపతి విమానాశ్రయంలో శనివారం టీడీపీ నేత వద్ద 20 బుల్లెట్లు దొరకడం కలకలం రేపుతోంది. తనిఖీల్లో భాగంగా వైఎస్సార్ జిల్లా కమలాపురం టీడీపీ అభ్యర్థి పుత్తా నర్సింహారెడ్డి ముఖ్య అనుచరుడు, సింగిల్ విండో చైర్మన్ సాయినాథ్ శర్మ వద్ద 20 తూటాలు లభించాయి. దీంతో ఆయనను విమానాశ్రయ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ సాయినాథ్ శర్మ లైసెన్స్డ్ గన్ను పోలీసులకు డిపాజిట్ చేయలేదని సమాచారం. అధికార బలంతో ఆయన గన్ను తనవద్దే ఉంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే సాయినాథ్ శర్మ ఆయుధాన్ని అప్పగించారా లేదా అనేదానిపై కమలాపురం పోలీసులు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. వెపన్ డిపాజిట్‌పై అనుమానాలు... సాయినాథ్ శర్మ వెపన్ డిపాజిట్‌పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వచ్చే నెల (మే) మూడో తేదీతో గడువు ముగియనుంది. లైసెన్స్ దారుడు తన వద్ద ఉన్న ఆయుధాన్ని డిపాజిట్ చేస్తే పోలీసులు రసీదు ఇస్తారు. ఆ రసీదు ఆధారంగా ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు కూడా లైసెన్స్‌దారుడు సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. అయితే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి పూర్తయ్యేవరకూ ఆయుధంతో పాటు తుటాలను కూడా కచ్చితంగా పోలీసుల వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా పోలీసులు ఆయుధం నెంబర్, లైసెన్స్‌లో ఉన్న నంబర్ అదేవిధంగా జారీ చేసిన బుల్లెట్లకు సంబంధించిన నంబర్లు పరిశీలించిన తర్వాతే డిపాజిట్‌ను స్వీకరిస్తారు. ఆయుధ లైసెన్స్ ఉన్నప్పటికీ, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి బుల్లెట్లు కలిగి ఉండటం నేరమని స్థానిక డీఎస్పీ చంద్రశేఖర్ తెలిపారు. టీడీపీ నేత సాయినాథ్ శర్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఆయన అన్నారు. ఈ విషయంపై టీడీపీ నేత సాయినాథ్ స్పందిస్తూ.. పోలీసులు తనకు నోటీస్ ఇవ్వకున్నా...ఆర్మ్ హౌస్ వద్ద గన్ డిపాజిట్ చేశానని తెలిపారు. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. -
లాస్ట్ ఛాన్స్
ప్రొద్దుటూరు టౌన్, న్యూస్‌లైన్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇదే చివరి అవకాశం.. మంజూరైన గృహాల్లో వారం రోజుల్లోపు చేరక పోతే సీజ్ చేసి మరొకరికి కేటాయిస్తామని హౌసింగ్ పీడీ సాయినాథ్‌శర్మ నోటీసులు జారీ చేశారు. ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె పంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఫేజ్-1, 2, 3 కింద అర్బన్, రూరల్ పరిధిలో దాదాపు 10 వేల గృహాలను మంజూరు చేశారు. అయితే ఫేజ్-1లోని అర్బన్, రూరల్ పరిధిలో రూ. 40 వేలతో ప్రభుత్వమే గృహాలు నిర్మించి ఇచ్చింది. ఇందులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఫేజ్-2 పరిధిలో మంజూరయిన గృహాలను లబ్ధిదారుడే నిర్మించుకోవాలన్న ఆదేశాలు వచ్చాయి. ఈ సమయంలోనే ఐహెచ్ఎస్డీపీ కింద మరో 350కి పైగా గృహాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో రూ.60లక్షల మేర హౌసింగ్ ఏఈలు, వర్క్ఇన్స్పెక్టర్లు అవినీతికి పాల్పడ్డారంటూ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పట్లో వారిని అరెస్టు కూడా చేశారు. ఇందిరమ్మ గృహాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో హౌసింగ్ స్పెషల్ అధికారి సుధాకర్‌రెడ్డితో కలెక్టర్ విచారణ చేయించారు. అధికారుల తప్పిదాలపై సుధాకర్‌రెడ్డి లిఖిత పూర్వక విచారణ నివేదికను కలెక్టర్‌కు అందించారు. దీంతో హౌసింగ్ పీడీతోపాటు డీఈలు, ఏఈలతో కలిపి మొత్తం 13 మంది దాకా సస్పెండ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ లబ్దిదారులకు మంజూరయిన గృహాలను 2013 నవంబర్ నెలలో కొందరు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారంటూ కలెక్టర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. వారంలోపు చేరాలంటూ నోటీసులు... ఇందిరమ్మ కాలనీలోని గృహాలను 2013 నవంబర్ 28వ తేదీన హౌసింగ్ పీడీ, డీఈ, ఈఈ, ఏఈలు పరిశీలించారు. గృహాలకు తాళాలు వేసిన వాటిని, ఇంకా నిర్మించు కోకుండా అసంపూర్తిగాా ఉన్న వాటిని, లబ్ధిదారులు కాకుండా మరొకరు నివాసం ఉంటున్న వాటిని గుర్తించి రెండు వారాల గడువు ఇచ్చారు. అయినా లబ్ధిదారులు గృహాల్లో చేరటానికి ముందుకు రాలేదు. మొత్తం 653 లబ్ధిదారుల వివరాలను హౌసింగ్ ఏఈ వెంకటేశ్వర్లు సేకరించారు. ఈ మేరకు నివేదిక అందడంతో వారంలోపు గృహాల్లో చేరాలని, ఇది చివరి అవకాశంగా పేర్కొంటూ శుక్రవారం రాత్రి హౌసింగ్ పీడీ నోటీసులు జారీ చేశారు. వీటిని శనివారం గృహాలకు అంటించారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వం.. వారంలోపు గృహాల్లో చేరక పోతే ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే సీజ్ చేస్తాం. అలాంటి గృహాలను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరో లబ్ధిదారునికి కేటాయిస్తాం..